అంతర్జాతీయం

అమెరికా పొమ్మంటోంది… రష్యా రమ్మంటోంది

అమెరికా పొమ్మంటోంది. రష్యా రమ్మంటోంది. అగ్రనేతలు ట్రంప్, పుతిన్ భారతీయులపైనే ఫోకస్ పెట్టారు. ఉద్యోగాలున్నాయి వెల్కమ్ అంటూ రష్యా రెడ్ కార్పెట్ వేస్తుంటే జాబ్‌లోంచి తీస్తూ షాకిస్తున్నాయి అమెరికన్ కంపెనీలు. తానే శాశ్వతంగా అమెరికా అధ్యక్షుడనన్న కలరింగ్ ఇస్తూ అమెరికాను ట్రంప్ అధఃపాతాళానికి నెట్టేస్తున్నాడు. ప్రపంచదేశాలను బలిపీఠంపైకి నట్టేస్తున్నాడు. కానీ పుతిన్ మాత్రం 10లక్షల ఉద్యోగాలంటూ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు.

ఇప్పటికే రక్షణరంగంలో ఆయుధాలను భారత్‌కు సరఫరా చేసి పాకిస్థాన్‌ నడ్డివిరిచేలా వెన్నుతట్టిన రష్యా తాజాగా ఉద్యోగాలకు రారమ్మని పిలవడం వెనకున్న రహస్యమేంటి..? మున్ముందు రష్యా మినీభారత్ కానుందా..? అమెరికా, యూరప్‌, దుబాయ్‌ దేశాలకు క్యూ కట్టే భారతీయులు పుతిన్ ఆఫర్‌ను కళ్లకు అద్దుకుంటారా..? రష్యన్ జాబ్స్
మనోళ్లు చేయగలరా..?

మాస్కో నుంచి పుతిన్ మనల్ని రారమ్మని పిలుస్తున్నారు. ఒక్కటి కాదు, రెండు కాదు ఏకంగా 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. ఇప్పటికే రక్షణరంగంలో ఆయుధాలను భారత్‌కు సరఫరా చేసి పాక్ నడ్డివిరిచేలా వెన్నుతట్టిన పుతిన్ ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తామంటూ రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. నమ్మకమైన ఇండియన్ల కోసం రష్యన్ కంపెనీలు ఎదురుచూస్తున్నాయి. మిత్రుడు ఆప్త కాలంలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడంతో రష్యాలో భారతీయం పాడేందుకు ఇదే సరైన సమయం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా రష్యాకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్లకు ఉన్న చమురు ఉత్పత్తులు, ఆ చమురుకు విపరీతమైన డిమాండ్ ఉండడమే కారణం. దేశంలోని పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికశక్తి కొరతను అధిగమించేందుకు భారత్‌ వైపు దృష్టి సారించింది రష్యా. ఏడాది చివరి నాటికి 10 లక్షల మంది నైపుణ్యం కలిగిన వ్యక్తులకు ఉపాధి కల్పించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే యాకటెరిన్‌బర్గ్‌లో కొత్త కాన్సులేట్‌ జనరల్ ప్రారంభం కానుంది. ఇది వలస కార్మికుల అంశాలను పరిశీలించనుంది. ఈ విషయాన్ని ఉరల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చీఫ్ అండ్రీ వెల్లడించారు.

భారత్ నుంచి ఏటా లక్షల మంది విదేశాలకు బతుకుదెరువు కోసం వెళ్తూ ఉంటారు. విదేశాల్లో పనిచేస్తే అధిక వేతనాలు వస్తాయనే ఆశతో వెళ్తారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో భారతీయులు పనిచేస్తున్నారు. ఇక అమెరికా, బ్రిటన్ సహా వెస్ట్రన్ దేశాలు ప్రస్తుతం తమ దేశానికి ఉద్యోగ, ఉపాధి కోసం వలస వచ్చే ప్రపంచ దేశాల పౌరులపై కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి.

రకరకాల కారణాలు, కొత్త కొత్త నిబంధనలతో ఆయా దేశాలకు వెళ్లాలంటేనే భయపడేలా చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లే భారతీయులకు గుడ్‌న్యూస్ చెప్పింది రష్యా. ఉరల్ పర్వతాలకు సమీపంలోని యాకటెరిన్ బర్గ్ ప్రాంతం భారీ పరిశ్రమలకు నిలయంగా ఉంది. అక్కడ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కూడా ఉంది. ఈ పారిశ్రామిక సంస్థలు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉంది.

రష్యాలో మానవ వనరుల కొరత ఎక్కువగా ఉంది. భారత్‌లో నైపుణ్యం కలిగిన కార్మికులు పుష్కలంగా ఉన్నారు. యంత్రాలు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లోని ఉద్యోగాలకు నిపుణులను తీసుకోవడంపై రష్యన్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. రష్యాలోని నిబంధనలు, చట్టాలు, కోటాలకు లోబడి అక్కడి కంపెనీలు మనోళ్లను నియమించుకోనున్నాయి. ఇప్పుడైతే నిర్మాణ, టెక్స్‌టైల్స్ రంగాల్లో ఎక్కువగా ఇండియన్స్ పనిచేస్తున్నారు. యంత్రాలు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో బాగా డిమాండ్ ఉంది.

మరోవైపు దేశ విదేశాంగ విధానంలో రష్యాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎప్పటినుంచో మనకు మిత్రదేశం. భారత రాయబార కార్యాలయం లెక్కల ప్రకారం… అక్కడ 14 వేల మంది భారతీయులు ఉన్నారు. ఇక భారతీయ మూలాలు ఉన్నోళ్లు 1500 మంది నివసిస్తున్నారు. వీరిలో మెడికల్ అండ్ టెక్నాలజీ సంస్థల్లో విద్యను అభ్యసిస్తున్నారు.

అక్కడ 4,500 మంది భారతీయ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వారిలో సుమారు 90 శాతం మంది దేశవ్యాప్తంగా ఉన్న 20 యూనివర్సిటీల్లో మెడిసిన్ చదువుతున్నారు. మిగిలిన వారు ఇంజనీరింగ్, ఏరోనాటికల్ డిజైనింగ్, కంప్యూటర్ సైన్స్, ట్రాన్స్‌పోర్టు టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, అగ్రికల్చర్, మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చదువుకుంటున్నారు.

మూడున్నరేళ్లుగా రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తోంది. దీంతోపాటు రష్యాలోని యువ జనాభా ఫ్యాక్టరీల్లో పనిచేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. దీనివల్ల తప్పనిసరిగా ఇతర దేశాల నుంచి భారీగా శ్రామిక శక్తి రష్యాకు అవసరం అవుతోంది. రష్యా కార్మికశాఖ అంచనా ప్రకారం 2030 నాటికి ఆ దేశంలో కార్మిక శక్తి కొరత 3.1 మిలియన్లుగా ఉంది. దీంతో విదేశీ కార్మికులను ఆహ్వానిస్తోంది. ఇండియాతో పాటు శ్రీలంక, ఉత్తరకొరియా నుంచి కార్మికులను రప్పించేందుకు పుతిన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

అయితే ఆ ప్రక్రియలో కొన్ని సమస్యలు ఉన్నాయి. మాస్కోలో భారతీయ కార్మికుల సంఖ్య పెరుగుతుండటంతో రాయబార కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది. పౌరులు రాకపోకలు సాగించేటపుడు పాస్‌పోర్ట్ గడువు పొడిగించుకోవడానికి, పాస్‌పోర్ట్ పోయినపుడు లేదా పిల్లలు పుట్టిన తర్వాత రాయబార కార్యాలయం సేవలు అవసరం అవుతాయి. పాస్‌పోర్ట్‌లు అప్‌డేట్‌,అప్రూవల్ వంటి సేవలు మరింత వేగవంతం కానున్నాయి.

ఇప్పటికే అమెరికాలో చదువుల కోసం ప్రయత్నిస్తున్న, అగ్రరాజ్యంలో ఉంటున్న విదేశీ విద్యార్థులపై మరో పిడుగు పడింది. ఇప్పటికే వీసాల జారీకి సోషల్‌ మీడియా వెట్టింగ్‌ను కఠినంగా అమలుచేస్తోన్న అగ్రరాజ్యం తాజాగా మరో మార్పు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. విద్యార్థులు, ఎక్స్ఛేంజ్‌ విజిటర్లు, మీడియా ప్రతినిధులకు జారీ చేసే వీసాలకు పరిమిత కాల గడువు విధిస్తూ ప్రతిపాదనలను ఆవిష్కరించింది. ఇకపై విదేశీ విద్యార్థులు నాలుగేళ్లకు మించి అమెరికాలో ఉండకుండా వీసా నిబంధనల్లో మార్పులు చేయనుంది డొనాల్డ్ ప్రభుత్వం. దీంతో అమెరికా కంటే రష్యనే బెటర్ అంటున్నారు ప్రవాసభారతీయులు.

రష్యాకు మ్యాన్‌పవర్‌ అవసరం. భారతీయుల్లో ఆ నైపుణ్యం ఉంది. పాశ్చాత్య దేశాలు వలస నియమాలను కఠినతరం చేస్తున్న సమయంలో రష్యా వీసా నిబంధనల్ని సడలించింది. భారతీయులకు ఊతం ఇచ్చేలా నిబంధనలు మార్చింది. తద్వారా స్థానిక రష్యా కంపెనీలన్నీఇండియన్లను నియమించుకుంటున్నాయి. ఇప్పటికే అనేకమంది భారతీయులు మాస్కోకు క్యూ కట్టారు. ఇంకెందుకు ఆలస్యం రష్యన్ కంపెనీలు కోరుకున్న స్కిల్స్ మీలో ఉంటే మీరు కూడా ట్రై చేయండి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button