అంతర్జాతీయం

Donald Trump: రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై 500% టారిఫ్‌!

Donald Trump: రష్యాపై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక అడుగు వేశారు. రష్యాతో బిజెన్స్ వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపై అతిపెద్ద టారిఫ్‌లను విధించడానికి అవకాశమున్న బిల్లును అమెరికా సెనేట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే రష్యా నుంచి వస్తువులు దిగుమతి చేసుకునే ఏ దేశానికైనా అమెరికా భారీగా సుంకాలు విధించేందుకు చట్టబద్ధ హక్కును సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై అమెరికా 25 శాతం దిగుమతి సుంకం, అదనంగా 25 శాతం జరిమానా విధిస్తోంది.

మొత్తం 50 శాతం టారిఫ్‌ ప్రభావం కొనసాగుతుండగా, ఇప్పుడు ట్రంప్ ప్రతిపాదిస్తున్న కొత్త చర్యలతో ఈ టారిఫ్‌ను ఏకంగా 500 శాతం వరకూ పెంచే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి రష్యాపై అనేక రకాల ఆంక్షలు అమలు చేస్తున్న అమెరికా, ఇప్పుడు ఆ దేశంతో సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపైనా మరింత కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది.

ఈ చర్యలు భారత్‌పై గణనీయంగా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రష్యా నుంచి ముడిచమురు దిగుమతి విషయంలో అమెరికా ఇప్పటికే భారత్‌ను ఒత్తిడి చేస్తోంది. ఈ నేపథ్యంలో గత నెలలో భారత్ రష్యా చమురు కొనుగోళ్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజా టారిఫ్‌ ప్రతిపాదనలు ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు జరుగుతున్న సమయంలో ఈ బిల్లు రావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా విధిస్తున్న 50 శాతం టారిఫ్‌ ప్రభావంతో గత అయిదు నెలల్లో భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతులు 37 శాతం తగ్గినట్లు వాణిజ్య వర్గాలు వెల్లడించాయి.

ముఖ్యంగా క్రిస్మస్‌ సీజన్‌కు సంబంధించిన దుస్తుల ఆర్డర్లు కూడా గణనీయంగా పడిపోయాయి. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో భారత్‌ చర్చల మార్గంలో సర్దుబాట్లు చేసుకుంటూ ముందుకు సాగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ రష్యా మాత్రమే కాకుండా ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశాలపైనా ఇలాంటి భారీ ఆంక్షలు విధించవచ్చని సంకేతాలు ఇచ్చారు. దీంతో భవిష్యత్‌ ఆర్థిక దృశ్యం మరింత కఠినంగా మారే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు వంటగ్యాస్‌ ఎల్పీజీ సరఫరా విషయంలో ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుంచి పెద్దఎత్తున ఎల్పీజీ దిగుమతి చేసుకునే ఒప్పందంపై భారత్ అధికారికంగా సంతకాలు చేసింది. ఒప్పందం ప్రకారం భారత్ మొత్తం ఎల్పీజీ దిగుమతుల్లో ఏటా 10 శాతం అమెరికా నుంచే కొనుగోలు చేయనుంది. అమెరికా గల్ఫ్ తీరం నుంచి 2028 నాటికి సుమారు 22 లక్షల టన్నుల ఎల్పీజీని దేశీయ చమురు సంస్థలు దిగుమతి చేసుకోనున్నాయని పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. భారత చరిత్రలో అమెరికాతో ఇలాంటి భారీ ఎల్పీజీ కొనుగోలు ఒప్పందం ఇదే మొదటిదని ఆయన వివరించారు.

ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వంటి ప్రభుత్వ చమురు సంస్థల ప్రతినిధుల బృందం గత కొన్ని నెలలుగా అమెరికాను పలుమార్లు సందర్శించి, అక్కడి ప్రముఖ ఎనర్జీ కంపెనీలతో విస్తృతంగా చర్చలు జరిపినట్లు మంత్రి పురి వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎల్పీజీ వినియోగంలో భారత్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉందని పురి చెప్పారు. గత ఏడాది అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు 60 శాతం వరకూ పెరిగాయని, దాంతో ఒక్కో సిలిండర్‌ ధర రూ.1100 దాటే స్థాయికి చేరిందని తెలిపారు. అయినప్పటికీ, ఈ పెరుగుదల భారాన్ని ప్రజలపై మోపకుండా ప్రభుత్వం ఇప్పటివరకు 40 వేల కోట్లు సబ్సిడీ రూపంలో భరించిందన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button