Thailand: రైలుపై జారిపడిన క్రేన్.. 22 మంది మృతి

Thailand: థాయ్‌లాండ్‌లో భయంకర రైలు ప్రమాదం జరిగింది. కదులుతున్న ప్రయాణికుల రైలుపై ఓ భారీ క్రేన్ అకస్మాత్తుగా జారిపడటంతో రైలు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 22 మంది మృతి చెందగా, 30 మందికిపైగా గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
బ్యాంకాక్‌కు సుమారు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిఖియో జిల్లాలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్‌కు సంబంధించిన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ పనుల్లో భాగంగా ఉపయోగిస్తున్న క్రేన్ అదుపుతప్పి కింద పడింది. అదే సమయంలో పట్టాలపై నుంచి ప్రయాణికుల రైలు వెళ్తుండటంతో ఈ ప్రమాదం జరిగింది.
క్రేన్ రైలుపై పడటంతో పలువురు బోగీలు పట్టాలు తప్పాయి. కొన్ని బోగీల్లో మంటలు కూడా చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో రైలులో సుమారు 150 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.



