తెలంగాణ
సుడిగాలి బీభత్సం.. నేలకొరిగిన చెట్లు.. దెబ్బతిన్న పత్తి, మిర్చి పంటలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో సుడిగాలుల బీభత్సం సృష్టించాయి. లెంకలగడ్డలో ఒక్కసారిగా భారీ సుడిగాలులు వీచాయి. దీంతో 2 ఎకరాల్లో చెట్లు, పత్తి, మిర్చి పంటలు నెలకొరిగాయి. వ్యవసాయ అవసరాల కోసం మోటార్లను తరలిస్తున్న ఎద్దుల బండి కూడా సుడిగాలుల ఉధృతికి కొట్టుకపోయింది.
సుడిగాలులు ధాటికి భయాందోళనకు గురైన స్థానికులు పరుగులు తీశారు. సుడిగాలుల బీభత్సంతో 200 చిన్న, పెద్ద చెట్లు నేలకొరిగాయని పలిమెల ఎఫ్ఆర్వో నాగరాజు తెలిపారు. లెంకలగడ్డ అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న వ్యవసాయ భూముల్లోని 10 ఎకరాల్లో మిర్చి, పత్తి పంటలు కూడా ధ్వంసం అయ్యాయని వెల్లడించారు. ఇక సుడిగాలులతో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.



