టీఎస్ హైకోర్టు ఇచ్చిన గడువులోగా స్థానిక ఎన్నికలు జరుగుతాయా?

హైకోర్టు చెప్పినట్లు తెలంగాణ స్థానిక ఎన్నికలకు ముహుర్తం కుదురుతుందా? లేదంటే మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందా? బీసీ రిజర్వేషన్లు పెంచుతూ పంచాయతీ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఎప్పటిలోగా ఆమోదముద్ర వేస్తారు? అసలు ఆమోదం ఇస్తారా? లేదంటే న్యాయ సలహా పేరుతో ఆలస్యం చేసే అవకాశముందా అనే సందేహాలు వస్తున్నాయి. సుప్రీంకోర్టు గత తీర్పులకు భిన్నంగా 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్ దాటుతూ ఆర్డినెన్స్ తేవడమే గవర్నర్ ముందున్న న్యాయ సందేహం అనే టాక్ వస్తోంది.
గతంలో పంచాయతీలో బీసీ రిజర్వేషన్ల బిల్లును గవర్నర్ రాష్ట్రపతి దగ్గర పంపించడంతో ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి హైదరాబాద్ వచ్చేముందు ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసే ఛాన్స్ ఉన్నట్లు హస్తినలో ప్రచారం జరుగుతోంది.
రాష్ట్రపతి దగ్గరున్న పంచాయతీ రిజర్వేషన్ల బిల్లుపై మోడీతో మాట్లాడి, 9వ షెడ్యూల్లో చేర్చేలా తగు చర్యల కోసం విన్నవించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బీసీ సంఘాల నుంచి, ప్రతిపక్షాల నుంచి 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం రేవంత్ సర్కార్‌పై తీవ్ర ఒత్తిడి ఉంది. బిల్లు తెచ్చినా, ఆర్డినెన్స్ చేసినా చివరకు 42 శాతంతో ఎన్నికలు జరక్కపోయినా, స్థానిక సమరం మరింత ఆలస్యమైనా రేవంత్ సర్కార్ తీవ్ర విమర్శలు ఎదుర్కోకతప్పదనే విశ్లేషణలు వస్తున్నాయి.