Hyderabad: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. భర్తను హత్య చేసిన భార్య

Hyderabad: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో ఓ భార్య తన భర్తను హత్య చేసి అనుమానాస్పద మృతిలా చిత్రీకరించింది. చివరికి నిజం బయటపడడంతో నిందితురాలని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పరిధిలోని మీర్‌పేటలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అల్లంపల్లి విజయ్‌కుమార్ (42), సంధ్య దంపతులు జిల్లెలగూడలోని సాయి నగర్ కాలనీలో నివసిస్తున్నారు. వారికి ముగ్గురు పిల్లల సంతానం. విజయ్‌కుమార్ ఆటో నడుపుతుండగా, సంధ్య మీర్‌పేట మునిసిపల్ కార్పొరేషన్లో పారిశుధ్య కార్మికురాలిగా పని చేస్తోంది. సంధ్య కొంతకాలంగా తన సహోద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
ఈ విషయం భర్తకు తెలియడంతో దంపతుల మధ్య కొంతకాలంగా విబేధాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే అక్రమ సంబంధానికి అడ్డుగా మారాడనే కోపంతో సంధ్య హత్యకు పాల్పడింది. సోమవారం తెల్లవారుజామున భర్త నిద్రలో ఉండగా ఇనుపరాడుతో దాడి చేసి హతమార్చింది.
అనంతరం మృతదేహాన్ని ఇంటి ముందు పడేసి, అనుమానాస్పద మృతిలా నాటకం ఆడింది. మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారించగా వారి దర్యాప్తులో భార్య సంధ్యే నిందితురాలుగా గుర్తించారు. సంధ్యను వారి స్టైల్లో ఎంక్వైరీ చేయగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.



