America: ప్రపంచానికి పెద్ద సవాల్‌గా మారిన అమెరికా ఫస్ట్ విధానం

America: ప్రపంచానికి దారి చూపిన దేశం. కానీ ఇప్పుడు అది ఒంటరి దేశంగా మారుతోంది. ఒకప్పుడు ప్రపంచానికి పెద్దన్నగా, రక్షకుడిగా ఉన్న అమెరికా, ఇప్పుడు తన సొంత ప్రయోజనాల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు ఇతర దేశాలకు ఊపిరి ఆడకుండా చేస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ 2025లో రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. డొనాల్డ్ అనుసరిస్తున్న “అన్-ప్రిడిక్టబిలిటీ వల్ల దౌత్య ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి.
గత దశాబ్ద కాలంగా ప్రపంచం అమెరికాను ఒక గ్లోబల్ పోలీస్‌గా చూసింది. కానీ, 2025-26లో అమెరికా అనుసరిస్తున్నఅమెరికా ఫస్ట్ విధానం ఇప్పుడు ప్రపంచ దేశాలకు పెద్ద సవాలుగా మారింది. అమెరికా తన ప్రయోజనాల కోసం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు అంతర్జాతీయ సంబంధాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. అమెరికా తన మొండి వైఖరిని మార్చుకోకపోతే, అది కేవలం ఇతర దేశాలకే కాదు, అంతిమంగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా ముప్పుగా మారుతుంది. అమెరికా తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రపంచాన్ని షాక్ గురి చేసింది. సుమారు 66 అంతర్జాతీయ సంస్థల నుండి అమెరికా వైదొలగాలని నిర్ణయించుకుంది. ఇందులో WHO , UNESCO వంటి 31 ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు ఉన్నాయి.
ఈ సంస్థలకు అమెరికా ఇచ్చే భారీ నిధులు ఆగిపోతే, పేద దేశాల్లో పోలియో వంటి వ్యాధుల నిర్మూలన, విద్యా కార్యక్రమాలు కుప్పకూలనున్నాయి. దీనివల్ల ఏర్పడే ఖాళీని చైనా వంటి దేశాలు ఆక్రమించుకునే ప్రమాదం ఉంది. ట్రంప్ ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రపంచం ఎదుర్కొంటున్న ఆరోగ్య, విద్యా సమస్యలను అమెరికా గాలికొదిలేసిందని విమర్శకులు వాదిస్తున్నారు. ఇది అమెరికాను ప్రపంచ దేశాల నుండి ఒంటరిని చేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు
ఇరాన్‌లో జరుగుతున్న నిరసనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం తీవ్రమైంది. కరెన్సీ విలువ దారుణంగా పడిపోవడం, నిత్యావసర ధరలు పెరగడంతో ప్రజలు దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పరిణామాలపై స్పందిస్తూ ఇరాన్ ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై హింసకు దిగితే అమెరికా రంగంలోకి దిగుతుందని, తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ప్రకటించారు. ఇరాన్ పౌరులను కాపాడే ఉద్దేశంతో అమెరికా సైనిక చర్యకు పూనుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇటీవల వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో విషయంలో అమెరికా తీసుకున్న చర్యలు ఇరాన్ విషయంలో కూడా పునరావృతం కావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అమెరికా హెచ్చరికలపై ఇరాన్ సుప్రీం నాయకుడి సలహాదారులు, ఉన్నతాధికారులు గట్టిగా స్పందించారు. తమ దేశ అంతర్గత విషయాల్లో అమెరికా జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని, ఒకవేళ జోక్యం చేసుకుంటే అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.ఇరాన్ భద్రత తమకు “రెడ్ లైన్” అని, దానిని దాటితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు స్పష్టం చేశారు.
వెనిజులాపై అమెరికా తీరు మరో పెద్ద వివాదంగా మారింది. ఇటీవల వెనిజులా అధ్యక్షుడిని అమెరికా బలవంతంగా తొలగించి తన ఆధీనంలోకి తీసుకుంది. ఆ దేశ చమురు నిల్వలను నియంత్రించేందుకని అమెరికాపై ఆరోపణలు ఉన్నాయి. ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని చైనా, రష్యా వంటి దేశాలు వాదిస్తున్నాయి. వెనిజులా అధ్యక్షుడు మదురోను అధికారికంగా గుర్తించకపోవడమే కాకుండా, ఆ దేశ అంతర్గత విషయాల్లో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడాన్ని రష్యా, చైనా వంటి దేశాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి.
ఇది ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించకపోవడమేనని, అమెరికా మళ్లీ పాత కాలపు సామ్రాజ్యవాద ధోరణిని ప్రదర్శిస్తోందని విమర్శలు వస్తున్నాయి. ఒక దేశం మరో దేశంపై ఇలా ఏకపక్షంగా సైనిక చర్యలు చేపడితే ప్రపంచ శాంతికి అర్థమే ఉండదు. ఇది కొత్త యుద్ధాలకు దారితీయవచ్చని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది.
అమెరికా దిగుమతులపై విధిస్తున్న భారీ పన్నులు ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ట్రంప్ తనను తాను టారిఫ్ మ్యాన్‌గా అభివర్ణించుకుంటూ, చైనా, మెక్సికో, కెనడా భారత్ వంటి దేశాలపై భారీ దిగుమతి పన్నులు విధిస్తున్నారు. దీనివల్ల వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడిపై భారం పడుతుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. పైగా, ఇది గ్లోబల్ సప్లై చైన్‌ను దెబ్బతీసి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మందగమనంలోకి నెట్టేస్తుందని విమర్శిస్తున్నారు. అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న అమెరికా ఫస్ట్” విధానంలో భాగంగా దిగుమతులపై భారీ పన్నులు విధిస్తున్నారు.
భారతదేశం నుండి అమెరికాకు వెళ్లే దుస్తులు, జ్యువెలరీపై సుమారు 50% వరకు పన్నులు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఎగుమతులు తగ్గి, వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం తలెత్తుతోంది. ఇది గ్లోబల్ సప్లై చైన్‌ను దెబ్బతీసి, వస్తువుల ధరలు పెరగడానికి కారణమవుతోంది. చైనాకే కాకుండా, భారత్ వంటి దేశాలకు కూడా ఇబ్బందికరంగా మారింది. దీనివల్ల అంతర్జాతీయ వాణిజ్యం మందగించి, వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.
ప్రపంచానికి ఒక సుస్థిరమైన ఫైనాన్స్ వ్యవస్థను అందించేందుకుగాను ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి ఆర్థిక, ఫైనాన్స్ వ్యవస్థలు కూడా పుట్టుకువచ్చాయి. ఈ ఆర్థిక, ఫైనాన్స్ వ్యవస్థల ఆవిర్భావం 1944లో అమెరికాలోని న్యూహాంషైర్‌లోని బ్రెట్టన్‌వుడ్స్‌లో 44 దేశాల సమావేశంలో జరిగింది. ఈ సమావేశంలోనే డాలర్ కరెన్సీని అగ్రగామి స్థానాన్నినిలబెట్టిన నిర్ణయం కూడా జరిగింది. ఆ నిర్ణయం ప్రకారం అమెరికా కరెన్సీ డాలర్ ప్రపంచానికి రిజర్వ్ కరెన్సీ అయ్యింది. అంటే, వివిధ ప్రపంచ దేశాల మధ్యన జరిగే వ్యాపారం, లావాదేవీలలో వినియోగించుకునే మారకం సాధనంగా డాలర్‌ను నాటి బ్రెట్టన్‌వుడ్స్ సమావేశంలో ప్రపంచ దేశాలు ఆమోదించుకున్నాయి.
అయితే అమెరికా తన కరెన్సీని ఇతర దేశాలను నియంత్రించడానికి ఆయుధంగా వాడుతుండటంతో, ఇప్పుడు ప్రపంచం “డి-డాలరైజేషన్ వైపు మొగ్గు చూపుతోంది. అమెరికా తన మొండి వైఖరిని మార్చుకోకపోతే, అది కేవలం ఇతర దేశాలకే కాదు, అంతిమంగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా ముప్పుగా మారుతుంది. ప్రపంచం ఇప్పుడు ఒక కొత్త నాయకత్వం కోసం లేదా బహుళ దేశాల భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తోంది. BRICS వంటి కూటములు బలోపేతం అవుతున్నాయి.
ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను రెండుగా చీల్చే ప్రమాదం ఉంది. అమెరికా తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి వడ్డీ రేట్లను ఇష్టానుసారం మార్చడం వల్ల ఇతర దేశాల కరెన్సీలు బలహీనపడుతున్నాయి. దీనివల్ల ఇతర దేశాలు డాలర్‌ను కాదని సొంత కరెన్సీల్లో వాణిజ్యం చేసుకోవాలని చూస్తున్నాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను రెండుగా చీల్చేలా ఉంది.
వలసదారుల దేశం అని పిలవబడే అమెరికా ప్రతిష్ట ట్రంప్ నిర్ణయాలతో మసకబారుతోందని, ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్న చర్య అని విమర్శలు వస్తున్నాయి.దశాబ్దాలుగా అమెరికాలో నివసిస్తున్న వారిని అకస్మాత్తుగా వెనక్కి పంపడం వల్ల, అమెరికా పౌరసత్వం ఉన్న వారి పిల్లలు తల్లిదండ్రులకు దూరం అవుతున్నారు. ట్రంప్ నిర్ణయాలు సామాజికంగా పెద్ద సంక్షోభానికి దారితీస్తోంది.
అమెరికా సరిహద్దులను మూసివేయడం వల్ల కలిగే నష్టాలు కేవలం ఆ దేశానికే కాదు, ప్రపంచ దేశాలకు కూడా వర్తిస్తాయి. మెక్సికో , కెనడాతో అమెరికాకు ఉన్న సరిహద్దులు మూసివేయడం వల్ల రవాణా నిలిచిపోతుంది. దీనివల్ల కార్లు, ఆహార పదార్థాలు ,ఎలక్ట్రానిక్స్ వస్తువుల సరఫరా ఆగిపోయి, ప్రపంచవ్యాప్తంగా ధరల పెరుగుదలకు దారితీస్తుంది.
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కాలుష్య కారక దేశమైన అమెరికా బాధ్యత నుండి తప్పుకుంటే, గ్లోబల్ వార్మింగ్‌ను అరికట్టడం అసాధ్యం. ఇది మన తర్వాతి తరాల మనుగడకే ముప్పుగా మారుతుంది. మిగిలిన దేశాలు మాత్రమే పర్యావరణాన్ని ఎలా కాపాడగలవు? ఇది భూతాపాన్ని పెంచి ప్రకృతి వైపరీత్యాలకు కారణమవుతుంది.
క్లైమేట్ చేంజ్ అనేది ఒక “కట్టుకథ” అని కొట్టిపారేస్తూ, పారిస్ ఒప్పందం నుండి తప్పుకోవడంపై పర్యావరణ ప్రేమికులు మండిపడుతున్నారు. ప్రపంచం వినాశనం అంచున ఉన్న సమయంలో, బాధ్యతాయుతమైన దేశంగా ఉండాల్సిన అమెరికా తన స్వార్థం చూసుకోవడం అన్యాయమని పర్యావరణవేత్తలు అంటున్నారు.
ఒక నాయకుడు తన దేశ ప్రయోజనాలు చూసుకోవడం తప్పు కాదు, కానీ ఒక అగ్రరాజ్యంగా ప్రపంచ బాధ్యతలను విస్మరించడం ప్రమాదకరంగా మారింది. అమెరికా ఒంటరిగా మారితే అది ఆ దేశానికే కాదు, యావత్ ప్రపంచానికే నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ అమెరికాపై ఆధారపడకుండా “ఆత్మనిర్భర్”దిశగా అడుగులు వేయాల్సిన సమయం వచ్చింది.ట్రంప్ విధానాలు “అమెరికాను మళ్ళీ గొప్పగా చేస్తాయని ఆయన మద్దతుదారులు నమ్ముతుంటే, విమర్శకులు మాత్రం ఇవి “ప్రపంచ అస్థిరతకు” దారితీస్తాయని భావిస్తున్నారు.



