ఆపరేషన్ సిందూర్ దెబ్బకు ఉగ్రవాదుల్లో వణుకు

పాకిస్తాన్ అంటే ఉగ్రవాదులకు కేరాఫ్ అడ్రస్. ఇది కాదనలేని సత్యం. అందుకు నిదర్శనమే పహల్గాం ఉగ్రదాడి. కానీ పైకి మాత్రం ఉగ్రవాదులతో సంబంధాలు లేవని వేదికలపై మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ పాక్ కు చుక్కలు చూపిస్తుంది. ముప్పెట దాడులు చేసి దాయాదిని అల్లకల్లోలానికి గురి చేసింది.
ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. దీంతో పాక్‌కు గట్టి దెబ్బ తగిలినట్టు అయింది. భారత దాడితో వెన్నులో వణుకుపుట్టిన ఉగ్రవాదులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రవాద స్థావరాల స్థానాలను మారుస్తున్నారు. ఇంతకీ ముష్కరులు తీసుకున్న నిర్ణయం ఏమిటి..? ఎక్కడికి ఉగ్రస్థావరాలను మారుస్తున్నారు..?
పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆపరేషన్ సిందూర్ దెబ్బ గట్టిగానే తగిలినట్లు ఉంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రతీకారంగా పాక్‌తో పాటు పాకిస్తాన్‌లోని 9 ఉగ్రస్థావరాలపై భారత్ వైమానికి దాడులకు దిగింది. ఈ దాడుల్లో 100కి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌తో పాటు భారత్ సరిహద్దులోని ఉగ్రవాద శిబిరాలను వేరే ప్రాంతాలకు మారుస్తున్నారు ఉగ్రవాదులు.
జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ తమ స్థావరాలను ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉండే ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లోకి మారుస్తున్నాయి. పీఓకే ప్రస్తుతం, భారత నిరంతర పరిశీలలో ఉన్నందున ఉగ్రవాద సంస్థలు, భారత సరిహద్దుకు దూరంగా వెళ్తున్నాయి. పూర్తిగా కొండలు, లోయలతో కూడిన కేపీకే ప్రాంతం ఉగ్రవాదులకు నిలయంగా మారుతోంది.
ఇటీవల జైషే మహ్మద్ పాక్ రాజధాని ఇస్లామాబాద్ నుంచి 190 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్సెహ్రా జిల్లాలోని గర్హి హబీబుల్లాలో ఒక మతపరమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ప్రధాన ఉద్దేశం టెర్రర్ నియామకాలు. ఈ కార్యక్రమానికి జైషే కీలక కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ వచ్చాడు. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతాన్ని ఉగ్రవాదానికి కంచుకోటగా మారుస్తానని అన్నారు. జైషే మహ్మద్ ఇప్పుడు సెప్టెంబర్ 25 కేపీకే రాజధాని పెషావర్‌లో పెద్ద సమావేశానికి రంగం సిద్ధం చేస్తోంది. మరోవైపు, హిబ్బుల్ ముజాహిదీన్ కూడా కేపీకేలో తమ కొత్త స్థావరాలను నిర్మించుకునే పనిలో ఉంది.
ఇస్లామాబాద్‌కు 250 కిలోమీటర్ల దూరంలో లోయర్ దిర్ జిల్లాలోని బందాయ్ లో ఒక శిక్షణా శిబిరాన్ని స్థాపించింది. దీనికి HM 313 అని పేరు పెట్టారు. ఖైబర్ ప్రాంతంలో ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా మసూద్ ఇలియాస్ కాశ్మీరీ ఉన్నాడు. పీఓకేలోని రావల్ కోట్ లో జన్మించిన ఇతను 2001లో జైషే మహ్మద్‌లో చేరాడు. 2000ల ప్రారంభంలో ఆఫ్ఘనిస్తాన్‌లో నాటో దళాలతో పోరాడిన ఆయన 2018లో జమ్మూలో సుంజ్వాన్ ఆర్మీ క్యాంప్ దాడికి సూత్రధారి.
2025, ఏప్రిల్ 22 భారత దేశ చరిత్రలో ఒక చీకటి రోజు. ప్రకృతి అందాలకు నిలయమైన జమ్ము కాశ్మీర్లో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురయ్యేలా ఉగ్ర దాడి జరిగింది. బైసరన్ మైదానం ప్రాంతంలోని పహల్గాంలో ప్రకృతి అందాలు వీక్షించేందుకు వచ్చిన పర్యాటకులపై ఉగ్రమూకలు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఉగ్రవాదుల తూటాలకు 26 మంది టూరిస్టులు బలయ్యారు.
కేవలం ఒక వర్గానికి చెందిన వారినే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారు. దేశంలో సంచలనం సృష్టించిన ఈ ఉగ్రదాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తోంది. 26 మంది పౌరులను కనికరం లేకుండా కాల్చి చంపిన ఉగ్రవాదులు ఈ దాడి అనంతరం గాల్లోకి కాల్పులు జరిపి సంబరాలు చేసుకున్నారని వెల్లడించాడు. ఇదే కాకుండా కేవలం ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేసుకుని దాడి చేశారని.. పేరు, మతం అడిగి మరి మారణకాండ కొనసాగించారు.
ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్ , పీఓకే గడ్డపై భారత సైన్యం ప్రతీకార దాడులు చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి బదులు తీర్చుకున్నట్లు అయింది. పీఓకే, పాక్ గడ్డపై ఉన్న ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇండియన్ ఆర్మీ భీకర దాడులకు తెగబడటంతో ఉగ్రవాదుల వెన్నుపూసలు కదిలిపోయాయి. ఉగ్రవాదులకు చెందిన అగ్ర సంస్థల కార్యాలయాలు నేలమట్టం కావడంతో వంద మందికి పైగా ముష్కరులు హతమయ్యారు.
ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌లో ఉగ్రవాదులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పాక్ ఉగ్ర సంస్థలను భారత దళాలు కోలుకోలేని దెబ్బ కొట్టాయి. ఆపరేషన్ సిందూర్ జరిగిన కొన్ని నెలల తర్వాత ఇప్పుడిప్పుడు కొన్ని ఉగ్ర సంస్థలు మళ్లీ తమ క్యాంపులను నిర్మించుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఉగ్రవాదులతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రపంచ వేదికలపై మేకపోతు గాంభీర్యాలు పలికే పాకిస్థాన్, లోలోపల ఉగ్రస్థావరాల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటుంది. ఇటీవల వరద భాదితుల పేరుతో సేకరించిన నిధులను ఉగ్ర స్థావరాల పునరుద్ధరణకు ఖర్చు చేస్తున్నట్లు భారత నిఘా వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వైమానిక దళం ధ్వంసం చేసిన లష్కరే ప్రధాన క్యాంపు కార్యాలయం మర్కాజ్ తోయిబాను పునర్నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించాయి.
మరోవైపు ధ్వంసమైన లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయ విభాగాలను తొలగించడానికి దాని చుట్టూ భారీ యంత్రాలను మోహరించింది. దీనిని పునర్నిర్మించిన అనంతరం మళ్లీ ఉగ్రవాదులకు శిక్షణ స్థావరంగా ఉపయోగించనున్నట్లు సమాచారం. ఆగస్టులో పాక్ ప్రభుత్వం నుంచి 1కోటి 25లక్షల నిధులు కేటాయించగా, పునరుద్ధరణకు అయ్యే మొత్తం ఖర్చు సుమారు 4కోట్ల 7లక్షలకు పైగా ఉంటుందని నిఘా వర్గాలు అంచనా వేశాయి.
ఈ పరిణామం మొత్తం ఉగ్రవాదుల హెండ్క్వార్టర్స్ పై నేరితీసుకునే ఒత్తిడిని చూపే దశగా మారుతున్నాయి. ఒకవైపు ఇది ఇండియాకు తాత్కాలిక ప్రయోజనాన్ని ఇస్తే మరోవైపు కొత్త హెచ్చరికలను సైతం జారీ చేస్తున్నాయి. మరి చూడాలి దీనిపై భారత్ ప్రధాని మోదీ ఏ విధంగా స్పందిస్తారో.



