ఆంధ్ర ప్రదేశ్

అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్

ఉమ్మడి అనంతపురం జిల్లాలో తాడిపత్రికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందనే చెప్పాలి. రాష్ట్రమంతా రాజకీయం ప్రశాంతంగా ఉంటే ఒక్క తాడిపత్రి లో మాత్రం ఎప్పుడు పొలిటికల్ హీట్ రగులుతూనే ఉంటుంది. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిల వైరం ఫ్యాక్షన్ వాతావరణాన్ని తలపిస్తూ ఎప్పుడూ టెన్షన్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది.

గత 30 ఏళ్లుగా తాడిపత్రిలో జేసీ కుటుంబానిదే ఆధిపత్యం. జెసి కుటుంబంలో పార్టీకి సంబంధం లేకుండా ఏ పార్టీలో ఉన్న వారే గెలుస్తూ వచ్చారు. కానీ.. 2019 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యింది. కేతిరెడ్డి కుటుంబం నుంచి మొదటిసారి వైసీపీ నుంచి పోటీ చేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక అప్పటినుంచి ఈ ఆధిపత్య పోరు మరింత ఎక్కువయింది.

ఇద్దరి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో తాడిపత్రి హోరెత్తుతూ వస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దారెడ్డి పోలీసుల సహాయంతో జెసిని ఇంటి బయట కూడా రానివ్వకుండా అనేకమార్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏక్కడ ఏ ధర్నా కార్యక్రమం, ఏ ఆందోళన చేసే ప్రయత్నం చేసినా అడ్డుకున్నారు.

పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఒక అడుగు ముందుకేసి ఏకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్లి ఆయన సోఫాలో కూర్చుని ఆ కుటుంబానికి సవాల్ విసిరారు. నాడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో కేతిరెడ్డి పెద్దారెడ్డిదే పైచేయి అయింది. పోలీసులు కూడా చోద్యం చూస్తున్నట్లే వ్యవహరించారు. ఇక అప్పటి నుంచి వారి మధ్య ఆధిపత్యపోరు మరింత పీక్స్ కు చేరింది.

సీన్ కట్ చేస్తే ఇప్పుడు జేసీ వంతు. తర్వాత 2024 లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే కావడంతో సీన్ రివర్స్ అయింది. కేతిరెడ్డి పెద్దారెడ్డికి చుక్కలు కనపడుతున్నాయట. నాటి నుంచి రెండు వర్గాల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటున్నాయి. పెద్దారెడ్డి ఇంటికి వెళ్లిన జేసీ అనుచరులు ఆయన ఇంట్లోని ఫర్నీచర్ ను కూడా ధ్వంసం చేశారు.

ఎన్నికల్లో ఓటమి అనంతరం తాడిపత్రికి దూరమైన పెద్దారెడ్డి ఇంతవరకు ఆయన సొంత ఇంటి మొహమే చూడలేదు. 2024 ఎన్నికల సమయంలో చెలరేగిన హింస వల్ల తాడిపత్రిలోని కీలక నేతలందరినీ పట్టణానికి దూరంగా ఉండాలని కోర్టు ఆదేశించడంతో పెద్దారెడ్డి తాడిపత్రికి దూరంగా ఉంటూ కాలం గడపాల్సి వచ్చింది. కానీ కోర్టు ఆదేశాలతో ఇటీవల నేతలు ఒక్కొక్కరిగా తాడిపత్రికి చేరుకుంటున్నారు. పెద్దారెడ్డి మాత్రం ఇప్పటివరకు తాడిపత్రిలోని తన సొంత ఇంటి మొహం చూడలేకపోయారు.

మధ్యలో ఒకసారి ఏదో పేపర్స్ కోసమని తాడిపత్రి కి వెళ్లే ప్రయత్నం చేయగా పెద్ద ఎత్తున ఘర్షణ చెలరేగడంతో పోలీసులు అప్పటినుంచి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి ఎంట్రీ లేకుండా చేశారు. ఆ క్రమంలో తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టు నుంచి తాడిపత్రికి వెళ్లేందుకు ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆయన తాడిపత్రిలో ఎంటర్ అవ్వాలని చూస్తున్నారు. కానీ పెద్దారెడ్డి రాకను జేసీ ప్రభాకరరెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దానిపై పబ్లిక్ గానే పెద్దారెడ్డిని తాడపత్రిలోకి రానివ్వనని జేసీ స్టేట్మెంట్ ఇవ్వడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఇక తాడిపత్రి వెళ్ళే విషయంలో పెద్దారెడ్డి కూడా గట్టిగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈసారి ఎలాగైనా తాడిపత్రి పట్టణంలో అడుగు పెట్టాలని నిశ్చయించుకున్నారట. జిల్లా ఎస్పీని కలిసి అందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటు లేరంట. మరోసారి జిల్లా ఎస్పీని కలిసి తాడిపత్రికి వెళ్లేందుకు హైకోర్టు ఆదేశాలను చూపించి పోలీస్ బందోబస్తుతో వెళ్లాలని అనుకుంటున్నార అయితే జేసీ వార్నింగ్ నేపథ్యంలో పోలీసులు కేతిరెడ్డికి పర్మిషన్ ఇస్తారా లేదా అన్నది ఉత్కంఠ భరితంగా మారింది.

ఈ క్రమంలోనే తాడిపత్రిలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటనకు అనుమతి నిరాకరించారు పోలీసులు. ఈ మేరకు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ లేఖ రాశారు. సీఎం పర్యటన దృష్ట్యా భద్రత కల్పించలేమని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని లేఖలో పేర్కొన్నారు.

తాడిపత్రికి వస్తే తేల్చుకుందామంటూ తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పెద్దారెడ్డి తాడిపత్రికి వెళితే మరోసారి హింస చెలరేగే అవకాశముందని భావించిన పోలీసులు భారీగా మొహరించారు. ఒక వైపు న్యాయస్థానం ఆదేశాలు, మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి సవాళ్లతో పోలీసులకు ఇబ్బందిగా మారింది.

తాడిపత్రిలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం ఉందని, ఇద్దరూ సంయమనం పాటించి ఎవరి రాజకీయాలు వారు చేసుకోవడం మంచిదని కొందరు సూచిస్తున్నా వినేది ఎవరు వాళ్లిద్దరూ ఒకరు పెద్దారెడ్డి మరొకరు ప్రభాకర్ రెడ్డి. అందుకే తాడిపత్రిలో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చని పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button