నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం

ఇవాళ తెలంగాణ కేబినెబ్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది. సర్పంచ్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సానుకూలత వ్యక్తం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ గెలుపుతో మంచి జోష్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఇదే ఊపులో ఆలస్యం చేయకుండా స్థానిక ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది. తెలంగాణ హైకోర్టు కూడా నవంబర్ 24 లోపు స్థానిక ఎన్నికల తేదీలపై తమ నిర్ణయాన్ని తెలియజేయాలని ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
కేబినెట్ భేటీలో గిగ్ వర్కర్ల నూతన విధానంపైనా చర్చించి ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. అలాగే ఇటీవల మరణించిన కవి, రచయిత అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, స్మృతి వనం ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రైజింగ్ సమ్మిట్–2025, డిసెంబర్ 8న ప్రజాప్రభుత్వం రెండో వార్షికోత్సవం డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్–2047 పాలసీ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో వాటి నిర్వహణ తీరుతెన్నులపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల పునరుద్ధరణ, SLBC, ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టులపై కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది.



