టీడీపీలో జోగి రమేష్ ఎపిసోడ్‌పై భగ్గుమన్న తెలుగు తమ్ముళ్లు.. MLA గౌతు శిరీష క్లారిటీ, ఏమన్నారంటే!
Gouthu Sireesha On Jogi Ramesh: నూజివీడులో జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంపై చిచ్చు రేగింది. ఈ ర్యాలీలో మంత్రి పార్థసారథి, టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి మాజీమంత్రి జోగి రమేష్ కూడా పాల్గొనడంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఈమేరకు ఓ టీడీపీ నేత పెట్టిన పోస్ట్‌కు గౌతు శిరీష స్పందించారు. నూజివీడులో జరిగిన కార్యక్రమంలో ఏం జరిగిందో చెప్పారు.
టీడీపీలో వైఎస్సార్‌సీ మాజీ మంత్రి జోగి రమేష్ ఎపిసోడ్ చర్చనీయాంశంగా మారింది. నూజివీడులో మాజీ మంంత్రి జోగి రమేష్ మంత్రి కొలుసు పార్థసారథి, పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడంపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన వ్యక్తి.. ఐదేళ్ల పాటూ పార్టీ కేడర్‌ను కేసులతో వేధించిన వ్యక్తితో కలిసి ఎలా కార్యక్రమంలో పాల్గొంటారని తెలుగు తమ్ముళ్ల ప్రశ్నిస్తున్నారు. మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీష ఎలా ఈ వెళతారంటున్నారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు, ట్వీట్‌లు వైరల్ అవుతున్నాయి.
అయితే ఓ టీడీపీ నేత చేసిన పోస్ట్‌పై గౌతు శిరీష స్పందించారు. ‘ప్రతిదీ నెగిటివ్ తో చూస్తే ఇలానే అనిపిస్తుంది అన్న, నిన్న ఆ కార్యక్రమం జరిగింది నూజివీడులో నేను ఒక అతిథిగా అక్కడ పాల్గొన్నాను. అన్ని పార్టీలకి సంబంధించిన మా కుల పెద్దల్ని అక్కడికి పిలిచారు. కొన్నిసార్లు ఎవరెవరు పక్కన కూర్చోవాల్సి వస్తుంది.. అంతమాత్రాన వాళ్లతో కలిసిపోయినట్టు కాదు. సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెట్టేముందు అక్కడ ఏం జరిగిందో పూర్తిగా కనుక్కొని పెడితే బాగుంటుంది. మామూలుగా అయితే నేను దీనికి సమాధానం చెప్పను కూడా.. కానీ మీరు కాబట్టి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే టీడీపీ కార్యకర్త కాబట్టి నేను కూడా గౌరవంగా సమాధానం ఇస్తున్నాను. అంతేగాని ప్రతిదీ ఒకటే దృష్టితో చూస్తే రాజకీయాల్లో అడుగు నేను బయటకు పెట్టలేను’ అంటూ సమాధానం ఇచ్చారు.
మరో టీడీపీ కార్యకర్త కూడా స్పందిస్తూ మరో పోస్ట్ పెట్టారు. ‘గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ ఆంధ్రప్రదేశ్ గౌడ కులసంఘం తరపున జరిగింది. స్థానికంగా అందుబాటులో ఉన్నాడు కాబట్టే వచ్చాడు ఆ వ్యక్తి కూడా. Gouthu Sireesha గారు అయినా ఇంకెవరు అయినా కులసంఘం తరఫునే వచ్చింది.. లచ్చన్న గారు మహా నాయకుడు.. శిరీష గారు ఎప్పటికీ మన మనిషే.. అనవసరపు అసందర్భపు చర్చ అనవసరం’అంటూ స్పందించారు.
జోగి రమేష్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావడంపై ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. నూజివీడులో నిర్వహించిన ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా జరిగిందని.. మాజీ మంత్రి జోగి రమేష్‌తో పాటుగా పలువురు గౌడ కులసంఘం ప్రతినిధులు హాజరయ్యారనే వాదన వినిపిస్తోంది. ఈ విషయాన్ని రాజకీయ కోణంలో చూడటం సరికాదంటున్నారు.. కులసంఘం తరఫున నిర్వహించిన కార్యక్రమానికి పలానా పార్టీ వాళ్లు రావొద్దని చెప్పడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద జోగి రమేష్ ఎపిసోడ్‌పై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంగానే ఉన్నారు.