జాతియం

Delhi: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు.. 9 మంది మృతి

Delhi: దేశ రాజధానిని మరోసారి కుదిపేసే ఘటన చోటు చేసుకుంది. చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలోని లాల్‌క్విలా మెట్రో స్టేషన్‌ వద్ద భారీ పేలుడు సంభవించింది. రద్దీగా ఉండే ప్రాంతంలో కారులో అకస్మాత్తుగా జరిగిన ఈ బ్లాస్ట్‌లో 9 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

పేలుడు మెట్రో గేట్ నంబర్‌ 1 వద్ద చోటు చేసుకుంది. బ్లాస్ట్‌ తీవ్రతతో సమీపంలోని అనేక వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. దట్టమైన పొగతో ఆ ప్రాంతం కమ్ముకుపోయింది. సంఘటనా స్థలానికి 20కుపైగా అగ్నిమాపక వాహనాలు, పోలీసు బృందాలు, అంబులెన్స్‌లు చేరుకున్నాయి.

పర్యాటకులు అధికంగా వచ్చే ప్రాంతం కావడంతో వాతావరణం భయాందోళనగా మారింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఇంటి టెర్రస్‌ నుంచి పెద్ద అగ్నిగోళం ఎగిసినట్టు చూశామని, ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించిందని పేలుడు ఒకటి కంటే ఎక్కువ వాహనాల్లో జరిగి ఉండొచ్చని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

పేలుడు కారణాలను తెలుసుకునేందుకు ఢిల్లీ పోలీసుల స్పెషల్‌ సెల్‌, బాంబ్‌ డిస్పోజల్‌ స్క్వాడ్‌, ఎన్‌ఎస్‌జీ టీములు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టి పరిశీలిస్తున్నారు. ట్రాఫిక్‌ డైవర్షన్‌లు అమల్లోకి వచ్చాయి. ఓల్డ్‌ ఢిల్లీ పరిసరాల్లో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. పేలుడు జరిగిన ప్రదేశం నుండి గురుద్వారా సిస్‌ గంజ్‌ సాహిబ్‌ కేవలం కొన్ని వందల మీటర్ల దూరంలో, జామా మసీదు సుమారు 1.1 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. పేలుడు యాదృచ్ఛికమా, కుట్ర పూర్వకమా అన్నది ఇంకా స్పష్టత రాలేదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button