జాతియం

Siddaramaiah: మత మార్పిడిలపై సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు

Siddaramaiah: మత మార్పిడుల గురించి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. హిందువులు మతం మారడానికి.. హిందూ మతంలో ఉన్న కొన్ని ఆచారాలే కారణమని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. దీంతో తీవ్ర దుమారం రేగింది. సిద్ధరామయ్య వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ.. తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇలాంటి వ్యాఖ్యలే.. ఇస్లాం, క్రైస్తవ మతంపై సిద్ధరామయ్య చేయగలరా అని ప్రశ్నించింది. ఇంతకీ మత మార్పిడుల గురించి సీఎం సిద్ధరామయ్య ఏమన్నారు..? ఎందుకు బీజేపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది..?

దేశంలో మత మార్పిడుల అంశం అత్యంత సున్నితమైంది. దీనిపై ఏదైనా వ్యాఖ్యలు చేసేటపుడు.. ఎంతటివారైనా ఆచితూచి స్పందించాల్సి ఉంటుంది. లేకపోతే కొన్ని మతాల మనోభావాలు దెబ్బతిని.. తీవ్ర గందరగోళానికి కారణం అవుతాయి. ఇలాంటి ఘటనలు ఇప్పటివరకు చాలానే జరిగినా కొన్నిసార్లు కొంతమంది నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సమాజంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉంటున్నాయి. తాజాగా మత మార్పిడులకు కారణాలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలే తీవ్ర దుమారానికి కారణం అయ్యాయి.

హిందూ మతం, మతమార్పిడిలపై కర్నాటక సీఎం సిద్ధరామయ్య హాట్ కామెంట్స్ చేశారు. హిందువులు మతం మారి ఇతర మతాల్లోకి వెళ్లడానికి గల కారణాలను ఆయన వివరించారు. హిందూ మతంలో సమానత్వం లేదని అందుకే కొందరు హిందూ మతాన్ని వదిలేసి ఇతర మతాలను స్వీకరిస్తున్నారని సిద్ధరామయ్య అన్నారు. ఈ సందర్భంగా హిందూ మతంలో సమానత్వం అనేది ఉంటే ఎందుకు మతాన్ని మారుతారని సిద్ధరామయ్య ప్రశ్నించారు.

హిందూ మతంలో సమానత్వం, సమాన అవకాశాలు ఉంటే ఎవరైనా ఎందుకు మతం మారతారని ప్రశ్నించారు. ఇస్లాం, క్రైస్తవం ఇతర ఏ మతంలోనైనా అసమానతలు ఉంటాయని అంటరానితనాన్ని మనమే సృష్టించామా..? అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం హిందూ మతంలోనే కాకుండా ఇతర మతాల్లోనూ అసమానతలు ఉండొచ్చని సిద్ధరామయ్య తెలిపారు. తాము అయినా, బీజేపీ అయినా మతం మారాలని ప్రజలను అడగడం లేదని కానీ అది వారి హక్కు అని ఆయన అన్నారు.

హిందూ మతంలో సమానత్వం ఉంటే ఎవరైనా ఎందుకు మతం మారతారంటూ సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు కన్నడ పాలిటిక్స్‎లో కాకరేపాయి. సిద్ధరామయ్య వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీజేపీ ఎదురుదాడికి దిగింది. ముస్లింల మెప్పు కోసం సిద్ధరామయ్య హిందు మతంలో చిచ్చురేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హిందువులను టార్గెట్ చేసుకుని కులం, మతం ఆధారంగా ప్రజలను విభజించడానికి ప్రయత్నించారని ఫైర్ అయ్యింది. ఇస్లాంను ప్రశ్నించే ధైర్యం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఉందా అని ప్రశ్నించింది. ఇస్లాంలో గనక సమానత్వం ఉన్నట్లైతే ముస్లిం మహిళలను మసీదుల్లోకి ఎందుకు అనుమతించడం లేదని నిలదీసింది. అంతేకాకుండా ట్రిపుల్‌ తలాక్‌ను నిషేధించడాన్ని ఎందుకు వ్యతిరేకించారని ప్రశ్నించారు.

మరీ సమానత్వంపై ముస్లింలను ప్రశ్నించే ధైర్యం ఉందా అని సీఎం సిద్ధరామయ్యకు సవాల్ విసిరారు ప్రతిపక్ష నేత అశోక. పహల్గామ్ ఉగ్రవాద దాడి, మసీదులలో మహిళలపై ఆంక్షలు, ట్రిపుల్ తలాక్‌ను నిషేధించడానికి వ్యతిరేకత, ముస్లిమేతరులకు ఖురాన్ వంటి ఇస్తాంలోని మత ఆచారాలను గుర్తు చేసి వీటిని సీఎం సిద్ధరామయ్య ప్రశ్నించగలరా అని సవాల్ విసిరారు. ముస్లిమేతరులు, హిందువులను ఖురాన్‌లో కాఫిర్లుగా ఎందుకు పిలుస్తున్నారని ఇలాంటివన్నీ అడిగే ధైర్యం సిద్ధరామయ్యకు ఉందా అంటూ కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ పక్షనేత ఆర్‌ అశోక్ ప్రశ్నించారు.

దీనికిముందు, బెంగళూరు శివాజీనగర్ మెట్రో స్టేషన్‌ పేరును సెయింట్ మేరీగా మార్చే ఒక ప్రతిపాదనకు సిద్ధరామయ్య ఆమోదం తెలపడం వివాదమైంది. సెయింట్ మేరి బాసిలికా వార్షిక కార్యక్రమంలో పాల్గొన్న సీఎం శివాజీనగర్ మెట్రో స్టేషన్ పేరును సెయింట్ మేరీగా మార్చగలమని ఆర్టిబిషప్‌ పీటర్ మచడోకు హామీ ఇచ్చారు.

ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను కేంద్రానికి పంపుతామని చెప్పారు. ఈ చర్యను బీజేపీ తీవ్రంగా విమర్శించింది. బుజ్జగింపు రాజకీయాల కోసం మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం అవమాన పరుస్తోందని విమర్శించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సైతం ఈ చర్యను ఖండించారు.

మొత్తానికి హిందూ మతం, మతమార్పిడిలపై సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. ఆ సీఎంపై బీజేపీ విమర్శల అస్త్రాన్ని ఎక్కుపెట్టాయి. మరి చూడాలి ఈ వివాదం ఎంత వరకు పోతుందో అని.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button