తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు

తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. దీంతో తెలంగాణలోని అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణకు మరో మూడ్రోజులపాటు వర్షసూచనలు చేసింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వాతావరణశాఖ సూచనలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
మరోవైపు ఏపీలోని కోస్తా, రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు దంచికొడుతున్నాయి. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. గత కొన్నిరోజులుగా ఏపీలోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తునే ఉన్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్‌లోనూ రాత్రి కుండపోత వర్షం కురిసింది. చైతన్యపురిలోని కమలానగర్ రోడ్డులో.. వరదలో వాహనాలు కొట్టుకుపోయాయి. ఎల్బీనగర్ రోడ్డుపై కార్లు, బైకులు వరదలో చిక్కుకున్నాయి. నిర్మల్ జిల్లా కుంటాలలో వడ్లు తడిసి ముద్దయ్యాయి. దీంతో ప్రతి ధాన్యం గింజ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.