Karthika Masam: తెలుగు రాష్ట్రాల్లో కార్తీక సందడి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

Karthika Masam: కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ శివాలయాలు శివ నామస్మరణతో మార్మోగాయి. నర్సాపురం వశిష్ట గోదావరిలో భక్తులు పెద్ద ఎత్తున పుణ్య స్నానాలు ఆచరించి కార్తీకదీపాలు వెలిగించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Eluru:
ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ వద్ద అఖండ గోదావరి నది మధ్యలో వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి శైవ క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఆలయానికి క్యూ కట్టారు భక్తులు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. ఇక స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అధికారులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
West Godavari:
కార్తిక మాసం చివరి సోమవారం కావడంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని మహాశివుని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పాలకొల్లులోని క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు భక్తులు. కార్తీక స్నానం ఆచరించి స్వామివారి దర్శనం కోసం క్యూ కట్టారు. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి భక్తులు పూజలు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ‘ఓం నమఃశివాయా’ పంచాక్షరీ మంత్రంతో ఆలయ పరిసరాలు మారుమ్రోగుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు త్వరితగతిన దర్శనం జరిగే విధంగా ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు చెప్పారు.
Nandyala:
చివరి కార్తీక సోమవారం సందర్భంగా నంద్యా జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రముఖ శైవక్షేత్రమైన యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం శివనామస్మరణతో మార్మోగుతుంది. భక్తులు వేకువజామునే పుణ్యస్నానాలు ఆచరించి, ఉమా మహేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని స్వామివారికి అభిషేకాలు రద్దు చేశారు ఆలయ అధికారులు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.



