Hyderabad: వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా కరెంట్ షాక్.. ఇద్దరు మృతి

Hyderabad: హైదరాబాద్ మహానగరంలో కరెంట్ షాక్ తగిలి మరణిస్తున్న ఘటనలు వరుసగా చోటు చేసుకొంటున్నాయి. చాంద్రాయణగుట్ట బండ్లగూడలో కరెంట్ షాక్‌తో ఇద్దరు యువకులు వికాస్, ధోనీ మరణించారు. చంద్రాయణగుట్ట నుంచి పురానా పుల్‌కు వినాయకుడి విగ్రహాన్ని తీసుకొని వెళుతుండగా వీరికి కరెంట్ షాక్ తగిలింది.
అయితే వీరితో వెంట ఉన్న మరో ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి. వారిలో ఒక యువకుడికి ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని ఓవైసీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై బండ్లగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు అంబర్‌పేటలో వినాయకుడి మండపానికి పందిరి వేసే క్రమంలో కరెంట్ తీగలను కట్టెతో పైకి లేపుతుండగా కరెంట్ షాక్ తగిలి రామ్ చరణ్ అనే వ్యక్తి కిందపడి పోయాడు. ప్రమాదంలో యువకుడు చనిపోయాడు.
ఇంకోవైపు వరుస మూడు రోజుల్లో విద్యుత్ షాక్ ఘటనల్లో 9 మంది మరణించడం పట్ల నగర జీవులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించిన యాత్ర కారణంగా రామాంతపూర్‌లో ఐదుగురు యువకులు మరణించారు. అలాగే బండ్లగూడో ఇద్దరు మృతి చెందారు. అయితే కరెంట్ షాక్ కారణంగా రామాంతపూర్‌లో మరణించిన యువకులకు ప్రభుత్వం రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
ఇక భారీ వర్షాల కారణంగా ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్ల వద్దని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రజలకు సూచించారు. వర్షాలు పడే సమయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలకు విద్యుత్ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
పండగల వేళ ఎంతో సంతోషంగా సంబరాలు చేసుకొంటున్న సమయంలో ఇలా కరెంట్ షాక్ తగిలి యువకులు విగత జీవులుగా మారుతుడంతో ఆ యా కుటుంబాల రోదనలు మిన్నంటుతున్నాయి.
వరుస విద్యుత్ ప్రమాదాలపై అధికారులు అప్రమత్తమయ్యారు. వచ్చే వినాయక చవితి వేడుకలను దృష్టిలో పెట్టుకొని ఈ తరహా ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. హైదరాబాద్ అన్ని ప్రాంతాలలోని విద్యుత్ స్తంభాలకు వేలాడుతున్న, ప్రమాదకరంగా ఉన్న కేబుళ్లను తొలగించే పనులు వేగంగా చేస్తున్నారు.
ప్రజల ప్రాణాలకు ముప్పు లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. అవసరమైతే అన్ని స్తంభాల పరిశీలన చేపట్టి ప్రమాదకరమైన లైన్లను పూర్తిగా తొలగించనున్నట్లు అధికారులు ప్రకటించారు.



