Operation Kagar: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్

పచ్చని అడవుల్లో రక్తపుటేర్లు పారుతున్నాయి. అటు అన్నలు, ఇటు ఖాకీల బూట్ల చప్పుళ్లతో దద్దరిల్లుతున్నాయి. తెలంగాణలో భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. కర్రెగుట్టను చుట్టుముట్టాయి. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది.
ఇప్పటికే తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. 20 రోజులుగా కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం వేట కొనసాగుతోంది. వందలాది మావోయిస్టుల రహస్య స్థావరాలు, బంకర్‌లను గుర్తించాయి బలగాలు. అలాగే పేలుడు పదార్థాలు, నిత్యావసర వస్తువులు, డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నాయి.
తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల మృతిని బస్తర్ ఐజీ ధృవీకరించారు.
290 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 50 నుంచి 70 మీటర్ల ఎత్తు కొండలతో కర్రెగుట్టల మధ్యన అడవులున్నాయి. రోజుల తరబడి నడక ఒకవైపు ఎండతో తీవ్ర చెమటలు, ఉక్కపోత వంటి ఇబ్బందులకు గురవుతూ జవాన్లు డీహైడ్రేషన్‌కు లోనవుతున్నారు.
అయితే భద్రతా బలగాలకు హెలికాప్టర్ల ద్వారా నిత్యావసరాలు అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. డ్రోన్ కెమెరాల సహాయంతో మావోయిస్టుల కదలికలను పసిగడుతోంది. నిఘానేత్రాలకు అన్నలు చిక్కినా ఆ ప్రాంతాలకు చేరుకోవడం బలగాలకు కత్తిమీద సాముగా మారుతోంది.
మరోవైపు కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ ఆపాలంటూ పౌర హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. భద్రతా బలగాల దాడిని పౌర హక్కుల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. మావోయిస్టులు శాంతి చర్చలకు పిలుపునిచ్చినా ఏకపక్షంగా కాల్పులు జరపడం సరికాదంటున్నారు. తక్షణమే శాంతిచర్చలు జలపాలని డిమాండ్ చేశారు.
మరోవైపు తెలంగాణ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ చేయూతకు భారీ స్పందన వస్తోంది. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో 14మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు ఎస్పీ రోహిత్‌రాజ్ తెలిపారు. 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టులను లేకుండా చేసే లక్ష్యంతో కేంద్రం ముందుకు సాగుతోంది. కేంద్రం మావోయిస్టు రహిత భారత్ దిశగా అడవులను జల్లెడ పడుతుండటంతో మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలిసి ఉద్యమాలు నిర్మించాలని కోరుతున్నారు ప్రజాసంఘాల నేతలు.