London: లండన్‌లోని గాంధీ విగ్రహంపై పిచ్చి రాతలు

London: మహాత్ముడు కేవలం భారతదేశానికే కాదు ప్రపంచానికి సైతం ఆదర్శప్రాయుడు. ఆయన నడిచిన బాట ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ అనుసరనీయం. మహాత్ముడి అహింస ప్రపంచానికి దారి చూపుతుంది. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించాలన్న గాంధీ సిద్ధాంతాన్ని ఇప్పటికీ పాటించేవారు లేకపోలేదు. అందుకే అతను మహాత్ముడయ్యాడు. ఆయన జయంతిని ప్రపంచ శాంతి దినోత్సవంగా నిర్వహించుకుంటున్నారు. అలాంటి వ్యక్తి విగ్రహానికే అవమానం జరిగింది. ఇంతకీ ఎవరూ మహాత్ముడిని అవమానించింది..? దీని వెనుక ఉన్నదెవరు? ఎక్కడ జరిగిందీ దుశ్చర్య..?
మహాత్మాగాంధీ జయంతి వేడుకలకు ప్రపంచం సిద్ధమవుతున్న వేళ.. లండన్‌లో ఆయన విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. జాత్యహంకారుల పిచ్చి చేష్టలు మొదలయ్యాయి. టావిస్టాక్ స్క్వేర్‌లో గాంధీ విగ్రహంపై గుర్తు తెలియని వ్యక్తులు పిచ్చి రాతలు రాశారు. టెర్రరిస్టు, గాంధీ-మోదీ హిందుస్థాని టెర్రరిస్టులని నల్ల రంగుతో విగ్రహంపై రాశారు. మహాత్మాగాంధీ జయంతి ముందు ఈ ఘటన జరగడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఒకానొక దశలో విగ్రహం పగలగొట్టేందుకు ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై భారత్ రాయబార కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖండించింది. దీన్ని సిగ్గుచేటు చర్య, అహింస భావనపై హింసాత్మక దాడిగా అభివర్ణించింది. వలం ఒక విగ్రహానికి జరిగిన అవమానం మాత్రమే కాదు.
ఒక మానవతా విలువపై చేసిన దాడిగా చూడాలని భారత జాతి కోరుతోంది.దీనిపై ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యింది. అహింసా దినోత్సవానికి కొన్నిరోజుల ముందు జరిగిన ఈ ఘటన.. విధ్వంసం కాదని, మహాత్ముడి వారసత్వంపై జరిగిన హింసాత్మక దాడిగా పేర్కొంది. దీనికి బాధ్యులైనవారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను కోరుతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. వెంటనే మహాత్ముని విగ్రహాన్ని పూర్వ రూపంలోకి తీసుకు వచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారని తెలిపింది.
భారతదేశపు స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించిన గాంధీజీ కేవలం ఒక జాతీయ నాయకుడు మాత్రమే కాదు. ఆయన ఆలోచనలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాయి. అహింసా పరమోధర్మః అనే సూత్రాన్ని ఆచరణలో పెట్టి, బ్రిటీష్ సామ్రాజ్యాన్ని వణికించిన నేతగా నిలిచారు. ఆయన బోధించిన అహింసా పరమోధర్మహ సిద్ధాంతం మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, నెల్సన్ మండేలా వంటి నాయకులకు స్ఫూర్తినిచ్చి ప్రపంచవ్యాప్తంగా అనేక సమాజాల్లో శాంతి ఉద్యమాలకు పునాది వేసింది. అలాంటి వ్యక్తి విగ్రహంపై దాడి జరగడం అంటే శాంతి, సహనం అనే విలువలపై విసిరిన సవాలు అని చెప్పాలి.
ఈ ఘటనపై చర్యలు ప్రారంభించినట్టు స్థానిక మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. మహాత్మా గాంధీ ఉన్నత విద్య కోసం 1888 సంవత్సరంలో భారత్ నుంచి లండన్‌కు వెళ్లారు. ఆయన 1888 సంవత్సరం నవంబరు 6న యూనివర్సిటీ కాలేజ్ లండన్లో లా కోర్సులో చేరారు. భారత చట్టాలపై అక్కడ అధ్యయనం చేశారు. ఈ కాలేజీలో చదువుకున్న ఇతర ప్రముఖుల్లో నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఉన్నారు. బ్రిటన్ కేంద్రంగా పనిచేసే భారతీయ సంస్థ ఇండియా లీగ్ మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని తయారు చేయించింది.
దీన్ని ఫ్రెడ్డా బ్రిలియంట్ అనే శిల్పి చెక్కారు. 1968 సంవత్సరంలో లండన్‌లోని టావీస్టాక్ స్క్వేర్‌లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశం యూనివర్సిటీ కాలేజ్ లండన్కు సమీపంలోనే ఉంటుంది. ఈ కాలేజీలో లా చదువుకొని మహా మనిషిగా ఎదిగిన గాంధీజీని గౌరవించేందుకే ఆయన విగ్రహాన్ని టావీస్టాక్ స్క్వేర్‌లో ఏర్పాటు చేశారు. అప్పటి బ్రిటిష్ ప్రధాన మంత్రి హెరాల్డ్ విల్సన్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఐక్యరాజ్యసమితి అక్టోబర్ 2వ తేదీని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించింది. ప్రతి ఏటా ఇక్కడి విగ్రహానికి పూలమాలలు వేసి, గాంధీజీకి ఇష్టమైన భజనలతో నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. కాలక్రమేణా టావిస్టాక్ స్క్వేర్ లండన్ శాంతి ఉద్యానవనాలలో ఒకటిగా మారింది. హిరోషిమా బాధితుల కోసం చెర్రీ చెట్టు, 1986లో UN అంతర్జాతీయ శాంతి సంవత్సరం కోసం నాటిన ఫీల్డ్ మాపుల్ ,మనస్సాక్షికి విరుద్ధంగా ఉన్నవారిని గౌరవించటానికి 1995లో ఆవిష్కరించబడిన గ్రానైట్ స్మారక చిహ్నం, శాంతికి గుర్తుగా ఇతర స్మారకాలను కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఈ ప్రాంతాన్ని లండన్ శాంతి ఉద్యానవనం అంటే పీస్ పార్క్ అని పిలుస్తారు. అలాంటి చోట ఈ విధ్వంసం జరిగింది.
అలాగే మార్చిలో విదేశాంగ మంత్రి జైశంకర్ యూకే పర్యటన సందర్భంగా లండన్‌లో ఖలిస్తానీ మద్దతుదారులు నిరసనలు తెలిపారు. ఆ సమయంలో నిరసనకారులు చాథమ్ హౌస్ వెలుపల గుమిగూడి జెండాలు ఊపుతూ నినాదాలు చేశారు. నిరసనకారుల సమూహంలోని ఒక వ్యక్తి భద్రతా వలయాన్ని ఛేదించి దూసుకొచ్చాడు. చాథమ్ హౌస్ ప్రధాన కార్యాలయం నుంచి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బయలుదేరుతుండగా కారును అడ్డుకునే ప్రయత్నం చేశాడు. వేర్పాటువాదులు చేసిన దుందుడుకు చర్యను భారత్ ఖండించింది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భద్రతా లోపంపై ఆందోళన వ్యక్తం చేసింది.
దీనిలో భాగంగా ఇప్పటికే లండన్ విదేశాంగ శాఖ మంత్రితో జైశంకర్ భేటీ అయ్యారు. ముఖ్యంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం, వ్యూహత్మక ఒప్పందాలు, విద్య, రాజకీయ అంశాల విషయాలలో పరస్పరం పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అంతే కాకుండా.. ఇటీవల ప్రపంచంలో భారత్ వృద్ధి, పాత్ర అనే అంశంపై కూడా జై శంకర్ లండన్ లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఇది జరిగి దాదాపు ఆరు నెలల తర్వాత ఈ విధ్వంసక చర్య జరిగింది.
ఇక తాజాగా.. వలసలకు వ్యతిరేకంగా లండన్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. అక్రమ వలసలను అడ్డుకోండి’‘మా దేశాన్ని మాకివ్వండి’ అంటూ నిరసనకారులు తమ నినాదాలతో లండన్ వీధులను హోరెత్తించారు. ప్రముఖ జర్నలిస్ట్, జాతీయవాద యాక్టివిస్ట్ టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో లండన్ నడిబొడ్డున జరిగిన ఈ భారీ నిరసన ర్యాలీలో సుమారు1.50 లక్షల మంది పాల్గొన్నారు. యునైట్ ద కింగ్‌డమ్ పేరుతో యాంటీ ఇమిగ్రెంట్, యాంటీ ఇస్లాం కార్యకర్త టామీ రాబిన్సన్ నేతృత్వంలో జరిగిన ర్యాలీలో లక్ష మందికిపైగా పాల్గొన్నారు.
బ్రిటన్‌లో భారీ స్థాయిలో యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీ జరిగింది. లక్ష మందికి పైగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. అదే సమయంలో జాత్యాహంకారానికి వ్యతిరేకంగా మరో నిరసన కార్యక్రమం కూడా జరిగింది. ఈ రెండు వర్గాల మధ్య గొడవలు జరగకుండా నిరోధించేందుకు పోలీసులను భారీగా మోహరించారు. ఈ క్రమంలో పోలీసులపై ఆందోళనకారులు దాడులు చేశారు.
కాగా ఈ మధ్య బ్రిటన్‌కు అక్రమ వలసలు భారీగా పెరిగాయి. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 28 వేల మందికి పైగా వలసదారులు పడవల ద్వారా బ్రిటన్ చేరుకున్నట్లు పలు రిపోర్టులు చెబున్నాయి. ఇలా వలసలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో స్థానిక జనాభాలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ప్రభుత్వం వలసదారులను హోటళ్లలో ఉంచుతుండటంతో, స్థానికులు అక్కడకు చేరుకుని తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వలసదారులు స్థానికుల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని నిరసనకారులు అంటున్నారు.
అక్రమ వలసలు దేశానికి భారంగా మారారని యాంటీ ఇమిగ్రేషన్ నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు వలస సమస్య బ్రిటన్ రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది. రిఫార్మ్ యూకే తదితర పార్టీలకు ఇది కీలక అజెండాగా మారింది. రాబిన్‌సన్ ఈ అంశాన్ని మరింతగా పెద్దదిచేస్తూ, ర్యాలీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. టామీ రాబిన్సన్‌కు బిలియనీర్ ఎలాన్ మస్క్ లాంటి ప్రముఖుల మద్దతు ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
విగ్రహాలు ఒక భావనకు ప్రతీకలు. అవి చరిత్రను గుర్తుచేసే చిహ్నాలు. వాటిని ధ్వంసం చేయడం ద్వారా చరిత్రను చెరిపేయవచ్చని కొందరు భావించడం సరైన చర్య కాదు. ఇలాంటి చర్యలు సమాజంలో ద్వేషాన్ని నింపగలవు. గాంధీజీ విగ్రహాన్ని అవమానించిన వారు ఆయన విలువలను చెరపలేరు. ఆయన బోధనలు నేటికీ అవసరమని. ఎందుకంటే ప్రపంచం నేడు మతవివాదాలు, జాతి విభజనలు, రాజకీయ విద్వేషాలతో మునిగిపోయింది



