అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు

Donald Trump: ఎక్కడో స్విచ్ వేస్తే ఇంకెక్కడో బల్బ్ వెలిగుతుందని చాలా విషయాల్లో మనం చాలా సార్లు చెప్పుకుంటూనే ఉంటాం. తాజాగా అమెరికా అధ్యక్షుడు ఇండియాపై 50 శాతం సుంకాలు వేయడానికి కారణాన్ని చెప్పిన తీరు చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. రష్యా నుంచి చమురు కొంటే ఇండియాపై డబుల్ సుంకాలతో బాదేస్తోన్న అమెరికా అందుకు కారణం రష్యా అంటూ తేల్చి చెప్పింది. తాజాగా ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
భారతదేశంపై తాము విధించిన సెకండ్ టారిఫ్స్ దెబ్బకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనతో భేటీకి అంగీకరించాడని చెప్పుకొచ్చాడు. చర్చలకు ఎన్నో అంశాలు ప్రభావితం చూపాయని వాటిలో ఇండియా రష్యా చమురు కొనుగోళ్లు అత్యంత కీలకమైనవన్నాడు.
భారతదేశంపై అమెరికా విధించిన సెకండ్ టారిఫ్స్ ముఖ్యంగా రష్యా నుండి చమురు కొనుగోలు చేయడం వల్ల వాటిని తొలగించాయన్నారు. ఈ నెల ప్రారంభంలో, ఇండియా రష్యా చమురు కొనుగోలును కొనసాగించడంపై భారత వస్తువులపై ట్రంప్ భారీ సుంకాలను విధించాడు. ఇది అనేక ఉత్పత్తులకు 50 శాతానికి సుంకం విధించేలా చేసింది. ఇది ఏ దేశానికైనా అమెరికా విధించిన గరిష్ట టారిఫ్.
పుతిన్ కలవడానికి అంగీకరించడంలో భారతదేశంపై సుంకాలు బహుశా కీలక పాత్ర పోషించి ఉంటాయని ట్రంప్ తేల్చి చెప్పాడు. కచ్చితంగా, రెండో అతిపెద్ద కస్టమర్‌ను కోల్పోవడం, వచ్చే రోజుల్లో మీ మొదటి అతిపెద్ద కస్టమర్‌ను కోల్పోబోతున్నప్పుడు చర్చలకు రాక చేయడానికేముంటుందని పుతిన్ గురించి ట్రంప్ అవహేళన చేశాడు.
ఇటీవలి కాలంలో చైనాతో వ్యూహాత్మక పోటీలో భారతదేశం అమెరికాకు కీలక భాగస్వామిగా ఉంటున్నప్పటికీ అమెరికా వాణిజ్య మిగులు, రష్యాతో సన్నిహిత సంబంధాలు ఇండియా విషయంలో 50 శాతం టారిఫ్స్ విధించడానికి కారణమయ్యాయి. ట్రంప్ ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందానికి అంగీకరించడానికి ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారన్నారు.
సుంకాల దాడిలో ఇండియాను ప్రధాన లక్ష్యంగా చేసుకుంటే ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకవచ్చన్న అభిప్రాయంలో ట్రంప్ ఉన్నాడు. ఐతే అమెరికా సుంకాలను అన్యాయమని, అసమంజసమైనవని ఇండియా మండిపడింది. ఎలాంటి కారణం లేకుండా ఇండియాపై సుంకాలు వేయడం ఇదేం పద్దతని మండిపడింది.
జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఇండియా, అమెరికాకు తేల్చి చెప్పింది. ఉక్రెయిన్‌లో పోరాటాన్ని ఆపాలంటే రష్యాకు పైసలు రాకుండా చేయడం తప్ప వేరే గత్యంతరం తమకు లేకుండా పోయిందని ఈ సందర్భంగా ట్రంప్ అన్నాడు. ఒప్పందంపై తాను ఆసక్తి కలిగి ఉన్నానన్న ట్రంప్ వచ్చే అవుట్‌కమ్‌ను బట్టి అప్పటికప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని పిలుస్తామని ట్రంప్ చెప్పాడు.
అలాస్కా శిఖరాగ్ర సమావేశం ప్రధాన లక్ష్యం జెలెన్స్కీతో రెండో సమావేశాన్ని ఏర్పాటు చేసి యుద్ధాన్ని ఆపడమేనని అమెరికా అంటోంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు తాను ఆరు యుద్ధాలను ఆపానని ట్రంప్ బడాయి మాటలు మాట్లాడాడు.
వాస్తవానికి ఉక్రెయిన్ యుద్ధాన్ని తేలిగ్గా ఆపుతానని అనుకున్నప్పటికీ, అది చాలా కష్టంగా మారిందన్నాడు. యుద్ధం తనకు మాజీ అధ్యక్షుడు జో బైడెన్ నుండి వారసత్వంగా వచ్చిందని చెప్పాడు. అలాస్కాలో జరిగే చర్చలలో ట్రంప్ పుతిన్‌కు ఆతిథ్యం ఇస్తున్నాడు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే ప్రయత్నాలలో ఇది ఒక కీలక సమావేశంగా అమెరికా అధ్యక్షుడు చెబుతున్నాడు. 2021 తర్వాత మొదటి అమెరికా-రష్యా శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ గత వారం అంగీకరించాడు. అమెరికా శాంతి చొరవను మొన్నటి వరకు రష్యా వ్యతిరేకిస్తూ వచ్చింది.



