తెలంగాణ
సరస్వతి పుష్కరాలకు బస్సుల కొరత

పెద్దపల్లి జిల్లా మంథని బస్టాండులో ఉదయం నుండి బస్సులు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో 15 నుండి 26 వరకు నిర్వహించే సరస్వతి పుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. సరస్వతి పుష్కరాలకు కేవలం ఐదు రోజులే మిగిలి ఉండడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. మంథని బస్టాండ్‌లో మాత్రం ఉదయం నుండి బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్నారు.
ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం విధులు బహిష్కరించి నిరసన తెలియజేస్తున్నారు. దీంతో ప్రైవేట్ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సరస్వతి పుష్కరాలకు వెళ్లే భక్తులకు సరిపడా బస్సులు లేక బస్టాండ్ వద్దనే పడగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి భక్తుల సౌకర్యార్థం ఎక్కువ బస్సులను కేటాయించాలని కోరుతున్నారు.