తెలంగాణలో సెప్టెంబర్ 17..రాజకీయంగా దుమారం..!

Telangna: 1948 సెప్టెంబర్ 17న భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ పోలో’తో హైదరాబాద్ సంస్థానం భారత్ యూనియన్‌లో విలీనమై, తెలంగాణకు స్వేచ్ఛా వాయువులు లభించాయి. ఈ ప్రత్యేకమైన రోజును రాజకీయపార్టీలు వివిధరకాలుగా నిర్వహించడం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 17న అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ‘ప్రజా పాలన దినోత్సవం’ నిర్వహించాలని నిర్ణయించడంపై రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
నిజాం పాలన నుంచి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందిన సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా బీజేపీ, జాతీయ సమైక్యత దినోత్సవంగా బీఆర్ఎస్, ఇక ఇప్పుడు కాంగ్రెస్ ‘ప్రజా పాలన దినోత్సవం’గా జరుపుకోవాలని నిర్ణయించడంతో ఈ అంశంపై భిన్న వాదనలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2023 డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, తమ తొలి సెప్టెంబర్ 17 వేడుకలను ప్రజా పాలన దినోత్సవం పేరుతోనే నిర్వహించాయి. ఈ సారికూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు, నిధుల విడుదల, ప్రజా సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
అయితే ఈ అంశంపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నిజాం రజాకార్ల పాలన నుంచి ప్రజలు విముక్తి పొందిన చారిత్రక దినోత్సవాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ వక్రీకరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విమర్శించారు. నిజాం పాలనను స్వాతంత్రానంతరం సైతం కొనసాగించాలని నాటి నెహ్రూ ప్రభుత్వం ప్రయత్నించిందని, సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతోనే విమోచన సాధ్యమైందని బీజేపీ వాదిస్తోంది. ఈ దినోత్సవాన్ని ‘విమోచన దినోత్సవం’గా అధికారికంగా గుర్తించి, నిజాం అరాచకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని బీజేపీ చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ నిర్ణయం చరిత్రను తారుమారు చేయడమేనని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. ఇది తెలంగాణ సెంటిమెంట్‌ను దెబ్బతీయడమేనని అంటున్నారు. గతంలో తాము సెప్టెంబర్ 17ను ‘తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం’గా నిర్వహించామని, ఇది అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని పోయే స్ఫూర్తిని చాటిందని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ‘ప్రజా పాలన’ పేరుతో ఈ చారిత్రక దినోత్సవం ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్, ప్రజల దృష్టి మరల్చడానికే ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటోందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది.
అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. ప్రజా పాలన అంటే నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది ప్రజాస్వామిక, ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన పాలన మొదలవడమేనని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఈ దినోత్సవాన్ని కేవలం ఒక వర్గానికి లేదా ఒక సిద్ధాంతానికి పరిమితం చేయకుండా, ప్రజలందరూ భాగస్వాములయ్యేలా ‘ప్రజా పాలన దినోత్సవం’ నిర్వహిస్తున్నామని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమని కాంగ్రెస్ నేతలు వివరించారు. ప్రజలందరినీ కలుపుకుని పోయే ఉద్దేశ్యంతోనే ఈ పేరును ఎంపిక చేసుకున్నామని, ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
అయితే ఏది ఏమైనప్పటికీ, సెప్టెంబర్ 17 వేడుకల విషయంలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య నెలకొన్న ఈ రాజకీయ వివాదం తెలంగాణ ప్రజల మనోభావాలు, చారిత్రక వాస్తవాలు, రాజకీయ ప్రాధాన్యతల మధ్య ఈ అంశంపై ఏకతాటిపై రాలేకపోతున్నారు. అధికార పార్టీగా కాంగ్రెస్ తమ నిర్ణయాన్ని ముందుకు తీసుకువెళ్లాలని చూస్తుండగా, విపక్షాలు దీనిని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.



