జాతియం

Ram Setu: రామసేతుపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

Ram Setu: మార్గాన్ని ఎంపిక చేసుకోవాలని, తద్వారా రామసేతుకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని తెలుపుతూ సుబ్రమణ్య స్వామి మరో పిటిషన్‌ కూడా దాఖలు చేశారు. ప్రస్తుతం అది సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ ప్రాజెక్టులో భాగంగా మన్నార్‌, పాక్‌ జలసంధిని కలుపుతూ 83 కిలోమీటర్ల మేర పూడిక తీసి ఛానెల్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇది కార్యరూపం దాల్చితే రామసేతుపై తీవ్ర ప్రభావం ఉంటుందన్న ఆరోపణలు ఉన్నాయి.

రామసేతును జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణ్య స్వామి సుప్రీంకోర్టులో గతంలోనే ఓ పిల్‌ దాఖలు చేశారు. స్మారక చిహ్నమా? కాదా అనే విషయాన్ని తేల్చకుండా కేంద్రం ఏళ్లతరబడి నాన్చుతోందని తన పిటిషన్‌లో ఆక్షేపించారు. దీనిని పరిశీలించిన అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ హిమాకోహ్లీ, జస్టిస్‌ జేబీ పార్దీవాలాల ధర్మాసనం దీనిపై కేంద్ర ప్రభుత్వం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

పురాతన కట్టడాలు, ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 1958 ప్రకారం రామసేతను నేషనల్ మాన్యుమెంట్‌‌గా ప్రకటించాలని తాను దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రభుత్వ సమాధానం కోరుతూ 2023లో కోర్టు ఆదేశాలిచ్చిందని స్వామి కోర్టు దృష్టికి తెచ్చారు. ఆ తర్వాత తాను 2023, 2025లో ప్రభుత్వానికి రెండు రిప్రజెంటేషన్లు పంపినప్పటికీ ఈ అంశం విచారణకు రాలేదని చెప్పారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఈ పిటిషన్‌లో చేర్చాలని కోరారు. తద్వారా రామసేతుకు సకాలంలో జాతీయ స్మారక చిహ్నం హోదా కల్పించాలని కోర్టుకు విన్నవించారు.

ఇతిహాసమైన రామాయణం ప్రకారం.. లంకాధిపతి రావణుడు నుంచి తన భార్య సీతను రక్షించేందుకు శ్రీలంకకు వెళ్లే ఉద్దేశంతో రామసేతు వంతెనను రాముడు తన మిత్రుల సహాయంతో నిర్మించాడని సుబ్రహ్మణ్యస్వామి తన పిటిషన్‌లో తెలిపారు. భారతీయ ప్రాచీన చరిత్ర, భారతీయ ఉగా వ్యవస్థ ఆధారంగా లెక్కల ప్రకారం ఈ వంతెన అనేక శతాబ్దాల కిందట నిర్మించారని 15వ శతాబ్దం వరకుపై వంతెనను కాలినడకన ప్రయాణించడానికి ఉపయోగించారని ఆ తర్వాత తుఫానుల కారణంగా వంతెన నిరుపయోగంగా మారిందని తెలిసిందని తెలిపారు.

పురాతన స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాల చట్టం 1958లోని సెక్షన్ 3 అండ్‌ 4 ప్రకారం భారత ప్రభుత్వం పురాతన స్మారక చిహ్నాలను జాతీయ ప్రాముఖ్యత జాతీయ వారసత్వ కట్టడంగా ప్రకటించాల్సిన బాధ్యత ఉందని సుబ్రహ్మణ్యస్వామి తన పిటిషన్‌లో తెలిపారు.

కాగా భారత్, శ్రీలంక మధ్య రామసేతు కాల్పనికం కాదని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ఉపగ్రహం ఐస్‌శాట్‌-2 డేటా సాయంతో ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్‌ను ఇస్రో విడుదల చేసింది. భారత్‌లోని తమిళనాడు శ్రీలంక మధ్య 29 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ వంతెన ఎత్తు సముద్రగర్భం నుంచి 8 మీటర్లు ఉన్నట్లు నిర్ధారించింది. రామేశ్వరం ద్వీపానికి ఆగ్నేయంగా ఉన్న ధనుష్కోడి నుంచి శ్రీలంక మన్నారు ద్వీపంలోని తలైమన్నార్‌ వాయవ్య దిశ వరకు విస్తరించి ఉందని తెలిపింది.

దీనిని సున్నపురాతితో నిర్మించారని, ప్రస్తుతం ఈ సేతువు 99.98 శాతం నీటిలో మునిగిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాగా క్రీస్తుశకం 9వ శతాబ్దం వరకు పర్షియన్లు ఈ వంతెనను సేతు బంధై అని పిలిచేవారు. రామేశ్వరంలోని ఆలయ రికార్డుల ప్రకారం 1480 వరకు తుఫాను వల్ల ధ్వంసమయ్యే వరకు సముద్ర మట్టానికి పైన ఉంది.

అక్టోబరు 2018 నుంచి అక్టోబరు 2023 మధ్య ఆరేళ్ల పాటు నాసా ఐస్‌శాట్-2 సేకరించిన డేటాను విశ్లేషించినట్టు తెలిపారు. రామసేతు గురించి సముద్ర గర్భం మ్యాప్‌ను విడుదల చేయడం ఇదే మొదటిసారి. ఇస్రోకు చెందిన జోధ్‌పూర్, హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు తమ పరిశోధన ఫలితాలను సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురించారు. NASA ఉపగ్రహం ICESat-2 డేటాను ఉపయోగించి ఆడమ్స్ వంతెన గురించి క్లిష్టమైన వివరాలను అందించిన మొదటి నివేదిక ఇది మా పరిశోధనలు రామసేతు, దాని మూలాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడతాయని తెలిపారు.

ఈ ప్రాంతంలో నీరు చాలా తక్కువగా ఉన్నందున షిప్ మ్యాపింగ్ కష్టమైంది. ఇంతకు ముందు పరిశోధన కొన్ని భాగాలకు పరిమితం కాగా ICESat-2 లేజర్ డేటా లోతైన పరిశోధనకు సహకరించింది. నాసాకు చెందిన ఐస్‌శాట్-2 అత్యాధునిక లేజర్ టెక్నాలజీ సాయంతో ఇస్రో శాస్త్రవేత్తలు మ్యాప్‌ను రూపొందించారు. ఇస్రోకు చెందిన గిరిబాబు దండాబత్తుల నేతృత్వంలోని బృందం 2-3 మీటర్ల లోతుతో గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ జలసంధి మధ్య నీటి ప్రవాహాన్ని అనుమతించే మొత్తం 11 ఇరుకైన ఛానళ్లను కనుగొంది. నీటి అడుగున ఉన్న వంతెన సున్నపురాయితో నిర్మించినట్టు పేర్కొంది. ఆకృతి, వాలు విశ్లేషణ, వాల్యూమెట్రిక్స్ వంటి 3-D పారామీటర్ల సాయంతో దీని భౌతిక లక్షణాలను అంచనా వేశారు.

వంతెన నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లు ఏ రకం పదార్థానికి చెందినవనే అంశంపై కూడా పరిశోధనలు జరిగాయి. ఓ వాదన ప్రకారం ఆ రాళ్లు అగ్నిశిలకు చెందిన రాళ్లు. అగ్నిపర్వతం పేలిన తర్వాత వెలువడే లావాకు ఘనరూపమే ఈ అగ్నిశిల రాళ్లు. ఇవి నీటిపై తేలియాడే స్వభావాన్ని కలిగి ఉంటాయట. ఐతే తమిళనాడు, శ్రీలంక పరిసరాల్లో ఎక్కడా కూడా మనకు అగ్నిపర్వతాలు కనిపించవు.

దాంతో రామ సేతు నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లు ప్యూమిక్ స్టోన్స్‌అనే వాదన తప్పు అని తేలి పోయింది. మరో వాదన ఏంటంటే వారధికి చెందిన రాళ్లు పగడపు దిబ్బలకు చెందినవి. ఐతే ఈ వాదనలో కూడా పస లేదని బయటపడింది. ఎందుకంటే పగడపు దిబ్బల్లో కాల్షియం కార్బో నేట్ పదార్థముంటుంది. దీని సాంద్రత నీటి సాంద్రత కంటే ఎక్కువ.కాబట్టి నీటిపై తేలడం కష్టం.

పాంబన్‌, మన్నార్‌ దీవుల మధ్య నెలకొని ఉన్న బ్రిడ్డి వంటి నిర్మాణమే రామసేతు. ఇది మన్నార్‌ సింధుశాఖను పాక్‌ జలసంధితో వేరుచేస్తుంది. దీన్ని శ్రీరాముడు, వానరసేన లంకను చేరుకునేందుకు నిర్మించారని హిందువుల విశ్వాసం. భారత్‌, శ్రీలంక మధ్య రామసేతు పొడవు 48 కిలోమీటర్లు. రామసేతు నిర్మాణం వల్ల భారత వాణిజ్య నౌకలు శ్రీలంక చుట్టు 400 కిలోమీటర్లు లేదా 30 గంటల అధిక దూరం ప్రయాణించాల్సి వస్తుంది.

దీనికి పరిష్కారంగా భారత ప్రభుత్వం జూలై 2, 2005లో సేతు సముద్రం షిప్పింగ్‌ కెనాల్‌ ప్రాజెక్టును ఆమోదించింది. అయితే ఆ ప్రాజెక్టు ద్వారా రామసేతును 20 మీటర్ల లోతు, 200మీటర్ల వెడల్పు తవ్వవలసి ఉంటుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పర్యావరణపరంగా సున్నిత ప్రాంతం. హిందువుల మనోభావాలను గాయపర్చడం వల్ల తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవడంతో 2013లో ఆర్కే ప‌చౌరీ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా 2013లో భారత ప్రభుత్వం శాశ్వతంగా ప్రాజెక్టును నిలిపివేసింది.

అయితే రామాయణం ప్రకారం, రావణుడిని ఓడించిన తర్వాత, రాముడు సీతా, లక్ష్మణులతో అయోధ్యకు తిరిగి వస్తాడు. అయోధ్య రాజు అయిన తర్వాత, విభీషణుడు తన గొప్ప భక్తులలో ఒకడని రాముడు భావిస్తాడు. రావణుడి మరణం తర్వాత, విభీషణుడు లంకను పాలిస్తాడు. రాముడితో శ్రీరామ మీరు ఇక్కడికి రావడానికి నిర్మించిన సేతువు వల్ల మీకు ఉపకారమే జరిగింది.

కానీ ఇకముందు అదే సేతువు దాటి, వేరే రాజులు వచ్చి రాజ్యం మీద యుద్ధం చేస్తే, ప్రజలకు హింస చేస్తే ఏమి చేయాలి? అని రామున్ని అడుగుతాడు.పురాణాల్లో చెప్పిన దాని ప్రకారం విభీషణుడు అలా శ్రీరామున్ని అడగగానే రాముడు తన బాణాలతో రామ సేతువును మునుగేలా చేస్తాడట. అందుకే తేలుతున్న రామ సేతువు ఇప్పుడు నీటిలో మునిగిపోయి ఉంటుందట.

రాముడిపై భక్తికి నిదర్శనం రామసేతు నిర్మాణం. దాని ద్వారా ఆ రాములవారు లంకకు వెళ్లి సీతమ్మను రాణుణుడి దెగ్గర నుంచి తెచ్చుకున్నారు. మరి భక్తికి నిదర్శనపై రామసేతుపై కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button