అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్‌కు భారీ విజయం

అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్‌కు భారీ విజయం లభించింది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను నిలిపివేసే అధికారం దిగువ స్థాయి న్యాయమూర్తులకు లేదని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు ఇచ్చే ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను పలు రాష్ట్రాల్లోని న్యాయస్థానాలు అడ్డుకుంటున్నాయి. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లిన డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట లభించింది.
ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను నిలిపివేసి జాతీయ స్థాయిలో ప్రభావితం చూపే అధికారం దిగువస్థాయి న్యాయమూర్తులకు లేదని స్పష్టం చేసింది. అయితే జన్మతః పౌరసత్వం రద్దు చేస్తూ గతంలో ట్రంప్ జారీచేసిన ఆదేశాల చట్టబద్ధతపై మాత్రం న్యాయస్థానం స్పష్టత ఇవ్వలేదు.
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన వెంటనే జన్మతః పౌరసత్వం రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల్లో పిటిషన్లు దాఖలు కావడంతో కోర్టులు ఇంజంక్షన్ ఆర్డర్లు జారీ చేశాయి. ఇలా తన ఆదేశాలను న్యాయస్థానాలు నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ అక్కడి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
ఎగ్జిక్యూటివ్ విభాగాన్ని రాజ్యాంగపరమైన విధులు నిర్వహించకుండా ఇవి అడ్డుకుంటున్నాయని అందులో పేర్కొన్నారు. వీటిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం న్యాయశాఖ వాదనతో ఏకీభవించింది.
అమెరికా చట్టాల ప్రకారం ఆ దేశ పౌరులకు పుట్టిన వారికి మాత్రమే కాకుండా అక్కడ జన్మించిన ప్రతి ఒక్కరికీ అక్కడి పౌరసత్వం లభిస్తుంది. అమెరికా గడ్డపై పుట్టినవారంతా ఈ దేశ పౌరులే అనే ఉద్దేశంతో 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ద్వారా శరణార్థుల పిల్లలకు అమెరికా జన్మతః పౌరసత్వాన్ని అందిస్తోంది. అమెరికా, కెనడా, మెక్సికో సహా 30కిపైగా దేశాలు జన్మతః పౌరసత్వాన్ని కల్పిస్తున్నాయి. అయితే, ఇప్పటివరకు ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగినప్పటికీ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులతో దానికి బ్రేక్ పడింది.