చెరుకు రైతుకు చివరకు మిగిలింది చేదే

అందరికీ తీపిని పంచే చెరకు రైతుకు మాత్రం చేదే మిగులుస్తోంది. కుటుంబమంతా ఆరుగాలం కష్టపడినా అప్పులే మిగులుతుండటం అన్నదాతను ఆవేదనకు గురిచేస్తోంది. రాష్ట్రంలోనే చెరకు సాగుకు అనకాపల్లి జిల్లా పేరొందింది. అలాంటిది ఇక్కడే చెరకు పేరెత్తితే రైతులు హడలిపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే జిల్లాలో చెరకు పంట’పూర్తిగా కనుమరుగవుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
ఏడేళ్ల క్రితం అనకాపల్లి జిల్లాలో 30 వేల హెక్టార్లకుపైగా చెరకు సాగు చేసేవారు అటువంటిది ఈ ఏడాది కేవలం 2887 హెక్టార్లలోనే సాగు చేశారు. ఇంత తక్కువ విస్తీర్ణంలో చెరుకు సాగు జిల్లాలో ఇంతకు ముందెపుడూ లేదు. ఏడాది కాలంలోనే సాగు సగానికి పైగా పడిపోయింది.
సంవత్సరం పొడగునా సాగుచేసినా అప్పులు మాత్రమే మిగులుతున్నాయని చెరుకు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం ప్రస్తుతం ఎకరా భూమిలో చెరకు సాగుకు నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో 1,12,780 ఖర్చయితే ఆదాయం . 85,400 వస్తుంది. టన్ను చెరుకు పండించడానికి 1800 నుంచి 2,000 ఖర్చు అవుతోందని రైతులు చెబుతున్నారు. ఇక జిల్లాలోని నాలుగు సహకార చక్కెర కర్మాగారాల్లో మూడు మూతపడ్డాయి.
ప్రస్తుతం రాష్ట్రం మొత్తం మీద సహకార రంగంలో నడుస్తున్న ఏకైక చక్కెర కర్మాగారం చోడవరం నియోజకవర్గ పరిధిలోని గోవాడ ఒక్కటే అదీ దివాలా దిశలో ఉంది. కొందరి స్వార్ధ పూరిత నిర్ణయాలు, పాలక వర్గ అవినీతి వలనే గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మూతపడే దిశగా సాగుతోందని ప్రజాసంగమ్ నాయకుడు నందారపు భాస్కర్ ఆరోపించారు.



