ఆంధ్ర ప్రదేశ్

పవన్‌పై సుగాలి ప్రీతి తల్లి ఆరోపణలు..

మరోసారి సుగాలి ప్రీతి కేసు తెరపైకి వచ్చింది. ఆమె తల్లి పార్వతి దేవి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జి సినిమాలో డైలాగ్ చెబుతూ పవన్ కళ్యాణ్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. తమ కుటుంబానికి న్యాయం చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని తన కుమార్తెకు న్యాయం చేయలేకపోయారని విమర్శలు చేశారు.

గతంలో సైతం ఇదే తరహా ఆరోపణలు చేసిన సుగాలి పార్వతీదేవి జనసేన కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. ఇక తాజాగా మరోసారి ఆమె తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే ఈ నెలలో ఏపీకి రానున్న ప్రధాని మోదీని సైతం కలిసేందుకు సిద్ధమని అంటున్నారు. తనను అడ్డుకుంటే నిరాహార దీక్షకు సైతం దిగుతానని హెచ్చరిస్తున్నారు.

కర్నూలు జిల్లా సుగాలి ప్రీతి అనుమానాస్పద మరణం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. 2017లో జరిగిన ఈ ఘటనపై అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు ప్రకటించినప్పటికీ, ఎనిమిది ఏళ్ల తరువాత కూడా న్యాయం జరగకపోవడంతో బాలిక తల్లి పార్వతి మళ్లీ ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుమార్తె కేసులో న్యాయం చేస్తానని ఆయన ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి మోసం చేశారని. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా తమ గురించి మాట్లాడలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

2017 నుంచీ తన కుమార్తెకు న్యాయం చేయాలంటూ పోరాటం చేస్తున్నానంటున్నారు సుగాలి ప్రీతి తల్లి పార్వతి. ప్రభుత్వాలు మారినా, తమ బాధ మాత్రం తగ్గలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని, ఆయన కుమారుడు లోకేష్ గాని, పవన్ కళ్యాణ్ గాని — ఎవ్వరూ సీబీఐ దర్యాప్తు స్థితిగతులను అసెంబ్లీలో చెప్పలేదన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తన పోరాటానికి అండగా నిలిచిందని ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తనను ఎప్పుడూ ఆదరించిన వైఎస్ఆర్‌సీపీ నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తమను మోసం చేశారని ఆరోపిస్తున్నారు.

ప్రస్తుతం పార్వతి ఆరోపణలు మరింత ఘాటుగా మారాయి. జనసేన నాయకులు తనపైనా, తన కులంపైనా అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆమె ఆరోపిస్తోంది. అయినా పవన్ కళ్యాణ్ మాత్రం మౌనం వహిస్తున్నారని ఇదేనా ఆయన న్యాయమంటూ ఆమె ప్రశ్నించారు. ఇక ప్రభుత్వం ‘సూపర్ సిక్స్’ పథకాలతో గొప్పలు చెప్పుకుంటూ, ప్రజల అసలు సమస్యలపై దృష్టి పెట్టడం లేదని ఆమె విమర్శించారు. పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో తన కుమార్తె విషయాన్ని లేవనెత్తుతానన్నారని కానీ ఇప్పటి వరకు ఒక్కసారైనా ప్రస్తావించారా?” అని పార్వతి ప్రశ్నించారు.

ఇక తాను చేపట్టనున్న నిరసన కార్యక్రమంలో భాగంగా “వీల్‌చైర్ యాత్ర” చేపట్టడానికి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు ఆమె వెల్లడించారు. “పవన్ కళ్యాణ్‌కు మనస్సాక్షి ఉంటే, తన యాత్రకు అనుమతి ఇవ్వాలని పార్వతి డిమాండ్ చేశారు. తాజాగా పవన్ నటించిన ఓజీ సినిమా నుంచి ఓ డైలాగును ఉదహరిస్తూ ఆమె తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

కర్నూలు జిల్లాలో 2017లో సుగాలి ప్రీతి అనే విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందింది. స్థానిక కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ హైస్కూల్లో పదోతరగతి చదువుతున్న ఆమె అదే ఏడాది ఆగస్టు 18న ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. సుగాలి ప్రీతిని అత్యాచారం చేసి.. హత్య చేసినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే విచారణలో భాగంగా కేసు అనేక మలుపులు తిరిగింది. అయితే ఈ కేసు విషయంలో పవన్ కళ్యాణ్ 2020లో స్పందించారు.

కర్నూలులో ర్యాలీ చేశారు. కూటమి అధికారంలోకి వస్తే మొదటి కేసుగా పరిగణలోకి తీసుకొని విచారణ చేపడతామని నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అటు తరువాత వైసిపి ప్రభుత్వం స్పందించింది. సిబిఐ తో విచారణ చేపడతామని చెప్పుకొచ్చింది. కానీ రకరకాల కారణాలు చెబుతూ విచారణ ప్రారంభం కాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సీబీఐ కేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. అది మొదలు సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

అక్టోబర్ 16న కర్నూలుకు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవాలని తాను ప్రణాళిక వేస్తున్నట్లు సుగాలి ప్రీతి తల్లి పార్వతి ప్రకటించారు. “మోడీని కలిసేందుకు అవకాశం ఇవ్వకపోతే, కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తానని తనను అడ్డుకుంటే, ఇంట్లోనే నిరాహార దీక్షకు దిగుతానని పార్వతి హెచ్చరించారు. ఎనిమిదేళ్లుగా నిరీక్షిస్తున్నా తనకు ఎప్పుడు న్యాయం జరుగుతుందని సుగాలి ప్రీతి తల్లి ప్రశ్నిస్తున్నారు. మొత్తానికైతే సుగాలి ప్రీతి తల్లి మరోసారి మీడియా ముందుకు రావడం సంచలనంగా మారింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button