Vikarabad: విద్యుత్ షాక్.. బాలుడికి గాయాలు

Vikarabad: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యార్థి ప్రాణాల మీదకు వచ్చిన సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. గంగారం ప్రాథమిక పాఠశాలలో వంశీ అనే విద్యార్థి మూడవ తరగతి చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి భోజనం చేయడానికి బయటకు వెళ్తున్న వంశీ ఎలాంటి రక్షణ కంచె లేకుండా ఉన్న 33 కె.వి ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు వెళ్లగానే విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయాడు.
ఈ ట్రాన్స్ఫార్మర్ పాఠశాల ప్రహరీ గోడకు అనుకొని ఉండడమే కాక, ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఎలాంటి ఫెన్సింగ్ కూడా లేకపోవడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో విద్యార్థి వంశీ చేతులు కాళ్లు కాలాడమే కాకుండా తలకు బలమైన గాయాలయ్యాయి.
పైగా ముక్కు నుండి రక్తం కారుతున్న నేపథ్యంలో వెంటనే స్పందించిన పాఠశాల సిబ్బంది స్థానికులు హుటాహుటిన వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పాఠశాల సిబ్బంది పట్టణంలోని ఓ ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ లోని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం జరిగిన స్థలం దగ్గరకు వెళ్లిన ఆర్డీవో, ట్రాన్స్ఫార్మర్ కు ఫెన్సింగ్ ఎందుకు వేయలేదని విద్యుత్ అధికారులను నిలదీశారు. వెంటనే ట్రాన్స్ఫార్మర్ కు ఫెన్సింగ్ వేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు.



