Chandrababu: మంత్రులకు క్లాస్ తీసుకున్న సీఎం చంద్రబాబు

Chandrababu: ప్రభుత్వ విధి విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలోను, ప్రతిపక్ష పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టడంలో మంత్రులు విఫలమవుతున్నారా అమాత్యులు సరిగా స్పందించకపోవడంతోనే క్యాబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు చురకలంటించారాఇంతకీ సీఎం చంద్రబాబు మంత్రులకి ఏమని దిశానిర్దేశం చేశారు. ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. సచివాలయంలో జరిగిన కేబినేట్ సమావేశంలో మంత్రుల మధ్య ఆసక్తికర చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా లులూ గ్రూప్ షరతుల విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారట. ఇంతకీ మంత్రిమండలి సమావేశంలో ఏం జరిగింది.
క్యాబినెట్ లో కొందరు మంత్రుల తీరుపై సిఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారట. కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్నప్పటికీ ప్రజల్లోకి వాటిని తీసుకువెళ్లటంలో మంత్రులు వైఫల్యం చెందారట గత ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచినా కూటమి సర్కారు మాత్రం ట్రూ అప్ ఛార్జీలు ఒక్క యూనిట్ విద్యుత్ కు 13 పైసలకు తగ్గించిందని .ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎందుకు విఫలమయ్యారని మంత్రులను చంద్రబాబు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో ప్రజలకు సుమారు 980 కోట్ల మేర లబ్ది జరిగిందని, కానీ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటే దానిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మంత్రులు వైఫల్యం చెందారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం.
పలువురు మంత్రులు వారివారి శాఖల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారని సమాచారం. మరోవైపు మెడికల్ కాలేజీల విషయంలో ప్రతిపక్ష వైసిపి పెద్ద ఎత్తున ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేస్తోందని దానిని సమర్ధవంతంగా తిప్పికొట్టడంలో మంత్రులు సక్రమంగా వ్యవహరించలేదని సిఎం అసహనం వ్యక్తం చేశారట ఇక మంత్రులు తమ శాఖల్లో జరుగుతున్న ప్రతి అంశాన్ని ప్రజల్లోకి వెళ్లేలా వివరించాలని సిఎం సూచించారు.
ఇక క్యాబినెట్ సమావేశానికి ముందు సిఎం నివాసంలో సహచర మంత్రులతో మంత్రి నారా లోకేష్ బ్రేక్ ఫాస్ట్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులతో నారా లోకేష్ అనేక అంశాలపై చర్చించారని సమాచారం. జూనియర్ మంత్రులు తమ పనితీరు మెరుగుపరుచుకునేలా దృష్టి పెట్టాలని సూచించినట్లు సమాచారం.వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. వైసీపీ నేతలకు కౌంటర్ ఇవ్వడంలో కూడా మంత్రుల స్పందన సరిగ్గా లేదని లోకేష్ తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు సమాచారం.
రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని లోకేశ్ వద్ద పలువురు మంత్రులు ప్రస్తావించినట్లు సమాచారం.వైసిపి ఇప్పటికే అనేక కుట్రలు చేస్తోందని ఇదే సమయంలో అనేక అంశాలపై ఫేక్ ప్రచారం చేస్తోందని వాటిపట్ల మంత్రులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారా లోకేష్ సూచించినట్లు సమాచారం చిత్తూరులో అంబేడ్కర్ విగ్రహం విషయంలో ప్రభుత్వంపై నెపం వేయాలని పెద్దఎత్తున ప్రచారం చేశారని లోకేష్ గుర్తుచేశారు.ఇప్పుడు నకిలీ మద్యం వ్యవహారంలో కూడా అదే జరుగుతుందని మంత్రులు అందరూ అలర్ట్ గా ఉండాలని నారా లోకేష్ సూచించినట్లు తెలుస్తోంది.
మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కేబినేట్ సమావేశంలో కీలకమైన అంశాలపై ప్రశ్నించారట. ప్రధానంగా లులూ గ్రూప్ లకి భూకేటాయింపుపై మంత్రివర్గ సమావేశంలో ఆసక్తికరమైన చర్చ జరిగిందని సమాచారం. పలు సంస్థలకి భూ కేటాయింపుల కోసం కేబినేట్ ఆమోదం తెలియచేయటంతో ఈ సంస్థలకి సంబంధించి అనేక అంశాలపై పవన్ ప్రశ్నల వర్షం కురిపించారట. అందులో భాగంగా లూలు సంస్థ షరతులు మరీ ఎక్కువుగా ఉన్నాయని రాష్ట్రానికే తన అవసరం ఉన్నట్లు వ్యవహరిస్తోందనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తుందని పవన్ అభిప్రాయపడినట్లు సమాచారం. లులూ ప్రతిపాదిత కార్యకలాపాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వరుస ప్రశ్నలు, సందేహాలు సంధించారు. దీనిపై అధికారులతోపాటు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. సీఎం చంద్రబాబు సైతం లులూ గ్రూప్ షరతుల విషయంలో అసహనం వ్యక్తం చేసారట.
కృష్ణాజిల్లా మల్లవల్లి మెగా ఫుడ్ పార్కులో లులూ గ్రూప్ లో భాగమైన మెస్సర్స్ ఫెయిర్ ఎక్స్పోర్టుకు 7.48 ఎకరాలను కోర్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటుకి లీజు ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది . ఆ సమయంలో ఆహారశుద్ధి పేరిట అక్కడ ఏం చేస్తారో సమాచారం ఉందా? అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఆహారాన్నే శుద్ది చేస్తారని అధికారులు బదులిచ్చారట. ఆహారశుద్ధి అని ఊరికే అంటే కుదరదని…. అక్కడ అసలు ఏం పని చేస్తారని ప్రశ్నించారట. కూరగాయలు సాగుచేస్తారా? ఉద్యానవన పంటలు పండిస్తారా? లేక కబేళాను ఏర్పాటుచేసి గోవధచేసి ఆ మాంసాన్ని ఎగుమతి చేస్తారా? అని పవన్ సూటిగా ప్రశ్నించారట. గోవధ జరగడానికి వీల్లేదని, ఇందుకు తాము పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారట. దీంతో అధికారులు నీళ్లు నమిలారని సమాచారం. ఫుడ్ ప్రాసెసింగ్ అంటూనే పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో చంద్రబాబు కూడా జోక్యం చేసుకున్నారని సమాచారం.
రాష్ట్ర పరిధిలో ఎక్కడా గోవధ జరగడానికి వీల్లేదని, అలాంటి వాటిని అనుమతించబోమని స్పష్టంచేశారట. ఆ తర్వాత లులూ గ్రూప్ వ్యవహారశైలి, దానికి భూ కేటాయింపులు, స్థానికంగా ఉద్యోగాల కల్పన, రెంటల్ ఆగ్రిమెంట్లు వంటి పలు కీలక అంశాలను పవన్ తో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ప్రస్తావించారట. లీజు మొత్తాన్ని 5 సంవత్సరాలకు 5 శాతం మాత్రమే పెంచడం గురించి మంత్రి నాదెండ్ల ప్రశ్నించారట. నిబంధనల ప్రకారం 3 ఏళ్లకు 10 శాతం పెంచాలి కదా అని ప్రశ్నించారట. దీనికి సంబంధిత అదికారులు సమాధానమిస్తూ లులూ యాజమాన్యం పదే పదే కోరడంతో పాటు పెద్ద పరిశ్రమ, ఉపాధి కల్పనను దృష్టిలో పెట్టుకుని సడలింపు ఇచ్చామన్నారట.
విశాఖపట్నం, విజయవాడల్లో లూలు సంస్థలకి ఏ ప్రాతిపదికన భూములు కేటాయిస్తున్నారని,అలాగే అనుసరిస్తున్న విధానాలు, మార్గదర్శకాలు ఏమిటని పవన్ ప్రశ్నించారు. లులూ గ్రూప్ లకి ప్రభుత్వమే భూములు ఇస్తోంది కానీ, షరతులు ఆ సంస్థ పెడుతుందేంటి? ఇదెక్కడి చోద్యం? అంటూ పవన్ విస్తుబోయినట్లు సమాచారం. మూడు సంవత్సరాలకోసారి లీజు పెంచాలని ప్రభుత్వ రెంటల్ అగ్రిమెంట్స్లో ఉంటోంది కానీ, ఆ కంపెనీ పదేళ్లకోసారి పెంచాలని కండీషన్ పెడుతోంది? వీటిపై ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందని ప్రశ్నించారట. మాల్స్ నిర్మాణం పూర్తయ్యాక ఆ కంపెనీ షాపుల రెంట్ ఎలా పెంచుతుంది..? మూడేళ్లకోసారి అద్దెలు పెంచుతారా..? లేక పదేళ్లకోసారి పెంచుతామని చెబుతారా..? అని పవన్ ఆయా శాఖకి చెందిన మంత్రిని, అధికారులని అడిగారట.
లులూ ఏర్పాటు చేసే మాల్స్, సంస్థల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడంపైనా పవన్ కల్యాణ్ పలు సందేహాలు వ్యక్తం చేశారు. విశాఖ, విజయవాడలో లులూ గ్రూప్ ఏర్పాటు చేసే మాల్స్ లో స్థానికులకు ఏ మేరకు ఉద్యోగావకాశాలు కల్పిస్తారని ఆయన ప్రశ్నించారట. స్థానికులకు ఉద్యో గాలు ఇచ్చే విషయంలో కచ్చితమైన నిబంధనలు పాటిస్తామని అధికారులు సమాదానమిచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు లులూ గ్రూప్ అతిగా షరతులు పెడుతున్న మాట వాస్తవమేనని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారట.
గత ప్రభుత్వం లూలు కంపెనీని రాష్ట్రం నుంచి తరిమివేసిందని అయితే కూటమి ప్రభుత్వం తిరిగి ఏపీకి తీసుకురావాలనుకుంటోందని చెప్పారట. అయితే ఆ కంపెనీ పెట్టే అనేక షరతులను పరిశీలిస్తున్నామన్నారు. ప్రజలకూ, రాష్ట్రానికి మేలుచేసే విధంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి అసగాని బదులిచ్చారట.



