బీహార్ ఓటర్ల జాబితాలో ఇద్దరు పాకిస్థానీ మహిళలు

బీహార్‌లోని భగల్‌పూర్ జిల్లాలో ఓటరు జాబితాలో ఇద్దరు పాకిస్థాన్ జాతీయుల పేర్లు ఉన్నట్లు గుర్తించడంతో కలకలం రేగింది. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఇద్దరు మహిళలు పాకిస్థాన్‌కు చెందినవారని, వారి వీసాల గడువు ముగిసినప్పటికీ అక్రమంగా భారతదేశంలో నివసిస్తున్నారని అధికారులు గుర్తించారు.
వారిని విచారిస్తున్నా కొద్ది విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంకా ఇలాంటి వాళ్లు ఉన్నారా అని వేతికే పనిలో అధికారులు పడ్డారు. ఇంతకీ ఆ పాకిస్తాన్‌కు చెందిన మహిళలు ఎందుకు ఇండియాకు వచ్చారు..? ఇన్నేళ్లుగా భారత్‌లో ఏం చేస్తున్నారు..? వారి వెనకున్న వ్యూహామేంటి..?
దేశ రాజకీయాల్లో ప్రస్తుతం బిహార్ ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుండగా అంతా సవ్యంగానే ఉందని ఎన్నికల సంఘం చెబుతూవస్తోంది. అయితే.. బీహార్ ఓటర్ల జాబితాలో పాకిస్థానీ జాతీయుల పేర్లు ఉన్నాయి. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కూడా వారి ఓటర్ కార్డులను ధృవీకరించారు.
అయితే ఆ వ్యక్తులు పాక్ జాతీయులని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లు తొలగించడంతో పాటు దర్యాప్తునకు ఆదేశించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సమయంలో ఈ విషయం బయటపడడం సంచలనం సృష్టిస్తోంది.
ఇమ్రానా ఖానమ్ అలియాస్ ఇమ్రానా ఖాటూన్, ఫిర్దోషియా ఖానమ్ అనే ఇద్దరు మహిళలకు ఓటరు కార్డులు జారీ అయ్యాయి. దీంతో.. కేంద్ర హోంశాఖ విచారణ చేపట్టింది. పాకిస్థాన్‌కు చెందిన ఫిర్దౌసియా ఖానం 1956 జనవరి 19న మూడు నెలల వీసాపై భారత్‌కు వచ్చింది. అలాగే ఇమ్రానా ఖానం అలియాస్ ఇమ్రానా ఖాతూన్ కూడా మూడు సంవత్సరాల వీసాపై భారత్‌కు వచ్చింది. వారి వీసా గడువు ముగిసినప్పటికీ.. పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లలేదు.
భికాన్‌పూర్‌లోని ట్యాంక్ లేన్‌లో నివసించే ముస్లిం వ్యక్తులను పెళ్లి చేసుకుని ఇక్కడే స్థిరపడ్డారు. తర్వాత వీరికి ఓటర్ కార్డులు వచ్చాయి. మరోవైపు ఇబ్తుల్ హసన్ భార్య అయిన ఇమ్రానా ఖానం, మహ్మద్ తఫ్జీల్ అహ్మద్ భార్య అయిన ఫిర్దౌసియా ఖానం చాలా ఏళ్లుగా బీహార్‌లో జరిగే అన్ని ఎన్నికల్లో ఓటు వేస్తున్నారు.
ఓటరు జాబితాలో ఉన్న ఈ మహిళల పేర్లను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో కూడా ధృవీకరించారు. అయితే వారిద్దరూ పాకిస్థాన్ జాతీయులని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా గుర్తించింది. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లు తొలగించడంతోపాటు దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఓటర్ జాబితా నుంచి వారి పేర్లను తొలగించే ప్రక్రియను చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.
ఓటర్ల ధృవీకరణ నిర్వహించిన బూత్ లెవల్ ఆఫీసర్ స్పందించారు. ఆ మహిళలకు సరిపోయే పాస్‌పోర్ట్ వివరాలతో కూడిన అధికారిక సమాచారం అందిందన్నారు. వారిలో ఒకరి పేరు ఇమ్రానా ఖానం. ఆమె వృద్ధురాలు. అనారోగ్యంతో ఉన్నందున మాట్లాడే స్థితిలో లేదు. ఆమె పాస్‌పోర్ట్ 1956 నాటిది. ఇంకొక మహిళ కూడా ఇలానే భారత్‌లో ఉంటున్నారు. శాఖాపరమైన సూచనలను అనుసరించి వారి పేర్లను తొలగించే ప్రక్రియను ప్రారంభించామని సంబంధిత అధికారులు తెలిపారు. కాగా ఈ పాక్ మహిళల ఉదంతం అధికారిక విచారణలో ఉంది. ఉన్నతాధిధికారులు వీరిపై తదుపరి చర్యలు తీసుకోవాల్సివుంది.
దీనిపై ఆగస్టు 11న హోం మంత్రిత్వ శాఖ నుండి నోటీసు స్థానిక ఎన్నికల కార్యాలయానికి చేరుకుంది. తక్షణం వారిపై చర్యలు చేపట్టాలని కోరారు. ఇలా ఉండగా బీహార్‌లో 98.2 శాతం మంది కంటే ఎక్కువ మంది ఓటర్ల పత్రాలను సమర్పించినట్లు భారత ఎన్నికల సంఘం తెలిపింది. ఇక ఎనిమిది రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉందని వెల్లడించింది. ఓటర్ల ముసాయిదా జాబితాలో తప్పులసు సరిదిద్దడం మాత్రమే కాకుండా, వారి గణనఫారమ్‌లతో పాటు అవసరమైన పత్రాలను కూడా సమర్పించవచ్చని తెలిపింది.
బీహార్ సిఇఒ కార్యాలయం సమాచారం ప్రకారం జూన్ 24 నుండి ఆగస్ట్ 24 వరకు, 60 రోజుల్లో 98.2శాతం మంది తమ పత్రాలను సమర్పించినట్లు తెలిపింది. రోజుకు సగటున 1.64శాతం పత్రాలు సమర్పించారని, ఇంకా ఎనిమిదిరోజులు ఉన్నాయని, పత్రాలను సమర్పించేందుకు కేవలం 1.8శాతం ఓటర్లు మాత్రమే మిగిలి ఉన్నారని స్పష్టం చేసింది.
బీహార్‌లో ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేర్లు లేనివారు వాటిని చేర్చాలని కోరుతూ ఆన్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తులు అందజేయవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. వ్యక్తిగతంగా దరఖాస్తులు అందజేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆ దరఖాస్తుతోపాటు ఎన్నికల కమిషన్ పేర్కొన్న 11 పత్రాల్లో ఏ ఒక్కదాన్నైనా లేదా ఆధార్ కార్డు కాపీని అందజేయవచ్చని కోర్టు తెలిపింది.
హోం మంత్రిత్వ శాఖ నుంచి సూచనలు అందాయని భాగల్పూర్ కలెక్టర్ డాక్టర్ నావల్ కిషోర్ చౌదరి తెలిపారు. వారి పేర్లు ఓటరు జాబితాలో కనిపించాయని, ధ్రువీకరణ తర్వాత, తాము ఫారం-7 నింపి, అవసరమైన విధంగా పేర్లను తొలగించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ ఇద్దరు మహిళలకు నోటీసులు పంపనున్నట్లు వెల్లడించారు.
కాగా కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి పార్టీలు నిప్పులు చెరుగుతున్నారు. బతికి ఉన్నవారి ఓట్లు తీసేస్తున్నారని, చచ్చిపోయిన వారి ఓట్లు ఉంచుతు న్నారని.. ఒకే వ్యక్తికి నాలుగు చోట్ల ఎన్నికల గుర్తింపు కార్డులు ఇచ్చారని, జీరో డోర్ నెంబరుతో వేలాది ఓట్లు ఇచ్చారని ఇలా.. అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని ఇండియా కూటమి ఆరోపిస్తోంది. అంతేకాదు.. బీహార్‌లో అయితే 65 లక్షల ఓట్లను తొలగించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెద్ద ఉద్యమమే చేస్తున్నారు.
ఓట్ అధికార్ యాత్ర పేరుతో 13 వేల కిలో మీటర్లు, 22 జిల్లాల్లో కవర్ చేసేలా యాత్రను ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. ఓట్లను చోరీ చేస్తున్నారని, తమకు అనుకూలంగా ఉన్నవారిని చేరుస్తూ.. కాంగ్రెస్, ఇతర ఇండియా కూటమి పార్టీలకు అనుకూలంగా ఉన్నారని భావిస్తున్న ఓటర్లను తొలగిస్తున్నారని రాహుల్‌గాంధీ సహా ఇతర పక్షాల నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. అయితే.. దీనికి సమాధానం చెప్పని ఎన్నిక ల సంఘం ఎదురు ఆరోపణలు సంధించింది అఫిడవిట్లు కోరింది. కుదరకపోతే.. క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేసింది.
ఈ ఘటన దేశంలో ఓటరు నమోదు ప్రక్రియ యొక్క భద్రత, కచ్చితత్వంపై ఆందోళనలను పెంచింది. ఈ ఇద్దరు విదేశీయులు ఓటరు జాబితాలో ఎలా చేరారనే దానిపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల బీహార్ ర్యాలీలో చొరబాటు గురించి ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.



