అంతర్జాతీయం

అమెరికాలో ట్రంప్ పాలన ఆగమాగం.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో అగ్రరాజ్యం

అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్ప బుద్ది ప్రదర్శిస్తున్నారా..? ప్రపంచ రాజకీయ అవనికపై… అగ్రరాజ్యం ప్రాబల్యం క్రమక్రమంగా తగ్గుతోందా..? పెద్దన్న పలుకుబడి ఎందుకు పలుచన అవుతోంది..? డాలరుకున్న రిజర్వు కరెన్సీ విలువ పతనానికి కారణాలేంటి..? ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత… అగ్రరాజ్యం తిరోగమనం వైపు అడుగులు వేస్తోందా..? డొనాల్డ్ నిర్ణయాలు అమెరికన్ల కొంప ముంచుతున్నాయా..? అవుననే సమాధానం విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.

ట్రంప్ రెండో సారి అధ్యక్షుడు అయ్యాక అమెరికాలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్ ఎన్నికల సందర్భంగా ట్రంప్‌ వాడిన నినాదమిది. అయితే అగ్రరాజ్యానికి పూర్వవైభవం తెప్పిస్తానని ధీమాగా చెప్పిన ట్రంప్‌ ఇప్పుడు ఆ దేశానికి ఆర్థికంగా తీవ్ర నష్టం కలిగిస్తున్నాడు. చైనాతో మొదలుపెట్టి అన్ని దేశాలపై పన్నులు విధించుకుంటూ పోవడంతో అమెరికా చాలా రకాలుగా నష్టపోవాల్సి వస్తుంది. ఒక్క పర్యాటక రంగంలోనే ఈ ఏడాది వంద బిలియన్‌ డాలర్ల ఆదాయం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కొన్ని కంపెనీలు టారిఫ్‌ హెచ్చరికలను పెడచెవిన పెట్టి ఇతర దేశాల్లో కర్మాగారాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. దీంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి.

అమెరికా అధ్యక్షుడైన నాటి నుంచి ట్రంప్‌ వైఖరి వివాదాస్పదంగానే ఉంది. మాట వినని దేశాలపై పన్నులతో విరుచుకుపడుతున్నాడు. చైనాపై ఏకంగా 130 శాతం పన్నులను విధించాడు. భారత్‌పై కూడా ట్రంప్ కక్షగట్టాడు. భారత్‌పై ట్రంప్ అక్కసును వెళ్లగక్కుతున్నాడు. భారత్‌పై 50 శాతం టారిఫ్‌లను పెంచాడు. హెచ్‌1-బీ వీసాల ఫీజు పెంచి భారతీయులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. అయితే ఈ వైఖరి ట్రంప్‌కు… అమెరికాకు లాభాలేమీ తెచ్చిపెట్టడం లేదు. పైగా నష్టమే కలగజేస్తున్నాయని తాజా పరిణామాలు చెబుతున్నాయి.

అమెరికాలో వ్యాపార విస్తరణకు ప్రయత్నిస్తున్న చాలా కంపెనీలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డాయి. టారిఫ్‌ల బెడద ఒకపక్కన.. ఆర్థిక అసందిగ్ధత ఇంకో పక్కన వెంటాడుతూండటంతో ఈ కంపెనీలు తమ ప్రణాళికలను సవరించుకుంటున్నాయి. టారిఫ్‌ భయాలు, పర్యాటకుల తగ్గుదలల నేపథ్యంలో పలు కంపెనీలు ఇప్పటికే జారీ చేసిన ముందస్తు ఆర్థిక అంచనాలను వెనక్కు తీసుకుంటున్నాయి. దిగుమతి సుంకాల పెరిగిపోయిన నేపథ్యంలో తమ భవిష్యత్తు అంచనాలను సవరించుకుంటోంది.

ట్రంప్ నిర్ణయాల వల్ల అమెరికాలో ఫెడరల్ ప్రభుత్వ షట్‌డౌన్ ఇంకా కొనసాగుతున్నది. దీని కారణంగా ఇప్పటికే చాలా రంగాలు ప్రభావితం అయ్యాయి. ప్రధానంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా 23 వేల కంటే ఎక్కువ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. జీతాలు అందకపోవడంతో ఎయిర్‌పోర్టుల్లో పనిచేసే సిబ్బంది ఉద్యోగాలు వదిలేస్తున్నారు. ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడానికి ఎయిర్‌పోర్టు సిబ్బంది ఫుడ్ డెలివరీ యాప్‌లలో జాబ్ లు వెతుక్కుంటున్నారు.

అమెరికాలో కొనసాగుతున్న ప్రభుత్వ షట్‌డౌన్ వాయు రవాణా వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్లలో కీలక సిబ్బంది కొరత కారణంగా ఒక్కరోజే 4వేల‌కు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. మరో 118 విమాన సర్వీసులు పూర్తిగా రద్దయ్యాయి. 28 రోజులుగా కొనసాగుతున్న ఈ షట్‌డౌన్‌తో పరిస్థితి నానాటికీ దిగజారుతోంది.

అమెరికాలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ప్రభుత్వ షట్‌డౌన్ దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఇప్పటికే 28 రోజులకు పైగా ఈ సంక్షోభం కొనసాగుతుంది. తమ డిమాండ్లు నెరవేర్చలేదంటూ రిపబ్లికన్స్ స్టాప్ ఏజ్ ఫండింగ్ బిల్లును డెమోక్రాట్లు అడ్డుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి.

దీనివల్ల లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వారికి వేతనాలు అందడం లేదు. మిలిటరీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి కీలక విభాగాలు మాత్రం అత్యవసర సేవలను అందిస్తున్నాయి. ఆదివారం కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఫ్లైట్ అవేర్ డేటా ప్రకారం ఆదివారం సుమారు 8వేల700 విమానాలు ఆలస్యంగా నడిచాయి.

షట్‌డౌన్ కొనసాగినంత కాలం విమానాల ఆలస్యం, రద్దులు తప్పవని రవాణా శాఖ హెచ్చరించింది. ప్రయాణికులు తమ విమాన స్టేటస్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని విమానయాన సంస్థలు సూచిస్తున్నాయి. అమెరికాలో విమానయాన సంస్థల్లో సిబ్బంది కొరత ఏర్పడింది. ప్రభుత్వ షట్ డౌన్ కారణంగా జీతాలు అందకపోవడంతో సిబ్బంది విధులకు హాజరుకావడంలేదు. సిబ్బంది తాత్కాలికంగా ఫుడ్ డెలివరీ బాయ్ లు గా మారిపోయారు. జీతాల్లేకుండా పనిచేయడం తమవల్ల కాదని చెబుతున్నారు. దీంతో సరిపడా సిబ్బంది లేక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి.

అధ్యక్షుడు ట్రంప్ పెద్ద తప్పు చేస్తున్నారని అమెరికన్లు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ట్రంప్‌ ప్రభుత్వ పాలసీలు మిత్ర దేశాలను దూరం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ట్రంప్ చెబుతున్నా కానీ అమెరికా ప్రభావాన్ని ప్రపంచవ్యాప్తంగా బలహీనపరుస్తూ ఏకాకిగా చేస్తున్నారనే ప్రజలు మండిపడుతున్నారు. ప్రస్తుత విధానాలు కీలకమైన ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామ్యాలను దెబ్బతీస్తోంది.

ట్రంప్ యంత్రాంగం భాగస్వాములతో అహంకారంతో వ్యవహరిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. ఐరోపా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియాలో చైనా తన ప్రభావాన్ని విస్తరించుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌ ఎగుమతులపై ట్రంప్ యంత్రాంగం 50 శాతం టారిఫ్‌లు విధించింది. ఒకవైపు వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతోన్న సమయంలో ఈ సుంకాలు విధించారు. అలాగే భారత్‌ను దూరం చేసుకునేలా తీవ్ర పదజాలంతో ట్రంప్ విమర్శలు చేశారు.

మరో వైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా సొంత దేశంలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఇప్పటికే పలు నగరాల్లో జనం వీధుల్లోకి వచ్చి ట్రంప్​ దిగిపోవాలి అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఆయన తీరుకు నిరసనగా జనం రోడ్లమీదికి రావడంతో చెలరేగిన నిరసనల మంటలు దేశమంతా విస్తరిస్తున్నాయి.

ట్రంప్ నిర్ణయాలతో అమెరికాకు లాభం కన్నానష్టమే ఎక్కువగా ఉంది. ఇప్పటికేనా ట్రంప్ తన పిచ్చి నిర్ణయాలను పక్కన బెట్టి దేశ ఆర్థిక స్థితిగతులను చక్కబెట్టాలని అమెరికన్లు కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button