MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

MLC Elections: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ సందర్భంగా తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
ఫిబ్రవరి 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. 10తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 11న నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు 13వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చ్ 3న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఎన్నిక ప్రక్రియను మార్చి 8వరకు పూర్తి చేయాలని ఈసీ స్పష్టం చేసింది.
ఇక తెలంగాణలో కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల చేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. కాగా, ఖాళీ కానున్న ఈ మూడు స్థానాలకు ప్రస్తుతం జీవన్ రెడ్డి, కూర రఘోత్తమ్ రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇక, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు షెడ్యూల్ విడుదల అయ్యింది. ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 27న ఎన్నికలు నిర్వహించి మార్చి 3న ఓట్ల లెక్కింపు చేయనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. నోటిఫికేషన్ విడుదలైన తక్షణమే ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుందని ఎలెక్షన్ కమిషన్ ప్రకటన జారీ చేసింది.
ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆయా జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్రంలో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ మినహా మిగిలిన ఏడు జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది.
ఇక.. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంపై పార్టీలు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నాయి. ఎలాగైన స్థానాలు గెలిచి పట్టభద్రుల ఎన్నికల్లో పట్టు సాధించేదుకు ప్యాన్ చేస్తున్నాయి.