తెలంగాణ

Telangana: లక్షల్లో జీతం.. విదేశాల్లో ఉద్యోగం! తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే ఛాన్స్!

Telangana: విదేశాల్లో ఉద్యోగాలు, లక్షల్లో జీతాలు.. నర్సింగ్‌ విద్యార్థుల కలలకు తెలంగాణ ప్రభుత్వం కొత్త రెక్కలు ఇచ్చినట్లేనా అలాంటి ఓ అద్భుతమైన అవకాశం ఇప్పుడు తెలంగాణ నర్సింగ్ విద్యార్థుల తలుపు తడుతోంది. అది కేవలం ఉద్యోగం కాదు, ఒక ఉజ్వల భవిష్యత్తు అని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా నైపుణ్యం ఉన్న నిపుణులకు భారీ డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో జపాన్, జర్మనీ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో నర్సుల కొరత తీవ్రంగా ఉంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని నర్సింగ్ విద్యార్థులకు జపనీస్, జర్మన్ భాషలు నేర్పించడానికి స్పెషల్ కోర్సులను ప్రవేశపెట్టనుంది. విద్యార్థులకు విదేశాల్లో ఉద్యోగవకాశాలను మెరుగుపర్చడమే కాకుండా వారికి ఆర్థికంగా మంచి భవిష్యత్తును అందిస్తుంది.

రాష్ట్రంలోని యువతకు ఈ అంతర్జాతీయ అవకాశాలను కల్పించి, వారిని గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో భాగం చేయడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం అని ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీతో చేతులు కలిపింది. ఇది కేవలం ఒక ఒప్పందం కాదు, వేలమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపే ఒక నూతన అధ్యాయం.

నర్సింగ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఇకపై తమ నర్సింగ్ డిగ్రీతో పాటు, జపనీస్, జర్మన్ భాషల్లో కూడా పట్టు సాధించనున్నారు. రెండో సంవత్సరం నుంచే ప్రారంభమయ్యే ఈ భాషా తరగతులు వారికి విదేశీ సంస్కృతిని, భాషా నైపుణ్యాలను నేర్పిస్తాయి. ఈ శిక్షణతో వారు కేవలం ఉద్యోగాలు పొందడమే కాకుండా, విదేశాల్లో స్థిరపడటానికి అవసరమైన నైపుణ్యాలను కూడా అలవర్చుకుంటారని ప్రభుత్వం చెబుతోంది.

ప్రస్తుతం, తెలంగాణలో 37 ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి. గతేడాది 16 కాలేజీలు కొత్తగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఏటా 2వేల 360 మంది విద్యార్థులు ఈ కాలేజీల్లో చేరుతున్నారు. గతేడాది ఒక వెయ్యి 410 సీట్లు ఉండగా ఈ విద్యా సంవత్సరంలో వాటి సంఖ్య 2వేల 360కి పెరిగింది.

విదేశాల్లో జీతాలు ఆకర్షణీయంగా ఉండడం మరో ఆకర్షణ. తెలంగాణలో ప్రభుత్వ నర్సులకు సుమారు 6 లక్షల వార్షిక వేతనం లభిస్తుంది. అదే జపాన్, జర్మనీలో వార్షిక వేతనం 18 లక్షల నుంచి 24 లక్షల వరకు ఉంటుంది.

జపాన్ జనాభాలో వృద్ధులు ఎక్కువ. అక్కడ 19.6 లక్షల నుంచి 20.6 లక్షల నర్సింగ్ నిపుణుల అవసరం ఉంది. కానీ 3 లక్షల నుంచి 13 లక్షల మంది నర్సులు కొరతగా ఉన్నారు. అదేవిధంగా, జర్మనీలో కూడా 2030 నాటికి ఐదు లక్షల మంది నర్సులు అవసరం కానున్నారు. ఈ లోపాన్ని అధిగమించడానికి ఈ రెండు దేశాలు విదేశాల నుంచి నర్సులను ఆహ్వానిస్తున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button