అమెరికా నిర్ణయం.. ఐరోపాకు ప్రాణసంకటం

పిచ్చోడి చేతికి రాయి ఇస్తే ఏం చేస్తాడు. ఇపుడు అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చొన్న డొనాల్ట్ ట్రంప్ తీరు చూస్తుంటే అదే అనిపిస్తోంది. ఒకప్పుడు మంచి స్నేహితుడిగా ఉన్న ఓ రాజ్యాధినేతతో తగాదాలు పెట్టుకుంటున్నాడు. ఒకప్పుడు మంచి స్నేహితులు ఇప్పుడు బద్ధ శత్రువులు అనేలా మరిపోయింది మొత్తం పరిస్థితి.
ఇద్దరు భిన్నమైన స్టేట్ మెంట్స్ ఇస్తూ ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతున్నారు. ఆధిపత్యాన్ని చాటుకునేందుకు సోయి లేకుండా పెద్దన్న సొల్లు కబుర్లు చెప్పుతుండడంతో మరో అధినేత ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంతకీ ఆ ఇద్దరీ స్నేహితుల మధ్య చిచ్చు రేపిన కారణాలేంటి..? ఆ నేత తీసుకున్న నిర్ణయం ఏంటి..?
నేను అధ్యక్షుడిని అయితే నెల రోజుల్లో ప్రపంచంలో యుద్ధాలన్నీ ఆపేస్తా అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ఇది. ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు దాటింది. అప్పటికే కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్, ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం ఆగలేదు. కొత్తగా భారత్–పాకిస్తాన్, ఇజ్రాయెల్–ఇరాన్, కంబోడియా–థాయల్‌లాండ్ యుద్ధాలు మొదలయ్యాయి. తాజాగా అమెరికా కూడా రష్యాతో యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా సమీపంలోని సముద్ర జలాల్లో రెండు అణు జలాంతర్గాములను మోహరించినట్లు ప్రకటించడం, దీనికి రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలే కారణమని చెప్పడం అంతర్జాతీయ రాజకీయాల్లో కలకలం రేపింది. రష్యా పార్లమెంటు సభ్యుడు విక్టర్ వోడోలాట్సీ్క, తమ వద్ద కూడా తగిన సంఖ్యలో అణు జలాంతర్గాములు ఉన్నాయని, అమెరికా హెచ్చరికలకు స్పందించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అమెరికా–రష్యా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే రష్యాను బెదిరించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొన్న ఓ తొందరపాటు నిర్ణయం ఐరోపా దేశాలకు ప్రాణసంకటంగా మారనుంది. మధ్యశ్రేణి క్షిపణులను మోహరించకుండా మాస్కో-వాషింగ్టన్‌ల మధ్య ఉన్న ఐఎన్‌ఎఫ్ అంటే ఇంటర్మీడియట్ రేంజి న్యూక్లియర్ ఫోర్స్ ట్రీటీ ఒప్పందాన్ని ఇక ఏమాత్రం అనుసరించబోమని రష్యా ప్రకటించింది.
పశ్చిమదేశాలు తమ జాతీయ భద్రతకు నేరుగా ముప్పును సృష్టించాయని ఆరోపించింది. ఈక్రమంలో ఒప్పందాన్ని అనుసరించే పరిస్థితులు లేవని తేల్చిచెప్పింది. ఉక్రెయిన్‌లో రష్యా ఓడిపోవడమే లక్ష్యమని అమెరికా, నాటో దళాలు బహిరంగంగా ప్రకటిస్తున్నాయన్నారు.
ఆ దేశాలు తాము ఓడిపోవాలని కోరుకుంటున్నాయని, తమ దేశ అణు కేంద్రాలను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని పుతిన్ ఆరోపించారు. రష్యా ఎయిర్‌బేస్‌లపై ఉక్రెయిన్ చేస్తున్న డ్రోన్ దాడులకు నాటో దేశాలు సహకరిస్తున్నాయన్నారు. అమెరికాతో గతంలో చేసుకున్న న్యూ స్టార్ట్ ఒప్పందం నుంచి తాత్కాలికంగా తప్పుకొంటున్నామని, అమెరికా ఇలానే వ్యవహరిస్తే అణ్వాయుధాల ప్రయోగాల పునరుద్ధరణకు కూడా సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. తాము కొన్నిరకాల క్షిపణులను మోహరించకుండా విధించుకొన్న ఆంక్షలను ఇక పాటించబోమని స్పష్టం చేశారు.
ప్రపంచానికి ముప్పుగా మారిన అణ్వాయుధాలపై పరిమితి ఉండాలని 2010లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు మెద్వెదెవ్ న్యూ స్టార్ట్ ఒప్పందం చేసుకున్నారు. దీని ప్రకారం ఈ దేశాలు 1,550 అణు వార్‌హెడ్‌లు, 700 క్షిపణులు, బాంబర్లకు మించి మోహరించవద్దని పరిమితి విధించారు. ఈ ఒప్పందం 2021 ఫిబ్రవరిలో ముగియాల్సి ఉండగా మళ్లీ ఐదేండ్ల పాటు పొడిగించాయి.
ఈ ఒప్పందం ప్రకారం ఒక దేశంలో మరో దేశం తనిఖీలు చేయాల్సి ఉంటుంది. అయితే, కరోనా కారణంగా గత మూడేండ్లుగా ఈ తనిఖీలు జరగడం లేదు. ఇటీవల తనిఖీలకు అమెరికా పట్టుబడుతున్నది. కానీ ఒకవైపు ఉక్రెయిన్‌కు మద్దతిస్తూ తమ దేశ ఆయుధ కేంద్రాలను ఎలా తనిఖీ చేస్తారని రష్యా అంగీకరించడం లేదు.
గ్లోబల్ సౌత్ దేశాలపై ఆధిపత్యాన్ని చెలాయించేందుకు అమెరికా ఆధునిక వలసవాద విధానాన్ని అనుసరిస్తోందని రష్యా మండిపడింది. సుంకాలు, ఆంక్షలు చరిత్ర సహజ గమనాన్ని మార్చలేవని స్పష్టం చేసింది. అంతర్జాతీయ వేదికపై స్వతంత్ర మార్గాన్ని ఎంచుకునే దేశాలపై అమెరికా రాజకీయ ప్రేరేపితమైన ఆర్థిక ఒత్తిడికి గురిచేస్తోందని విమర్శించింది.
అభివృద్ధి చెందుతున్న, ఆర్థికంగా వెనుకబడిన దేశాలతో సహకారాన్ని పెంపొందించుకోవడానికి, నిజమైన బహుళపక్ష వాదం, సమానత్వంతో కూడిన ప్రపంచ వ్యవస్థ సాకారానికి కృషి చేసేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా తెలిపారు.
అమెరికా దళాలు ఫిలిప్పీన్స్‌లో టైఫూన్ క్షిపణి లాంచర్లను మోహరించడం, ఆస్ట్రేలియా సమీపంలోని టలిస్మాన్ సాబ్రె డ్రిల్స్‌లో క్షిపణులను పరీక్షించడం దీనికి ప్రధాన కారణంగా వెల్లడించింది. మరోవైపు ట్రంప్ చర్యలు కూడా దీనికి ఆజ్యం పోశాయి. ఇటీవలే రష్యా మాజీ అధ్యక్షుడు మెద్విదేవ్ ప్రకటనకు స్పందనగా.. రెండు ఒహైయో శ్రేణి అణు జలాంతర్గాములను మోహరించేలా ఆదేశాలు జారీ చేశారు.
మెద్వదేవ్, ట్రంప్ ఆర్థిక ఆంక్షల హెచ్చరికలను యుద్ధం వైపు ఒక అడుగుగా వ్యాఖ్యానించడం, అలాగే రష్యా సోవియట్ యుగంలోని డెడ్ హ్యాండ్ అణు ఆయుధ వ్యవస్థను ప్రస్తావించడం ఈ ఉద్రిక్తతకు కారణమైంది. ట్రంప్ ఈ చర్యను సన్నద్ధత కోసం తీసుకున్నట్లు తెలిపినప్పటికీ ఈ ప్రకటన అణు ఆయుధాల రాజకీయ సంకేతాలను తీవ్రతరం చేసింది.
రష్యా పార్లమెంటు సభ్యుడు విక్టర్ వోడోలాట్సీ్క ఈ పరిణామంపై స్పందిస్తూ, రష్యా వద్ద కూడా అణు జలాంతర్గాముల సంఖ్య అమెరికా కంటే ఎక్కువగా ఉందని, అవి అమెరికా జలాంతర్గాములను నియంత్రణలో ఉంచగలవని తెలిపారు. ట్రంప్ ప్రకటనకు స్పందించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో, గ్లోబల్ అఫైర్స్ మ్యాగజైన్ రష్యా ఎడిటర్ ఫ్యోడర్ లుక్యానోవ్, ట్రంప్ హెచ్చరికలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదని, అవి ఎక్కువగా రాజకీయ సంకేతాల కోసం చేసినవని వ్యాఖ్యానించారు.
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కూడా అమెరికాతో ప్రత్యక్ష సైనిక ఘర్షణలను నివారించాలనే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వాదనతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు, ఇది రష్యా సంయమన వైఖరిని సూచిస్తుంది.
కాగా 1987లో అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్, రష్యా అధినేత మిఖాయిల్ గోర్బచేవ్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇంటర్మీడియట్ రేంజి న్యూక్లియర్ ఫోర్స్ ట్రీటీగా దీనిని వ్యవహరిస్తారు. దీనిప్రకారం భూ ఉపరితలంపై నుంచి ప్రయోగించే మధ్యశ్రేణి రేంజి క్షిపణుల మోహరింపును నిషేధించారు. 500 కిలోమీటర్ల నుంచి 5,500 కిలోమీటర్ల మధ్యలోవి ఈ ఒప్పంద పరిధిలోకి వస్తాయి.
అప్పట్లో ఐఎన్‌ఎఫ్ ట్రీటీ కారణంగా సోవియట్ అమెరికాలకు చెందిన దాదాపు 2,692 క్షిపణలను ధ్వంసం చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీనిని ప్రచ్ఛన్న యుద్ధాన్ని మలుపుతిప్పిన సంధిగా భావిస్తారు. వాస్తవానికి ఈ ఇంటర్మీడియట్ రేంజి క్షిపణుల మోహరింపుతో అమెరికా మిత్రులైన ఐరోపా దేశాలకే ప్రధాన ముప్పు.
2019లో ట్రంప్ ఈ ఒప్పందం నుంచి అమెరికాను బయటకు లాగేశారు. రష్యా సుదర్ఘీకాలంగా దీనిని ఉల్లంఘిస్తోందని ఆయన నాడు ఆరోపించారు. 9ఎం729, ఎస్‌ఎస్‌సీ-8 క్షిపణులను మోహరించిందని తెలిపారు. దీనిని నాడు మాస్కో తిరస్కరించింది. ఇప్పుడు ట్రంప్ అణు జలాంతర్గాముల మోహరింపు ఆదేశాలు వెలువడిన మూడు రోజులకు రష్యా కూడా ఈ ఒప్పందం నుంచి బయటకు వచ్చేస్తామని ప్రకటించింది.
ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై మరోసారి తన ఆక్రోశాన్ని వెల్లగక్కారు. ఇటీవల భారత్‌పై 25 శాతం ప్రతీకార సుంకం విధిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్ తాజాగా మరిన్ని సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనుగోలు చేస్తోందన్నారు. ఆ చమురును మళ్లీ బయట దేశాలకు విక్రయిస్తోందన్నారు. బహిరంగ మార్కెట్‌లో చమురు విక్రయించి భారత్ లాభం గడిస్తోందంటూ ఆక్షేపించారు. భారత్ పెద్ద మొత్తంలో ఆయిల్ కొనుగోలు చేయడం వల్ల రష్యాకు భారీగా ఆర్థిక వనరులు చేకూరుతున్నాయన్నారు.
అందుకే ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపడం లేదని ఆరోపించారు. భారత్‌పై విధించిన 25 శాతం ప్రతీకార సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఒక దేశ విదేశాంగ విధానంలో మరో దేశం జోక్యం చేసుకోకూడదు. మనం మన దేశ అవసరాల కోసం చమురును రష్యా నుంచి కొనుగోలు చేస్తే అమెరికాకు వచ్చిందేమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తాను చెప్పినట్టే ప్రపంచ దేశాలు నడుచుకోవాలనే అహంకారం వలనే ఇదంత జరుగుతుందన్నారు.
అమెరికాపై భారత్ విరుచుకుపడింది. ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్న శైలిని విమర్శించింది. భారత్ ఎక్కడ నుంచి చమురు దిగుమతి చేసుకోవాలి అనేది తమ అంతర్గత వ్యవహారమని జాతీయ ప్రయోజనాలు, ఇంధన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని విదేశాంగ తెలిపింది. దాని కోసం అమెరికా భారత్ మీద వత్తిడి తేవడం ఎంత మాత్రం సమంజసం కాదని చెప్పింది.
అమెరికా, రష్యాల మధ్య వివాదంలోకి భారత్ ను తేవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకు ముందు ప్రపంచ ఇంధన మార్కెట్ల స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి భారత్ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడాన్ని ప్రోత్సహించి అమెరికానే ఇప్పుడు వ్యతిరేకిస్తోందని దుయ్యబట్టింది.
ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కారణం ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం. ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఆర్థిక ఆంక్షలు విధించే హెచ్చరికలు చేస్తూ, ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించాలని డెడ్‌లైన్ విధించారు. మొదట 50 రోజుల గడువు ఇచ్చిన ట్రంప్, దానిని 10–12 రోజులకు తగ్గించారు.
మెద్వదేవ్ ఈ హెచ్చరికలను ‘యుద్ధం వైపు అడుగు‘గా విమర్శించారు, దీనికి ప్రతిస్పందనగా ట్రంప్ అణు జలాంతర్గాముల మోహరణ ప్రకటన చేశారు. ఈ సందర్భంలో, రష్యా యొక్క డెడ్ హ్యాండ్ వ్యవస్థను ప్రస్తావించడం అమెరికా–రష్యా సంబంధాలను మరింత దిగజార్చింది.
ట్రంప్ ప్రకటన అణు జలాంతర్గాములను నిజంగా మోహరించారా లేక రాజకీయ సంకేతంగా ఈ ప్రకటన చేశారా అనేది స్పష్టంగా తెలియడం లేదు. అమెరికాకు చెందిన ఒహియో–క్లాస్ జలాంతర్గాములు ఇప్పటికే రష్యా సమీపంలోని సముద్రాల్లో తిరుగుతుంటాయని, ఈ మోహరణ కేవలం రాజకీయ సందేశం కావచ్చని భద్రతా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికా సైన్యం జలాంతర్గాముల గురించి సాధారణంగా రహస్యంగా ఉంచుతుంది. ఈ చర్య నిజమైన సైనిక ఆపరేషన్ కంటే రాజకీయ ఒత్తిడి కోసం ఉద్దేశించినదిగా కనిపిస్తుంది. అయితే, ఈ రకమైన అణు సంకేతాలు రెండు అణు శక్తిగల దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
మొత్తంగా ఎంకి పెళ్లి సుబ్బిగాడి చావుకు వచ్చినట్టు రష్యాతో మనం చమురు కొనుగోలు వల్లే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆగడం లేదంటూ ఏదో పిచ్చి కూతలు కూస్తున్నాడు. తాను చేస్తే శృంగారం పక్కొడు చేస్తే వ్యభిచారం అన్న చందంగా ఉంది అమెరికా తీరు చూస్తుంటే. అయితే రష్యాను బెదిరించాలని చూసిన ట్రంప్ నిర్ణయాలు ఇప్పుడు అమెరికాకి మిత్ర దేశాలైన ఐరోపా దేశాలకే ప్రాణ సంకటనగా మారడం ఆశ్చర్యంగా మారింది.



