Revanth Reddy: బీజేపీపై రేవంత్ బీసీ అస్త్రం

Revanth Reddy: బీసీ రిజర్వేషన్ అంశంతో బీజేపీని డిఫెన్స్ లో పడేసేందుకు కాంగ్రెస్ పార్టీ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేస్తోంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడంతో బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలంటూ అధికార ఎన్.డి.ఏ కూటమిపై ఒత్తిడి పెంచేందుకు విపక్షాలను హస్తం పార్టీ ఏకం చేస్తోంది. తెలంగాణలో రేవంత్ సర్కార్ చేసిన కులగణనను రోల్ మోడల్‌గా తీసుకుని దేశంలోని బీసీల లెక్క తెల్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించడంతో గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ జారీ చేసేందుకు రేవంత్ సర్కార్ పావులు కదపడంతో బీసీ రిజర్వేషన్ వ్యవహారం వేడెక్కింది. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ తాపత్రయ పడుతుంటే కేంద్రంలోని మోడీ సర్కార్ మోకాలు అడ్డుతోందని హస్తం నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ ఎదురు దాడితో డిఫెన్స్‌లో పడ్డ బీజేపీ, పరిస్థితి చేయి దాటకుండా జాగ్రత్త పడుతోంది.
బీసీ రిజర్వేషన్ ముసుగులో ముస్లిం రిజర్వేషన్‌ను అమలు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని, చిత్తశుద్ధి ఉంటే ముస్లింల ప్రస్తావన లేకుండా బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టాలని కమలనాధులు ఎదురు దాడి చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీల మధ్య జరిగే రాజకీయ క్రీడలో బీసీ బిల్లుకు మోక్షం లభిస్తుందా బీసీల విషయంలో ఏపార్టీకి చిత్తశుద్ధి ఉంది. అనే అంశాలపై స్పెషల్ డిబేట్.