Revanth Reddy: వికసిత్ భారత్ కాదు.. సంక్షోభ భారత్‌ను సృష్టిస్తున్నారు

Revanth Reddy: ఉపాధి హామీ పథకానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు మోడీ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, కానీ అధికారం ఉందన్న అహంకారంతో కేంద్ర ప్రభుత్వం ఇష్టారీతిలో వ్యవహరిస్తోందని విమర్శించారు. చట్టం మార్పు పేరుతో గాంధీ పేరును తొలగించారని, పేదలపై కేంద్రం కక్ష కట్టిందని అన్నారు. మోడీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, విదేశీ శక్తులకు దేశాన్ని అప్పగించాలనే ప్రయత్నం జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కోట్లాది మంది పౌరులను ఈ దేశ పౌరులే కాదన్నట్టుగా చూపించేలా ఎస్ఐఆర్ పేరుతో కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇది వికసిత్ భారత్ కాదని, సంక్షోభ భారత్‌ను సృష్టిస్తున్నారని అన్నారు. ఉపాధి హామీ పేరు మార్పు వెనుక బడా కంపెనీల కుట్ర ఉందని ఆరోపిస్తూ, 12 వేల గ్రామాల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపిస్తామని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకున్నామని, మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.



