సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు

కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు ముందుకు వచ్చింది అక్షయ పాత్ర ఫౌండేషన్. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ని అక్షయ పాత్ర పౌండేషన్ ప్రతినిధులు కలిశారు. నవంబరు 14వ తేదీన కొడంగల్‌లో నిర్మించ తలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ కిచెన్ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌ను ఆహ్వానించారు. మధ్యాహ్న భోజనం తయారు చేసేందుకు కొడంగల్ సమీపంలోని ఎన్కేపల్లిలో రెండెకరాల విస్తీర్ణంలో గ్రీన్ ఫీల్డ్ కిచెన్ నిర్మించనుంది అక్షయ పాత్ర ఫౌండేషన్.
గ్రీన్ ఫీల్డ్ కిచెన్‌లో వండిన భోజనాన్ని నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలకు సరఫరా చేయనున్నారు. ప్రస్తుతం తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనానికి ఒక్కో విద్యార్థికి రూ.7 చొప్పున చెల్లిస్తోంది ప్రభుత్వం. అయితే, నాణ్యమైన భోజనం అందించేందుకు దాదాపు రూ.25లు ఖర్చు చేస్తోంది అక్షయ పాత్ర ఫౌండేషన్. తెలంగాణ ప్రభుత్వం చెల్లించే నిధులకు అదనంగా అయ్యే ఖర్చును భరించనుంది అక్షయ పాత్ర ఫౌండేషన్.



