తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుకు ఊరట

తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుకు ఊరట దక్కింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా అధికారుల విధులకు ఆటంకం కలిగించారన్న కేసును కొట్టివేసింది న్యాయస్థానం. 2017, ఆగస్టు 23న పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో శ్రీధర్ బాబుపై కేసు నమోదు అయింది. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబుతో సహా 13 మంది కాంగ్రెస్ నేతలపై గతంలో కేసు నమోదైయ్యాయి.
2017లో ఈ కాంగ్రెస్ నేతలపై అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేసులు పెట్టింది. అప్పటినుంచి ఈ కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతూనే ఉంది. అయితే తాజాగా ఈ కేసును పరిశీలించిన కోర్టు మంత్రి శ్రీధర్ బాబుతో సహా 13 మందిపై నమోదైన కేసును కొట్టివేసింది.
భూములు కోల్పోతున్న రైతుల పక్షాన పోరాడితే తమపై కేసులు పెట్టారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. చివరికి న్యాయమే గెలిచిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్‌లో రైతుల హక్కుల కోసం వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లాం కానీ అధికారం ఉందని తమపై వివిధ సెక్షన్ల కింద అన్యాయంగా కేసులు పెట్టారన్నారు.
ఇది రైతుల విజయమని అధికారం ఉందని అప్పుడు కేసులు పెట్టి పోలీసులను ఎలా పడితే అలా వాడుకున్నారని విమర్శించారు. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉందని చట్టాలను నమ్ముతూ తాము ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూడా నిలవలేదన్నారు. దానిపై కూడా విచారణ జరుగుతోందని తప్పు చేసినవాళ్లు.. శిక్ష అనుభవించాల్సిందేనని శ్రీధర్ బాబు అన్నారు.