ఆరు దేశాల్లో ‘ధురంధర్’ బ్యాన్!

బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమాకు ఆరు గల్ఫ్ దేశాల్లో ఎర్ర సిగ్నల్ పడింది. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈల్లో ఈ చిత్రం ప్రదర్శనకు అనుమతి నిరాకరించారు. పాకిస్థాన్‌ను వ్యతిరేకంగా చూపించారనే ఆరోపణతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.
చాలా రోజుల తర్వాత రణ్‌వీర్ సింగ్ కి హిట్ లభించింది. ఆయన హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మాధవన్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషించారు. విడుదలైన వారం రోజుల్లోనే ఈ సినిమా రూ.180 కోట్లకుపైగా వసూలు చేసి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. అయితే ఈ క్రమంలోనే ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈల్లో ‘ధురంధర్’ ప్రదర్శనకు పూర్తి నిషేధం విధించారు. సెన్సార్ అనుమతి కూడా ఇవ్వకుండా నిర్మాతల ప్రయత్నాలను తిప్పికొట్టారు. ఈ చిత్రంలో పాకిస్థాన్‌ను, పాక్ ఉగ్రవాదాన్ని నెగిటివ్‌గా చూపించడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కాగా, నెటిజన్లు మిశ్రమ స్పందనలు వ్యక్తం చేస్తున్నారు.



