Ram Gopal Varma:: పైరసీపై ఆర్జీవీ ధనాధన్!

Ram Gopal Varma: హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పైరసీపై తన అభిప్రాయాలు వెల్లడించారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టుతో పైరసీపై చర్చ మళ్లీ రాజుకుంది. ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ సోషల్ మీడియాలో మాట్లాడుతూ పైరసీ ఎప్పటికీ ఆగదని, ఉచితంగా సినిమా చూడాలనుకునే ప్రేక్షకులు ఉన్నంతవరకు రవి లాంటి వాళ్లు వస్తూనే ఉంటారని అన్నారు. రవిని రాబిన్‌హుడ్‌తో పోల్చడాన్ని తప్పుపట్టిన ఆర్జీవీ, రాబిన్‌హుడ్ టెర్రరిస్ట్ లాంటివాడని, ధనవంతుల ఏకైక నేరం కష్టపడి సంపాదించడమేనని విమర్శించారు.
థియేటర్ టికెట్, పాప్‌కార్న్ ధరలు ఎక్కువైతే పైరసీ సమర్థనీయమా అని ప్రశ్నించిన ఆయన, BMW ఖరీదైంది కదా అని షోరూమ్ దోచుకోవచ్చా, అలాగే సినిమాకి మాత్రం ఎందుకు ఆ లాజిక్ అని నిలదీశారు. పైరసీని పూర్తిగా అరికట్టాలంటే సరఫరా చేసేవారితోపాటు చూసేవారినీ కూడా నేరస్థులుగా పరిగణించాలని, వంద మంది పైరసీ వీక్షకులను అరెస్టు చేసి పేర్లు ప్రకటిస్తే అప్పుడు భయం పుడుతుందని ఆర్జీవీ సూచించారు.



