సినిమా

ఆస్ట్రేలియాలో నటి నవ్యకు షాక్.. మల్లెపూలు తెచ్చినందుకు లక్షకు పైగా జరిమానా

మల్లెపూలు.. సువాసన భరితమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తాయి. పండుగలకు, శుభకార్యాలకు పూలు తీసుకెళ్లడం మన దేశంలో ఒక సాధారణ సంప్రదాయం. ఇప్పుడా మల్లుపూలు ఒక హీరోయిన్‌కు ఏకంగా అక్షరాల లక్ష 14వేల రూపాయలు ఫైన్ వేసేలా చేశాయి. ఏంటి.. మల్లెపూలతో.. హీరోయిన్‌కి లక్ష ఫైనా..? అని ఆశ్చర్యపోతున్నారా..? మీరు విన్నది అక్షరాల నిజమే.. మరి ఇది ఎక్కడ జరిగింది? అసలు ఆ హీరోయిన్ ఏం చేసింది? ఆమెకు లక్ష ఫైన్ ఎందుకు? ఎవరు విధించారు?

గుడులకు, శుభకార్యాలకు వెళ్లేటప్పుడు పూలు పెట్టుకోవడం, వెంట తీసుకెళ్లడం అందరూ చేసే పనే. కానీ ఇదే పని చేసిన ఓ నటికి గట్టి షాక్ తగిలింది. ముఖ్యంగా ఆమె ఓ మూరెడు మల్లెపూల దండ వెంట తీసుకెళ్లినందుకే ఆమెకు 1లక్షా 14వేల రూపాయలు జరిమానా విధించారు. ఇది తప్పని తనకు తెలియదని చెప్పినా పట్టించుకోకుండా వెంటనే డబ్బులు చెల్లించమంటూ ఆదేశాలు జారీ చేశారు.

దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈమె డబ్బులు చెల్లించగా ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఈ విషయం తెలుసుకున్న వారంతా షాక్ అవుతున్నారు. మూరెడు మల్లెపూల కోసం లక్ష రూపాయల జరిమానా ఏంట్రా బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

తిరువోణం పండుగ సందర్భంగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఓనం వేడుకల్లో పాల్గొనేందుకు మలయాళ నటి నవ్య నాయర్ అక్కడికి వెళ్లారు. ఆమె తనతో పాటు 15 సెంటీ మీటర్ల మల్లెపూల దండను వెంట తీసుకెళ్లారు. కానీ విమానాశ్రయంలో ఆస్ట్రేలియా కస్టమ్స్ అధికారులు ఆమె వద్ద ఉన్న పూల దండను గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆస్ట్రేలియాకు ఇతర దేశాల నుంచి మొక్కలు, విత్తనాలు, పూలు, ఆహార పదార్థాలు వంటి వాటిని తీసుకురావడంపై కఠినమైన నిబంధనలు ఉన్నాయని చెబుతూ జరిమానా విధించారు.

ముఖ్యంగా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆమెకు 1980 ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే.. భారత కరెన్సీ ప్రకారం 1లక్షా14వేల రూపాయలు జరిమానా విధించారు. అధికారుల నోట ఈ మాట విన్న నవ్య నాయర్ షాక్ అయ్యారు. తనకు ఈ విషయం తెలయదని చెబుతూనే తన తండ్రి ఎంతో ప్రేమగా కొనివ్వడం వల్లే ఈ మల్లెపూలు వెంట తీసుకు వచ్చినట్లు వివరించారు. అయినా చేసింది తప్పే కాబట్టి జరిమానా చెల్లించాల్సిందేనని అధికారులు తెలిపారు. దీంతో చేసేదేమీ లేక నవ్య నాయర్ అధికారులు చెప్పిన మొత్తాన్ని చెల్లించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

తాను ఆస్ట్రేలియాకు రాకముందు తన కోసం వాళ్ల నాన్న మల్లెపూలు తీసుకువచ్చాడని వాటిని రెండు భాగాలుగా చేసి ఒక భాగం కొచ్చి నుండి సింగపూర్‌కు వెళ్లేటప్పుడు తన తలలో పెట్టుకున్నట్లు తెలిపారు. ఎందుకంటే తాను అక్కడికి చేరుకునే సమయానికి మల్లెల్లు వాడిపోతాయని సింగపూర్‌ నుంచి తదుపరి ప్రయాణంలో మిగిలిన పూలు పెట్టుకోవచ్చని వాటిని హ్యాండ్‌ బ్యాగ్‌లో ఉంచుకున్నట్లు తెలిపారు. అయితే తాను చేసింది చట్ట విరుద్ధం.

ఇది తాను తెలియకుండా చేసిన తప్పు. అజ్ఞానం క్షమించబడదు. 15 సెంమీ మల్లె మాలను తెచ్చినందుకు, ఎయిర్‌పోర్ట్‌ అధికారులు 1లక్షా14వేలు జరిమానా చెల్లించమని అడిగారని.. అయితే అది ఉద్దేశపూర్వకంగా చేయలేదని చెప్పేసరికి ఈ జరిమానాను 28 రోజుల్లోపు చెల్లించాలని వారు చెప్పారని నటి నవ్వ అక్కడ జరిగిన బహిరంగ కార్యక్రమంలో వెల్లడించారు.

కాగా.. ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం అంతర్జాతీయ ప్రయాణికులు ఎవరైనా ఆస్ట్రేలియా వచ్చే ముందు పువ్వులు పెట్టుకుంటే ముందుగానే డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. మొక్కలకు సంబంధించిన వాటిని తీసుకొచ్చే ముందుగానే డిక్లేర్ చేయకపోతే భారీ జరిమానా, క్రిమినల్ ఛార్జ్‌లను కూడా ఎదుర్కొవాల్సి ఉంటుంది. బయో సెక్యూరిటీ విషయంలో ఆస్ట్రేలియా కఠిన నిబంధనలను అనుసరిస్తుంది.

అయితే అక్కడ పాటించే కఠినమైన నిబంధనల మేరకు కేవలం మల్లెపూలు మాత్రమే కాదు.. మనం వినియోగించే అనేక వస్తువులు, పదార్థాలపై ఆస్ట్రేలియాలో నిషేధం ఉన్నట్లు తెలుస్తోంది. తాజా లేదా ఎండిన పువ్వులు, పండ్లు, కూరగాయలు, మూలికలు, సుగంధ ధ్రవ్యాలు, ముడిగింజలు, విత్తనాలు, పాల ఉత్పత్తులు
బర్ఫీ, రసమలై, రసగుల్లా, దూద్‌పేడ, గులాబ్ జామున్, మైసూర్ పాక్ వంటి స్వీట్లు, బియ్యం, టీ, తేనె ఇంట్లో తయారుచేసిన ఆహారం, పెంపుడు జంతువుల ఆహారం, పక్షులు, జంతువుల ఈకలు, ఎముకలు, చర్మంతో చేసిన జాకెట్లు, బ్యాగులు, దుప్పట్లు, మూలికలు ఇటువంటివి తీసుకెళ్తే.. జరిమానాతో పాటు ఒక్కోసారి జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉందట.

తమ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఆస్ట్రేలియా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు. విదేశీ ప్రయాణికులు నిషేధిత వస్తువులను తీసుకువస్తే వాటిని స్వాధీనం చేసుకున్న వెంటనే ధ్వంసం చేసి.. ఆ ప్రయాణికులకు జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తారు. ఒకవేళ అవి తీవ్రమైన ఉల్లంఘనలైతే ప్రయాణికుల వీసాలను సైతం రద్దు చేసే అవకాశం ఉంటుంది.

అయితే ఆస్ట్రేలియాకు వెళ్లేవారు తీసుకువెళ్తున్న ఆహార పదార్థాలు, వస్తువులకు సంబంధించిన వివరాలను ముందుగానే అక్కడి అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. ఒకవేళ అవి నిషేధిత జాబితాలో ఉంటే విమానాశ్రయం అధికారులు వాటిని జప్తు చేస్తారు. ఎటువంటి జరిమానా విధించరు. అలాకాకుండా దొంగచాటుగా లేదంటే తెలియకుండా నిషేధిత వస్తువులను తీసుకెళ్తే మాత్రం తగిన పరిణామాలు ఎదుర్కోక తప్పదు.

ప్రపంచంలోని అత్యంత కఠినమైన బయోసెక్యూరిటీ చట్టాలు ఉన్న విమానాశ్రయాల్లో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ ఎయిర్‌పోర్టు ఒకటి. కొన్నిరకాల ఆహార పదార్థాలు, వస్తువుల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుండడం, ప్రజలకు వివిధ రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉండడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటువంటి నిబంధనలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈవిధంగా ఆస్ట్రేలియా పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది.

అలాగే వాటివల్ల ప్రయాణికులకు వివిధ రకాల వ్యాధులు, తెగుళ్లు సులభంగా వ్యాపించే అవకాశం ఉండడంతో ఈ నిబంధన పెట్టారు. నవ్య మెల్‌బోర్న్ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం అక్కడి కస్టమ్స్ అధికారులు ఆమె బ్యాగ్‌లో మల్లెపూలును తీసుకువచ్చినందుకు జరిమానా విధించడంతో నటి లక్ష రూపాయలు చెల్లించింది.

ఇక.. నవ్య నాయర్ విషయానికి వస్తే ప్రముఖ మలయాళ నటిగా తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తన అందంతో, నటనతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె మలయాళంలోనే కాదు కన్నడ, తమిళ్ భాష చిత్రాలలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన నటనతో సినిమాలలో మెప్పించి, పలు అవార్డులు కూడా దక్కించుకుంది. ఎక్కువగా మమ్ముట్టి లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఈమె వివాహం తర్వాత సీరియల్స్ లో నటించడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఆమె సూపర్ షో అనే షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది.

ఇదెక్కడి విడ్డూరం అమ్మా మల్లెపూలు తీసుకెళ్తే జరిమానా వేస్తారా.. ? ఎక్కడ వినలేదు.. చూడలేదు అని నోర్లు వెళ్లబెట్టకండి. నిజమే కొన్ని దేశాల్లో అలాంటి రూల్స్ ఉన్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button