Raja Singh: బీజేపీ లోకి రాజాసింగ్ రీ ఎంట్రీ..?

Raja Singh: తెలంగాణ బీజేపీకి లవ్ లెటర్ ఇచ్చిన ఆ నేత.. మనసు మార్చుకున్నారా..? రాజీనామా తర్వాత ఆయనలో మార్పు వచ్చిందా..? కాషాయ పార్టీ వైపు మళ్ళీ మనసు లాగుతోందా..? పైకి విమర్శలు చేసినా లోలోన ప్రేమ దాగి ఉందా..? ఇంతకీ రాజాసింగ్ మనసు మనసులో లేదా..?
తెలంగాణ బీజేపీలో సంచలనం రేపిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇష్యూపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవలి పరిణామాలను పరిశీలిస్తే ఆయన తిరిగి బీజేపీలోకి చేరే అవకాశాలు ఉన్నాయన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. తెలంగాణ బీజేపీలో మారుతున్న పరిణామాలు చూస్తుంటే రాజాసింగ్ పైన ఆ పార్టీ నేతలకు అదే సమయంలో పార్టీ పైన రాజాసింగ్‌కు ప్రేమ చిగురిస్తుందా..! అన్న చర్చ నడుస్తోంది.
రాజాసింగ్ రాజీనామా తర్వాత బీజేపీ నేతల నుంచి వచ్చిన సానుకూల వ్యాఖ్యలు అలాగే పార్టీ నాయకత్వంపై రాజాసింగ్ గౌరవంతో కూడిన మాటలు మాట్లాడడం చూస్తుంటే అదే నిజమనిపిస్తోందట. రాజీనామా తర్వాత రాజాసింగ్‌లో పూర్తిగా మార్పు మొదలైందన్న చర్చ నడుస్తోందట. రాజీనామా విషయంలో తొందరపడ్డామా అని ఫీల్ అవుతున్నారట గోషామహల్ ఎమ్మెల్యే.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా చేసిన కామెంట్స్ ఆయన మనసు మార్చుకున్నారనడానికి అద్దం పడుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే బీజేపీకి రాజాసింగ్ రాజీనామా తర్వాత హిందుత్వ ఎజెండా కేంద్రంగా ఉండే పార్టీని రాజాసింగ్ ఎంచుకుంటారనే చర్చ జరిగింది. అందులోనూ మహారాష్ట్రకి చెందిన శివసేన పార్టీ తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్లు కూడా టాక్ వినిపించింది.
దీంతో రాజాసింగ్ శివసేనలో చేరుతారనే ప్రచారమూ జరిగింది. అయితే ఈ ఊహాగానాలకు రాజాసింగ్ చెక్ పెట్టారు. ఏ పార్టీలో చేరుతున్నారన్న ప్రశ్నకు రాజాసింగ్ స్పందించారు. తనను ఏ ఇతర పార్టీ భరించలేదన్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పార్టీలు అవసరం వచ్చినప్పుడు MIMతో దోస్తానా చేస్తాయని తను ఏ ఇతర పార్టీలో చేరబోనని కుండ బద్దలు కొట్టారు.
ఓవైపు రాజాసింగ్ వ్యాఖ్యలు ఇలా ఉంటే బీజేపీ నేతల వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. రాజాసింగ్ తన రాజీనామాను పునర్‌పరిశీలించుకోవాలని కొంత మంది బీజేపీ నేతలు సూచిస్తున్నారు. రాజాసింగ్ తమ నాయకుడని మనస్థాపంతో రాజీనామా చేశారని అంటున్నారు. ఆయన ఎప్పుడు మిస్డ్‌కాల్ ఇచ్చినా బీజేపీ సభ్యత్వం దక్కుతుందంటున్నారు. రాజాసింగ్‌ను పార్టీ వద్దని అనుకోలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు.
రాజాసింగ్ తిరిగి కమలం పార్టీలో చేరుతారనే అర్ధం వచ్చేలా మాట్లాడారు. బీజేపీ నేతల కామెంట్స్‌ను పరిశీలిస్తుంటే రాజాసింగ్ తిరిగి బీజేపీ గూటికి చేరడం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.
రాజాసింగ్ రాజీనామా సమయంలో రాష్ట్ర నేతలు ఏ ఒక్కరు కూడా ఆయన పైన వ్యక్తిగత విమర్శలు చేయలేదు. రాజాసింగ్ సైతం భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని, పార్టీ విధానాలపై ఎటువంటి ఆరోపణలు చేయలేదు. ఇదంతా గమనిస్తే ఆయన పార్టీ పట్ల సానుకూలతతో ఉన్నట్లు తెలుస్తోంది.
హిందూ ధర్మం కోసం పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ అని మోడీ, అమిత్ షా, యోగి లాంటి నేతల నాయకత్వంలో పని చేస్తానని రాజాసింగ్ స్పష్టం చేశారు. బీజేపీకి రాజీనామా చేయక ముందు రాజాసింగ్ చేసిన కామెంట్స్‌కి రాజీనామా తర్వాత రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు చాలా స్పష్టమైన తేడా కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రాజీనామా తర్వాత బీజేపీ జాతీయ నాయకత్వం తనతో చర్చలు జరుపుతుందని కూడా రాజాసింగ్ భావించారు. తెలంగాణలో బీజేపీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలు భవిష్యత్ కార్యాచరణ, రాష్ట్ర నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు వస్తున్నాయని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని రాజాసింగ్ అనుకున్నారట.
కానీ అధిష్టానం రాజాసింగ్‌కు ఆ అవకాశం ఇవ్వలేదు. రాజీనామాపై రెండో ఆలోచన చేయలేదు. కనీసం ఆయన అభిప్రాయం, వాదన వినిపించుకునే అవకాశం కూడా అధిష్టానం ఇవ్వలేదు. దీంతో రాజాసింగ్ కొంత వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
రాజీనామాకు ముందు సొంత పార్టీ నేతలపైనే పదునైన విమర్శలు చేశారు రాజాసింగ్. అయితే రాజీనామా తర్వాత రాజాసింగ్‌లో ఆ దూకుడు తగ్గిందన్న చర్చ పార్టీలో జరుగుతోంది. మరోవైపు ఇటీవల ఓ అంశంపై రాజాసింగ్ వీడియో సందేశం ఇవ్వగా ఆయన వెనుక బీజేపీ కమలం గుర్తు కనిపించింది.
తన రాజీనామా ఆమోదం తర్వాత కూడా కమలం గుర్తును తొలగించకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ జాతీయ నాయకత్వంపై విశ్వాసం వారి నాయకత్వంలో పని చేస్తానని రాజాసింగ్ చెప్పడంతో ఆయన బీజేపీకి దూరం కాలేదని స్పష్టం అవుతోంది.
మొత్తానికి బీజేపీలో రాజాసింగ్ ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. గతంలో రెండుసార్లు పార్టీ నుంచి సస్పెండైన రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేయడంతో తిరిగి పార్టీలోకి వచ్చారు. ఈసారి రాజీనామా తర్వాత కూడా రాజాసింగ్ కమలం పార్టీలోకి మళ్లీ వెళ్తారనే చర్చ జరుగుతోంది. మరి రాజాసింగ్ బీజేపీలోకి రీ ఎంట్రీ ఇస్తారా లేదా అనేది వేచి చూడాలి.