Ireland: ఐర్లాండ్‌లో భారతీయులపై జాత్యహంకార దాడులు

Ireland: యూరప్‌లో ఇటీవల జరిగిన సంఘటనలు విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు, హిందువుల భద్రతపై తీవ్రమైన ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఐర్లాండ్‌లో భారతీయ పౌరులపై ఇటీవల భౌతిక దాడులు జరగడం సంచలనం రేపింది. ఐర్లాండ్‌లోని భారతీయ పౌరుల భద్రత ప్రశ్నర్ధకంగా మారుతుంది. ఇలాంటి కేసులో రోజురోజుకి పెరిగిపోతున్నాయి. యూరప్ భారతీయులకు ఎంతవరకు సేఫ్ అనే ప్రశ్న ఎదురవుతోంది.
భారతీయులు ఏ దేశంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎంత ఒత్తిడిలోనైనా పనిచేయగలరు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో కంపెనీలు భారతీయులనే ఎక్కువగా ఉద్యోగాల్లో పెట్టుకుంటాయి. దీంతో ఆస్ట్రేలియా, అమెరికా, యూకే ఐర్లాండ్ వంటి దేశాల్లో భారతీయులు ఉన్నత స్థానాల్లో స్థిరపడుతున్నారు. అయితే ఇది స్థానికంగా ఉండే ఐర్లాండ్ వాసులకు నచ్చడం లేదు.. ఎక్కడి నుంచో వచ్చి .. తమ ఉద్యోగాలను వీరు కొట్టేస్తున్నారనే అసూయ పెరిగిపోతోంది.
భారతీయ విద్యార్థులు, కొత్తగా వచ్చిన ఉద్యోగులు నగరాల్లోని జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో కొంతమంది స్థానిక యువత, గ్యాంగ్‌లు వలసదారులను అన్యాయంగా తమ ఉద్యోగాలు, వనరులు భారతీయులు దోచుకుంటున్నారనే భావనతో దాడులకు పాల్పడుతున్నారు. అంతేకాక, సోషల్ మీడియా ద్వారా జాతి ద్వేషాన్ని ప్రేరేపించే దుష్ప్రచారం, రేసిస్ట్ వ్యాఖ్యలు కూడా ఇలాంటి దాడులను మరింత తీవ్రతరం చేస్తున్నాయి.
2020 నుంచి 2024 మధ్య యూరప్‌లో భారతీయులపై 41 దాడులు జరిగాయి. యూకేలో 12 జరగగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. జర్మనీలో 11, ఐర్లాండ్‌లో 6, ఇటలీలో 3 ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇవి ర్యాండమ్‌గా జరిగిన క్రైమ్స్ కాదు. చాలా వరకు జాతిపరంగా లేదా మతపరంగా అవమానిస్తూ జరిగిన జాత్యహంకార దాడులుగా కనిపిస్తున్నాయి. పైగా ఇలాంటి కేసుల సంఖ్య పెరుగుతోంది.
యూకేలో హిందువులపై ద్వేషపూరిత నేరాలు 58 నుంచి 166 కి పెరిగాయి. దాదాపు 200% పెరుగుదల కనిపిస్తోంది. యూకే, కెనడాలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు. లండన్ రెస్టారెంట్ ఘటన స్పష్టంగా హిందువులను రెచ్చగొట్టడానికి జరిగిందని తెలుస్తోంది.
ఈ రకమైన శత్రుత్వాన్ని హిందూఫోబియా అంటున్నారు. కానీ భారతీయులపై జరిగే దాడులన్నీ మతం ఆధారంగా జరగట్లేదు, చాలా జాతిపరమైనవి కూడా ఉన్నాయి. సిక్కులు, ముస్లింలు, ఇతర దక్షిణాసియన్లను కూడా ప్రభావితం చేస్తాయి.
భారతీయులు కేవలం విదేశీ సందర్శకులు మాత్రమే కాదు. వారు నివసించే దేశాలలో మేజర్ కాంట్రిబ్యూటర్స్‌గా నిలుస్తున్నారు. యూరప్ జనాభాలో ఇండియన్స్ 1 శాతం మందే ఉన్నారు, కానీ ట్యాక్స్‌లలో 4శాతం చెల్లిస్తారు. యూఎస్ జనాభాలో 1.5శాతం మంది భారతీయులు ఉన్నారు. అక్కడి ప్రభుత్వానికి కట్టే ట్యాక్సుల్లో వీరి వాటా 6 శాతంగా ఉంది.
ఆస్ట్రేలియా జనాభాలో ఇండియన్స్ 2.5శాతం ఉండగా, ట్యాక్స్‌లో 6శాతం కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. భారతీయులు టెక్, హెల్త్ కేర్, విద్య, వ్యాపార రంగంలో ఎక్కువగా పని చేస్తున్నారు. ఆయా దేశాలను నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
భారతీయులపై ద్వేషం పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. యూరప్, కెనడాలోని అనేక ప్రాంతాల్లో వలస వ్యతిరేక భావన పెరుగుతోంది సోషల్ మీడియా ఫేక్ న్యూస్, స్టీరియోటైప్‌లను వ్యాపింపజేస్తుంది. ఇది పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. అలానే దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు విదేశాల్లో ఉన్న భారతీయులను ప్రభావితం చేస్తాయి. జాబ్స్, హౌసింగ్‌పై ఫ్రస్టేషన్ కూడా వలసదారులపై వ్యతిరేకత కలిగిస్తుంది. డబ్లిన్ దాడిలో యంగ్ టీనేజర్లు కూడా పాల్గొన్నారు. అంటే ద్వేషం తర్వాతి జనరేషన్లకు కూడా వ్యాపిస్తోంది.
ఐర్లాండ్‌లో భారతీయులపై జాత్యహంకార దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా డబ్లిన్‌లోని తల్లాఘట్‌లో 40 ఏళ్ల భారతీయ పౌరుడిపై దుండగుల బృందం దాడి చేసింది. భారత సంతతి వ్యక్తిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. అతడి బట్టలు విప్పించి, అతడిపై దాడి చేశారు. పార్క్‌హిల్ రోడ్‌లో జరిగిన ఈ దాడిలో బాధితుడు ముఖం, చేతులు, కాళ్ళపై తీవ్ర గాయాలతో తల్లాఘట్ యూనివర్సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన జాతి వివక్షకు సంబంధించిన తీవ్ర చర్చను రేకెత్తించింది. ఐర్లాండ్ పోలీసులు ఈ ఘటనను జాత్యహంకార నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించాడని బాధితుడిపై తప్పుడు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల్లో నిజం లేదని పోలీసులు కూడా స్పష్టం చేశారు. ఈ దాడిపై దర్యాప్తు కొనసాగుతోంది.ఐర్లాండ్‌లోని భారత రాయబారి అఖిలేష్ మిశ్రా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, బాధితుడికి జరిగిన గాయాల తీవ్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. నేరస్థులను న్యాయస్థానం ముందు నిలబెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితుడికి మద్దతుగా నిలిచిన ఐరిష్ ప్రజలకు, పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఐర్లాండ్‌లో భారత పౌరులపై ఇటీవల భౌతిక దాడులు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో పౌరుల భద్రతకు సంబంధించి అక్కడి భారత రాయబార కార్యాలయం కీలక అడ్వైజరీ జారీ చేసింది. ప్రతికూల సమయాల్లో నిర్జన ప్రదేశాలకు వెళ్లొద్దని, భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.