PSR Anjaneyulu: మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులుకు రిమాండ్

PSR Anjaneyulu: ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులుకు రిమాండ్ పొడిగించారు. ఏపీపీఎస్సీ కేసులో ఆయనకు ఈ నెల 22 వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్టు విజయవాడ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. రిమాండ్ పొడిగించిన నేపథ్యంలో, పీఎస్ఆర్‌ను విజయవాడ జైలుకు తరలించనున్నారు.
సినీ నటి కాదంబరి జెత్వానీ వేధింపుల కేసులో ఇప్పటికే అరెస్టయిన ఆయనను, ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనంలో అక్రమాలకు సంబంధించిన మరో కేసులోనూ పోలీసులు పీటీ వారంట్ పై అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో సీఐడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.
పీఎస్ఆర్ ఆంజనేయులు 2018-2019 మధ్యకాలంలో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పనిచేసినప్పుడు గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో భారీ అవకతవకలు జరిగాయని, నిధులు దుర్వినియోగమయ్యాయని తీవ్ర ఆరోపణలున్నాయి. వాస్తవానికి మాన్యువల్ మూల్యాంకనం జరగనప్పటికీ, జరిగినట్లుగా రికార్డులు సృష్టించి కోట్ల రూపాయలు అక్రమంగా పొందారని సీఐడీ పోలీసులు చెబుతున్నారు. ఈ ఆరోపణలపై ఏప్రిల్ 29న ఆంజనేయులుపై ఐపీసీ సెక్షన్ 409,420 కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసులో ఆంజనేయులును అరెస్ట్ చేసేందుకు పోలీసులు పీటీ వారంట్ కోరగా, విజయవాడ మొదటి ఏజేసీజే కోర్టు మే 7న అనుమతించింది. పోలీసులు ఆయనను న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు. కోర్టు ఈనెల 22 వరకు రిమాండ్ విధించింది.