సినిమా

జపాన్ ఫ్యాన్స్‌కి ప్రభాస్ ప్రామిస్.. వీడియో వైరల్

ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల అయ్యి రికార్డ్‌ స్థాయి వసూళ్లు సొంతం చేసుకున్న కల్కి సినిమా ఇప్పుడు జపాన్‌లో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. 2025 జనవరి 3న ఈ సినిమాను జపాన్‌లో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. గతంలో బాహుబలి సినిమాతో ప్రభాస్ జపాన్‌లో సూపర్‌ హిట్‌ దక్కించుకున్నారు. ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా సైతం జపాన్‌లో విడుదల అయ్యి గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే కల్కి సినిమా విషయంలో ఆసక్తి నెలకొంది.

జపాన్‌లో ఇండియన్‌ సినిమాలకు ముఖ్యంగా తెలుగు సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో కల్కి 2898 ఏడీకి ఎలాంటి స్పందన దక్కుతుంది అనేది అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. సినిమా జపాన్‌లో విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ అక్కడికి వెళ్లి ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొనాలని కొన్ని నెలల ముందే నిర్ణయించారు. అందులో భాగంగానే ఇటీవల దర్శకుడు నాగ్‌ అశ్విన్‌తో పాటు ఇతర యూనిట్‌ జపాన్‌ వెళ్లింది. ప్రభాస్‌ సైతం వెళ్లాల్సి ఉన్నా కాలికి గాయం కారణంగా వెళ్లలేక పోయారు. ఆ విషయాన్ని ఇటీవల సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు. కల్కి ప్రమోషన్స్‌కి హాజరు కాలేక పోతున్నాను క్షమించాలని పోస్ట్‌ చేసిన ప్రభాస్‌ ఇప్పుడు ఓ వీడియోని కూడా విడుదల చేశారు.

సినిమాకి జపాన్‌లో విడుదలకు ముందే వస్తున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభాస్‌ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో ప్రభాస్‌ కొన్ని జపనీస్‌ పదాలను వాడారు. జపనీస్ భాషలో అక్కడి వారికి నమస్కారం చేయడంతో పాటు సినిమా గురించి రెండు ముక్కలు జపనీస్‌ భాషలో ప్రభాస్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. తాను చాలా కాలంగా జపాన్‌ రావాలి అనుకుంటున్నాను. కానీ ఏదో కారణం వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఈసారి గాయం కారణంగా రాలేక పోతున్నాను. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. త్వరలోనే మీ అందరిని కలుస్తాను. జపాన్‌లో ఉన్న తన ఫ్యాన్స్‌ అంతా కల్కి 2898 ఏడీ సినిమాను ఆదరించాలి అంటూ ప్రభాస్ ఇందులో కోరారు.

విభిన్నమైన కాన్సెప్ట్‌తో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ రూపొందించిన కల్కి 2898 ఏడీ సినిమా జపనీస్‌ ప్రేక్షకులకి కూడా నచ్చుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఫ్యూచర్‌కి మహాభారతాన్ని లింక్‌ చేసి అశ్వత్థామ పాత్రలో అమితాబ్‌ బచ్చన్‌ను చూపించడం ద్వారా ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేశారు నాగ్ అశ్విన్. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా కల్కి 2 ను రూపొందించే పనిలో ఉన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button