తెలంగాణ

తెలంగాణలో రసవత్తర రాజకీయం.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య సవాళ్ల పర్వం

తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. వానాకాలంలో మాటల మంటల సెగలు పుట్టిస్తూ కార్చిచ్చు రాజేస్తున్నాయి. వేదికలు ఏవైనా సరే మాటల మంట రేగుతోంది. తెలంగాణ రైతులకేం చేశామో తేల్చుకుందామా అంటూ సీఎం రేవంత్ సవాల్ విసిరితే, గులాబీ దండు ప్రెస్ క్లబ్ సాక్షిగా సర్కారుకు రీసౌండ్‌తో వెల్కమ్ పలికింది. అసెంబ్లీలో చర్చిస్తామంటే క్లబ్బుల మాటేందుకంటూ కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు.

ఐతే తాజాగా ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు జరిగిన నష్టం గురించి చర్చించేందుకు సిద్ధమా అంటూ మాజీ సీఎం కేసీఆర్‌కు, సీఎం రేవమంత్ రెడ్డి సవాల్ విసిరారు. ప్రగతి భవన్‌లో సర్కార్ స్టైల్లో ప్రజెంటేషన్‌తో కాక రేగింది. హస్తం వల్లే రాష్ట్రానికి కష్టాలని బీఆర్ఎస్ గాండ్రిస్తుంటే.. ద్రోహం చేసింది కేసీఆర్‌ అంటూ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

తెలంగాణకు ద్రోహం చేసింది ముమ్మాటికీ కేసీఆర్ అంటూ రేవంత్ ఫైరైతే, కాదు కాదు కాంగ్రెస్సే ద్రోహం చేసిందంటోంది గులాబీ పార్టీ. ఉమ్మడి పాలనకు మించి కేసీఆర్ పాలనలో అన్యాయం జరిగిందని రేవంత్ రెడ్డి మండిపడితే, 50 ఏళ్ల పాలనలో సాగునీటి రంగాన్ని కాంగ్రెస్ నిర్వీర్యం చేసిందని బీఆర్ఎస్ ఆక్షేపించింది.

రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ పచ్చి అబ్ధాలంటూ నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు. పదవి కోసం పెదవులు మూసుకొని ఆంధ్రాకు దాసోహమయ్యారన్నారాయన. తప్పుడు లెక్కలు, అబద్ధపు మాటలతో మభ్యపెడుతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. దయ్యాలు వేదాలు వల్లించినట్టు సుద్దపూస మాటలు చెప్తున్నారని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ చేతగానితనం వల్లే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు మూలనపడిందన్నారు.

ఇక కేసీఆర్ ఓకే అంటే ఫామ్ హౌస్‌లో మాక్ అసెంబ్లీ పెడతానంటూ సవాల్ విసిరారు రేవంత్. కృష్ణా, గోదావరి నదీజలాలపై చర్చకు సిద్ధమన్నారు. కేసీఆర్ రమ్మంటే తాను చర్చకు రెడీ అన్నారు. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ నేతలు హోరాహోరీ నువ్వెంతంటే నువ్వెంతంటూ రెచ్చిపోతుంటే తెలంగాణ సాగుజలాల వ్యవహారం అగ్నిగుండంలా మండిపోతోంది.

అగ్ని జలం లావాలా పెల్లుబీకి ఎవరిపై పడుతుందోనన్న ఉత్కంఠ రేగుతోంది. ఎన్నికల్లో ఇష్టానుసారంగా హామీలిచ్చి, గెలిచి, ఇప్పుడు హామీల ఊసెత్తడం లేదంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై విరుచుకుపడుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయమంటే బడాయి మాటలు ఎందుకంటూ కారు పార్టీ ప్రశ్నిస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button