అంతర్జాతీయం

అమెరికా- భారత్‌ల మధ్య పీటర్ నవారో చిచ్చు

Peter Navarro: భారత్- రష్యా మధ్య స్నేహాన్ని నాశనం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు తీవ్ర ప్రయత్నాలు చేశారు. బెదిరించాడు, సుంకాలు, ఆంక్షలతో దాడి చేశారు. ఇతర దేశాలనూ ఇండియాపైకి ఉసిగొల్పే ప్రయత్నం చేశారు. అయినా… భారత్ భయపడ లేదు. రష్యాతో స్నేహం వదులుకోలేదు. అమెరికా అంచనాలను తలకిందులు చేస్తూ చైనాతోనూ దోస్తీకి సిద్ధపడింది. స్వయంగా మోడీ రంగంలోకి దిగి డ్రాగన్ దేశం లో అడుగు పెట్టారు. దీంతో… డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడైన పీటర్ నవారోను రంగంలోకి దింపింది అమెరికా.

అతను ట్రేడ్ అడ్వైజర్‌గా మొన్నటివరకూ అమెరికన్లకు మాత్రమే పరిచయం ఉన్న వ్యక్తి. కానీ.. భారత్‌పై నోటికొచ్చిన విమర్శలు చేస్తూ.. అంతర్జాతీయ మీడియా హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంపై చేసిన విమర్శల్ని సొంత పౌరులే ఛీ కొడుతున్నా వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు తాజాగా మరోసారి మోదీపై నోరు పారేసుకున్నారు. ఇంతకీ పీటన్ నవారో చేసిన వ్యాఖ్యలేంటి..? ఆ వ్యాఖ్యలు వెనుకున్న అసలు ఉద్దేశ్యం ఏంటి..?

తియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో ప్రధాని మోదీ తీవ్ర అసౌకర్యంగా ఉన్నారని అమెరికా చెబుతోంది. ఈ మేరకు శ్వేతసౌధం వాణిజ్య సలహాదారు పీటర్‌ నవారో సరికొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఎస్‌సీవో సదస్సులో చైనా అధినేత జిన్‌పింగ్‌ పక్కనే నిలబడేందుకు ప్రధాని మోదీ తీవ్ర అసౌకర్యంగా కనిపించారంటూ సరికొత్త వాదనను తెర పైకి తీసుకొచ్చారు.

రష్యా నుంచి భారత్‌ చమురు దిగుమతి చేసుకోవడం సమస్యాత్మకమని పీటర్ నవారో అన్నారు. మీరు అర్థం చేసుకొన్నారా..? 2022కు ముందు కొనుగోళ్లు లేవు. యుద్ధం మొదలైన వెంటనే భారత రిఫైనరీలు రష్యా చమురుశుద్ధి సంస్థలతో అంటకాగటం మొదలుపెట్టాయి. వారు బందిపోట్లు వలే చేస్తున్నారు. అనైతిక వ్యాపారంలో వారు డబ్బు సంపాదిస్తున్నారని పీటర్ నవారో అన్నారు.

అలాగే భారత్‌ ఇప్పటికే చర్చలకు వచ్చిందని నవారో వెల్లడించారు. ప్రధాని మోదీ నిర్మాణాత్మకమైన ఓ ట్వీట్‌ చేశారు. దీనికి అధ్యక్షుడు ట్రంప్‌ కూడా స్పందించారు. వాణిజ్య అడ్డంకులపై ఇరుదేశాలు పనిచేస్తున్నాయని చెప్పారు. భారత్‌లో టారిఫ్‌లు, టారీఫేతర అడ్డంకులు అత్యధికంగా ఉన్నాయని చెప్పారు. భారత్‌ డబ్బులతో చమురుకొంటే రష్యా ఆ సొమ్ముతో ఆయుధాలు కొంటుందని తెలిపారు. తమ దేశంలోని పన్ను చెల్లింపుదారులు ఉక్రెయిన్‌ రక్షణకు భారీగా చెల్లిస్తున్నారని చెప్పారు. ఎస్‌సీవోలో జిన్‌పింగ్‌తో మోదీ సౌకర్యవంతంగా ఉన్నట్లు అనిపించలేదని నవారో తెలిపారు.

అంతేకాదు భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కీలక చర్చలు జరగనున్న తరుణంలో పీటర్ నవారో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ చర్చల కోసం ముందుకు వస్తోందని పేర్కొంటూనే, అధిక సుంకాలు, రష్యా నుంచి చమురు కొనుగోలు వంటి విషయాలపై ఆయన విమర్శలు గుప్పించారు. భారత్ చర్చల కోసం వస్తోంది. ప్రధాని మోదీ చాలా సానుకూలంగా ట్వీట్ చేశారు. దానికి అధ్యక్షుడు ట్రంప్ కూడా స్పందించారు. ఈ చర్చలు ఎలా సాగుతాయో చూద్దాం అని నవారో అన్నారు.

అయితే ప్రపంచంలోని ప్రధాన దేశాల్లోకెల్లా భారత్‌లోనే అత్యధిక సుంకాలు ఉన్నాయని ఆయన పునరుద్ఘాటించారు. గతంలో ఆయన భారత్‌ను టారిఫ్‌ల మహారాజు అని అభివర్ణించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని కూడా నవారో తీవ్రంగా తప్పుబట్టారు. అన్యాయమైన వాణిజ్యం ద్వారా భారత్ మాతో డబ్బు సంపాదించి, ఆ డబ్బుతో రష్యా చమురు కొంటోందని అన్నారు. రష్యా ఆ డబ్బుతో ఆయుధాలు కొని ఉక్రెయిన్‌పై దాడి చేస్తోందని విమర్శించారు. ఉక్రెయిన్ రక్షణ కోసం మేం పన్నుచెల్లింపుదారుల డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోందని ఆయన విమర్శించారు.

అయితే, నవారో వ్యాఖ్యలకు భిన్నంగా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ మధ్య సానుకూల వాతావరణం నెలకొంది. వాణిజ్య అడ్డంకులపై చర్చలు కొనసాగుతున్నాయని, త్వరలోనే ప్రధాని మోదీతో మాట్లాడతానని ట్రంప్ ఇటీవల తెలిపారు. దీనికి ప్రధాని మోదీ స్పందిస్తూ, ఇరు దేశాల మధ్య చర్చలు విజయవంతమవుతాయన్న విశ్వాసం తనకుందని, ట్రంప్‌తో మాట్లాడటానికి తాను కూడా ఎదురుచూస్తున్నానని తెలిపారు. ఈ తరుణంలోనే అమెరికా అధ్యక్షుడు ఈ ఏడాది చివర్లో భారత్ లో పర్యటించే అవకాశం కూడా లేకపోలేదు.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారోపై ఆ దేశ మాజీ ఉన్నతాధికారి సంచలన ఆరోపణలు చేశారు. ట్రంప్, మోదీల మధ్య చిచ్చు పెట్టేందుకు ఆయన ప్రయత్నించారని చెప్పారు. ఇరువురు నేతల మధ్య సయోధ్యను సహించలేని మనస్తత్వమని విమర్శించారు. ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన జాన్ బోల్టన్ ఈ వ్యాఖ్యలు చేశారు. పీటర్ నవారో వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఓ గదిలో ఆయనను గంటపాటు ఒంటరిగా వదిలేస్తే బయటకు వచ్చాక తనతో తనే గొడవపడే వ్యక్తి అంటూ బోల్టన్ విమర్శించారు.

భారత ప్రధాని మోదీ, ట్రంప్ ల మధ్య జరిగిన ఓ సమావేశంలో పీటర్ నవారో కూడా పాల్గొన్నారని, చైనాతో ఎదురయ్యే సవాళ్లపై చర్చ జరిగిందని బోల్టన్ చెప్పారు. ఆ సమయంలో నవారో హఠాత్తుగా టారిఫ్ ల ప్రస్తావన తీసుకొచ్చి ట్రంప్, మోదీల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేశాడని ఆరోపించారు. భారత్ తమపై అధిక సుంకాలు విధిస్తోందని ఆ మీటింగ్ లో ప్రస్తావించారని చెప్పారు. అయితే, ఇరువురు నేతలు సంయమనం పాటించడంతో గొడవ జరగలేదని బోల్టన్ వివరించారు.

పీటర్‌ నవారో. గతంలో ట్రంప్‌ కోసం నాలుగు నెలల జైలులో గడిపి, శ్వేతసౌధంలో అడుగుపెట్టిన ఆయన, ట్రంప్‌ వాణిజ్యయుద్ధానికి వెనుక వ్యూహకర్త అనే ప్రచారం ఏర్పడింది. ట్రంప్‌ రెండోసారి పగ్గాలు చేపట్టాక, 75 ఏళ్ల ఆర్థిక నిపుణుడు పీటర్‌ నవారోని తన వాణిజ్య సలహాదారుగా శ్వేతసౌధంలో తీసుకువచ్చారు. అతడి నేపథ్యం తెలిసిన చాలామంది అతడి నియామకాన్ని చూసి ఆశ్చర్యపోయారు.

1970ల్లో నవారో జాతీయవాది కాదు. అతడు ఓ డెమోక్రటిక్ సానుభూతిపరుడు. వియత్నాం యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ, పర్యావరణ పరిరక్షణను కోరుతూ కాలిఫోర్నియాలో ఉద్యమించారు. ఆయన హార్వర్డు విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు. ఇక శాన్‌డియా మేయర్‌, కాంగ్రెస్‌ ఇలా పలు పదవులకు పోటీ చేసి ఓడిపోయారు. యూజీఐలో ఎకనామిక్స్‌, పబ్లిక్‌ పాలసీలో ప్రొఫెసర్‌గా చేశారు. 1990ల్లో ఆయన తన వైఖరి మెల్లగా సంప్రదాయ జాతీయవాదం వైపు మళ్లింది. స్వేచ్ఛా వాణిజ్యాన్ని వ్యతిరేకించడం, అమెరికాలో రక్షణాత్మక వాణిజ్య విధానాలు వంటి అంశాల్ని సమర్థించేవారు.

2011లో డెత్‌ బై చైనా అనే పుస్తకం రాశారు. దానినే డాక్యుమెంటరీగా చిత్రీకరించారు. 2016లో ట్రంప్‌నకు అల్లుడు జరేడ్‌ కుష్నెర్‌ ద్వారా పరిచయం అయ్యాడు. తొలి కార్యవర్గంలో కూడా వైట్‌హౌస్‌ నేషనల్‌ ట్రేడ్‌ కౌన్సిల్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. అప్పట్లో చైనాపై వాణిజ్యయుద్ధం, కొవిడ్‌ సమయంలో పాలసీ, 2020 ఎన్నికల ఫలితాల తర్వాత క్యాపిటల్‌ హిల్స్‌ ఘటనలో నవారో ప్రమేయం ఉందంటారు. 2020 అల్లర్ల విషయంలో 2023లో ఆయన్ను అమెరికా కాంగ్రెస్‌ విచారణకు పిలిస్తే వెళ్లకపోవడంతో నాలుగు నెలల పాటు జైల్లో వేశారు. దీంతో ఆయనకు ట్రంప్‌ వీరభక్తుడిగా ముద్ర పడింది.

కాగా అమెరికా, భారత్ ల మధ్య టారిఫ్ ల గొడవ నేపథ్యంలో ఇటీవల పీటర్ నవారో వ్యాఖ్యలు ఉద్రిక్తతలను పెంచేలా ఉంటున్నాయి. భారత్ ను టారిఫ్ మహారాజా అని, రష్యా చమురు కొంటూ ‘బ్లడ్ మనీ’ సంపాదిస్తోందని ఆరోపించాడు. మరోవైపు చర్యల కోసం ట్రంప్ ప్రతినిధి భారత్‌కు వచ్చారు. దీని బట్టి చూస్తే నవారోకి ట్రంప్ పడడం లేదని ట్రంప్‌కు మోదీకి మధ్య చిచ్చుపెట్టేందుకు నవారో ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button