అంతర్జాతీయం

Donald Trump: టారీఫ్‌లు వ్యతిరేకించేవారు మూర్ఖులు

Donald Trump: టారిఫ్‌లను వ్యతిరేకించే వారు మూర్ఖులన్నాడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. సుంకాల చట్టబద్ధతను సుప్రీంకోర్టు ప్రశ్నించడంపై ట్రంప్‌ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. వాణిజ్య యుద్ధాలు, ధరల పెరుగుదల, అంతర్గత అసంతృప్తి మధ్య సుంకాల విధానమే అమెరికాకు శ్రీరామరక్ష అంటూ తన వాదనను మరోసారి బలంగా విన్పించాడు.

సుంకాల నిర్ణయాలు అమెరికాను గతంలో ఎన్నడూ లేనంతగా అత్యంత ధనిక దేశంగా మార్చుతాయని చెబుతున్నాడు. ఆర్థిక మాంద్యం ముప్పు, పెరుగుతున్న అప్పు భారం, కోర్టు విచారణలను ఆయన లైట్ తీసుకుంటున్నాడు. సుంకాలు తన ఆయుధమంటున్న ట్రంప్ వాటితోనే అమెరికా మళ్లీ గొప్పదవుతుందన్న ధోరణి ప్రదర్శిస్తున్నాడు. సుప్రీంకోర్టు ప్రశ్నించడాన్ని ట్రంప్‌ లైట్ తీసుకుంటున్నాడు.

టారిఫ్‌ పాలసీని సమర్థిస్తూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల తీసుకున్న సుంకాల నిర్ణయాల ఆధారంగా ఖజానాకు వస్తున్న ఆదాయం నుండి ఒక్కో అమెరికన్‌కు 2 వేల డాలర్ల చొప్పున డివిడెండ్‌ చెల్లిస్తామని తాజాగా ట్రంప్ ప్రకటించాడు. 1977లో రూపొందించిన జాతీయ అత్యవసర చట్టం ఆధారంగా ఇతర దేశాలపై అధ్యక్షుడికి సుంకాలు విధించే అధికారం ఉందా లేదా అన్న అంశంపై అమెరికా సుప్రీంకోర్టు ప్రస్తుతం విచారణ చేపట్టింది.

ఈ చట్టం కింద ట్రంప్‌ చైనాతో సహా పలు దేశాలపై భారీ సుంకాలు విధించాడు. అయితే, ఈ చర్యపై 12 రాష్ట్రాలు, ముఖ్యంగా డెమొక్రటిక్‌ నేతృత్వంలోని రాష్ట్రాలు, పలు వ్యాపార సంస్థలు సవాలు చేశాయి. దిగువ కోర్టులు ఇప్పటికే ట్రంప్‌ చర్యలను అధికార దుర్వినియోగమని అభివర్ణించగా, ఇప్పుడు ఆ కేసు అత్యున్నత న్యాయస్థానంలో విచారణకు వచ్చింది.

సంప్రదాయవాద, ఉదారవాద న్యాయమూర్తులు ఇద్దరు కూడా ట్రంప్‌ సర్కారు తీరును తీవ్రంగా ఆక్షేపించారు. జాతీయ భద్రత పేరుతో అధ్యక్షుడు సుదీర్ఘ కాలం సుంకాలు విధించడం సరైనదేనా అంటూ ప్రభుత్వ న్యాయవాదిని ఇద్దరు జడ్జీలు ప్రశ్నించారు. కార్యనిర్వాహక శాఖ అధికారం ఎంత వరకు విస్తరించవచ్చనే దానిపై సవాలు విసిరారు.

ఓవైపు కోర్టు జోక్యం, జడ్జీల వ్యాఖ్యల తర్వాత ట్రూత్ సోషల్ వేదికలో ట్రంప్ దూకుడు ప్రదర్శించాడు. ప్రపంచంలోనే అమెరికా అత్యంత ధనిక, గౌరవనీయమైన దేశంగా మారిందని, ద్రవ్యోల్బణం దాదాపుగా లేదని, స్టాక్‌ మార్కెట్‌‌లు రికార్డుల్లో దూసుకుపోతున్నాయని, ట్రిలియన్ల డాలర్ల దిశగా దూసుకుపోతున్నామని త్వరలోనే $37 ట్రిలియన్‌ అప్పు చెల్లింపును ప్రారంభిస్తామని ట్రంప్ చెప్పాడు.

అదే సమయంలో ప్రభుత్వ ఖజానాకు వచ్చి పడుతున్న పైసలను, తిరిగి ప్రజలకే వినియోగిస్తానన్నాడు. ప్రతి అమెరికన్‌కు కనీసం 2 వేల డాలర్లు డివిడెండ్‌ చెల్లిస్తానన్నాడు. ధనవంతులు తప్ప దేశంలోని అందరికీ ఇది అందుతుందన్నాడు. సుంకాల వల్లే అమెరికాలో పెట్టుబడులు, పరిశ్రమలు విపరీతంగా పెరిగాయన్నాడు. ఈ ఆదాయం ప్రజలకే చెందుతుందని హామీ ఇచ్చాడు. తాను విధించిన సుంకాలు చట్టబద్ధమైనవేనన్న ఆయన, తనకు కాంగ్రెస్‌ మద్దతు కూడా ఉందన్నాడు.

విదేశాలతో వ్యాపారాన్ని నిలిపివేసే హక్కు అమెరికా అధ్యక్షుడి ఉందన్నాడు ట్రంప్. పలు దేశాలకు అమెరికా లైసెన్స్ ఇవ్వడం ద్వారా ఖజానాకు ఇంకా ఇంకా ఆదాయం వచ్చిపడుతుందన్నాడు. జాతీయ భద్రతను బూచిగా చూపించి, విదేశాలపై సుంకాలు వేయొద్దని జడ్జీలు ఎలా చెప్తారంటూ మండిపడ్డాడు.

ఇది హాస్యాస్పదమైన చర్య అన్నాడు. ఇతర దేశాలు అమెరికాపై సుంకాలు విధించొచ్చు కానీ మనం వాటిపై వేయలేమా? కొందరు అమెరికన్లు భ్రమపడుతున్నారని ట్రంప్ విమర్శించాడు. సుంకాలతో అమెరికా ఖజానాకు రాబోయే దశాబ్దంలో ట్రిలియన్ల డాలర్లు రావొచ్చని అంచనా వేస్తున్నారు.

అయితే అదే సమయంలో వస్తువుల ధరలు పెరగడం వల్ల వినియోగదారులపై భారం మోపుతుందన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ట్రంప్‌ అధికారాలకు మాత్రమే కాకుండా, భవిష్యత్తు అధ్యక్షుల శక్తి పరిధిని నిర్ణయించే మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయినా ట్రంప్‌ మాత్రం తన సాంప్రదాయ శైలిలోనే తనకు వ్యతిరేకంగా ఉన్నవారు మూర్ఖులని, తన విధానాలతో అమెరికా మళ్లీ గొప్ప దేశమవుతుందని నమ్మాలంటున్నాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button