Puvvada Ajay: బీఆర్ఎస్ హయాంలో పువ్వాడ అజయ్ హవా

Puvvada Ajay: బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఓ వెలుగు వెలిగిన ఆ నేత గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చవి చూశారు. సాధారణ ఎన్నికలు జరిగి 18 నెలలు గడుస్తున్నా ఆ మాజీ మంత్రి ఓటమికి సంబంధించి కారణాలను నేటికీ అన్వేషించలేకపోతున్నారట. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో చక్రం తిప్పిన ద్వితీయ శ్రేణి షాడో నేతలే ఆయన ఓటమికి ప్రధాన కారణమనే మాటలు నియోజవర్గంలో బలంగా వినపడుతున్నాయట.
కానీ ఆ మాజీ మంత్రి ఓటమికి కారణమైన సదురు నేతలపై దృష్టి సారించడం లేదట. ఫలితంగా ఆ నాయకులు ఇంకా పవర్‌లో ఉన్నామనే భ్రమలోనే ఉన్నారట. ఆ మాజీ మంత్రి ఓటమికి కారణమైన వారిని ఇంకా అంటి పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఏంటి…? వారిని ఎందుకు దూరం పెట్టాలేకపోతున్నారనే ప్రశ్నలు ఆ పార్టీ నేతలు నుంచే వస్తున్నాయట..! ఇంతకు ఆ నియోజకవర్గం ఏది..? ఆ మాజీ మంత్రి ఎవరు..? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పదేళ్లపాటు అధికారంలో ఉండగా.. ఖమ్మం జిల్లాలో పువ్వాడ అజయ్ కుమార్ తన హవా కొనసాగించారు. ఆ సమయంలో ఆయన ఐదేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. అయితే గత ఎన్నికల్లో ఆయన ఘోర ఓటమిని చవిచూశారు. ఖమ్మం నియోజకవర్గం నుండి 2014లో కాంగ్రెస్ తరుపున గెలిచిన పువ్వాడ బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
2018 జరిగిన ఎన్నికల్లో గెలిచారు. మూడోసారి 2023 సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టేందుకు శత విధాలా ప్రయత్నం చేశారు. కానీ ఖమ్మం నియోజకవర్గ ప్రజలు విలక్షణమైన తీర్పుతో సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావును అఖండ మెజారిటీతో గెలిపించారు.
దీంతో బీఆర్ఎస్ పార్టీ.. ఈ నియోజకవర్గంలో ఖాతా తెరవలేకపోయింది. మాజీ మంత్రి పువ్వాడకు.. గత ఎన్నికల్లో తాను చేసిన అభివృద్దే గెలుపునకు కృషి చేస్తుందని భావించారు. కానీ తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు చేతిలో 50 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఎన్నికల ముందు ఖమ్మంలో పువ్వాడకు పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారన్న పేరుంది.
ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నిధులు తెచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు నగరంలో చేపట్టారని బీఆర్ఎస్ నేతలు గొప్పగా చెప్పుకునే వారు. మరోవైపు సోషల్ మీడియాను వాడాల్సిన దానికన్నా పది రెట్లు ఎక్కువగానే ఉపయోగించారనే ప్రచారమూ ఉంది.
అన్ని అవకాశాలను అందిపుచ్చుకున్న పువ్వాడ అజయ్ కుమార్.. ఆ ఎన్నికల్లో ఎందుకు ఓటమి చెందారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కానీ దానికి అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలన్న ఆలోచన పువ్వాడ ప్రధాన అనుచరులు చేశారట. అందులో భాగంగానే ఎప్పుడూ ఆయన వెన్నంటూ ఉండే షాడో నేతలే.. అందినకాడికి దోచుకున్నారన్న ఆరోపణలు ఖమ్మం నియోజకవర్గంలో బలంగా ఉన్నాయట. మాజీ మంత్రి పువ్వాడ 2014 ఎన్నికల్లో ఈ షాడో నేతల ప్రోత్సాహం, ప్రమేయం లేకుండానే విజయం సాధించారు.
ఆ తర్వాత రెండోసారి 2018 ఎన్నికల్లో కూడా తన విజయం సునాయాసంగా సాధించారు. అయితే ఈ షాడో నేతలు ఎప్పుడైతే తనకు దగ్గరయ్యారో ఆనాటి నుంచి పువ్వాడకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందనే ప్రచారం ఉంది. పువ్వాడ మంత్రిగా కొనసాగుతున్న సమయంలో ఈ షాడో నేతలు ఖమ్మం నగరంలో భూ సెటిల్మెంట్లు, భూ ఆక్రమణలు, పోలీస్ స్టేషన్ సాక్షిగా పంచాయితీలు, బెదిరింపులు చేసి ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయాన్ని కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల ఎన్నికల ప్రచారంలో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి సక్సెస్ అయ్యారనే టాక్ ఉంది.
మాజీ మంత్రి పువ్వాడకు ఓటమికి కొందరు కార్పోరేటర్లు, నాయకుల తప్పిదాలే కారణమనే టాక్ వినిపిస్తోంది. అయితే.. ఈ విషయాన్ని నిఖార్సుగ ఉన్న గులాబీ పార్టీ నేతలెవరు కూడ సాహసించి పువ్వాడ దృష్టికి తీసుకెళ్లలేదట. ఇదంతా పువ్వాడ ఓటమికి పెద్ద మైనస్‌గా మారిందట. వారిని దూరం పెట్టకుండానే ఆయన చేసిన అభివృద్ధి మంత్రంతోనే ప్రజల వద్దకి వెళ్లి బోల్తా పడ్డారనే టాక్ జోరుగా సాగుతోంది.
ఖమ్మం నియోజకవర్గంలో ఓటమి అనంతరం కొంతమంది చేసిన తప్పుల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని గ్రహించారని మొదట్లో అనుకున్నా కానీ ఆయన ఓటమికి కారణమైన నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంకా అలాంటి నేతలను అంటిపెట్టుకుని ఉంటే భవిష్యత్ లో భారీగా నష్టపోయే పరిస్థితి లేకపోలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మాజీ మంత్రి పువ్వాడ ఓటమి తర్వాత కొన్ని నెలల పాటు జిల్లాలో సైలెంట్ అయ్యారు. అప్పుడు నేతలంతా కూడా అదే బాటలో ఉన్నారు. కానీ ప్రస్తుతం పువ్వాడ మళ్లీ యాక్టివ్ అయ్యేలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. జిల్లాలో అడపాదడపా నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ అందరినీ కలుస్తున్నారు. ఈ క్రమంలో పువ్వాడ వెంట మళ్లీ ఆ నేతలే కనిపిస్తున్నారు.
ఓటమికి కారణమైన వారిని మళ్లీ తన పక్కన చేర్చుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. పాత టీమ్‌ను పువ్వాడ ఎందుకు దూరం పెట్టడం లేదని ఆయనకు దగ్గర ఉన్నవారు అనుకుంటున్నారట. పార్టీ కోసం పనిచేసిన వారిని పలకరించకుండా.. షాడో నేతలనే పక్కన పెట్టుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయట.
ఓటమికి కారణాలపై ఇకనైనా మాజీ మంత్రి పువ్వాడ పూర్తిస్థాయిలో అన్వేషణ చేసి ఓటమికి కారణమైన వ్యక్తులను దూరం పెడితే.. కాస్తో కూస్తో ఖమ్మం నియోజకవర్గంలో గులాబీ పార్టీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయని బీఆర్ఎస్‌లోని ఓ వర్గం చెప్తోంది. మరో వర్గం మాత్రం మొదటి నుండి గులాబీ పార్టీకి అంతంత మాత్రమే జిల్లాలో ఉనికి ఉంది. ఇలాంటి సమయంలో వారిని కూడా కాదనుకుంటే తన పక్కన క్యాడరే లేకుండా పోతుందని పువ్వాడ భావిస్తున్నట్లు చెప్తున్నారు.
అందుకే వారిని దూరం పెట్టలేకపోతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయట. అభివృద్ధి మంత్రమే కాదు.. చుట్టూ ఉన్న వారు సైతం నిబద్ధతగా లేకుంటే ఎంతపెద్ద లీడర్‌కైనా ఓటమి తప్పదనే మేసేజ్‌ను ఇప్పటికే ఖమ్మం నియోజకవర్గం ప్రజలు పువ్వాడకు ఇచ్చారు. ఇప్పటికైనా అలాంటి నేతల పట్ల మాజీ మంత్రి పువ్వాడ అప్రమత్తంగా ఉండాలని లేదంటే మరోసారి అదే సీన్ రిపీట్ అవుతుందనే ప్రచారమూ ఖమ్మం నియోజకవర్గంలో జరుగుతోంది.
మొత్తానికి షాడో లీడర్ల వల్లే పువ్వాడ ఓడిపోయారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా తనకోసం పనిచేసే వారు ఎవరు..? ఓటమికి కారణమైన వారు ఎవరనేది పువ్వాడ గ్రహించుకోవాల్సిన అవసరం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరి తన ఓటమికి కారకులైన నాయకుల పట్ల ఇకపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎలా వ్యవహరిస్తారో చూడాలి.