Balineni: బాలినేనిపై ప్రశంసలు వర్షం కురిపించిన పవన్

Balineni: ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బహుశా ఆ నేత పేరు తెలియని వారుండకపోవచ్చు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించడంతో పాటు ప్రకాశంజిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో నడిపించిన నేతగా ఆ నాయకుడికి పేరుంది. అటు కాంగ్రెస్ లోనూ, ఇటు వైసీపీలోనూ జిల్లాలో పెద్ద దిక్కుగా వ్యవహరించేవారు. అయితే జనసేనలో చేరిన తర్వాత ఆయన పరిస్థితి దయనీయంగా మారింది. తాను ఏదైతా కోరుకుని జనసేన పంచన చేరారో, అది అందని ద్రాక్షలా మారిపోయింది. దీంతో ఇన్నేళ్లు జిల్లా రాజకీయాల్లో, తలలో నాలుకలా ఉన్న మాజీ మంత్రి బాలినేని నేడు గడ్డు కాలాన్ని ఎదుర్కోవాల్సిన దుస్ధితి దాపురించింది.
బాలినేని శ్రీనివాసులు రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచే ప్రకాశం జిల్లాను తన చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. 1999లో తొలిసారి ఒంగోలు నియోజకవర్గం నుంచి ఎన్నికైన బాలినేని, కాంగ్రెస్ పార్టీ తరపున 1999, 2004, 2009 ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించారు. వైఎస్ఆర్ క్యాబినెట్‌లో, ఆ తర్వాత వైసీపీ తరపున గెలిచి 2019 జగన్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సమీప బంధువు కావడంతో ఆయన చెప్పిందే మాట చేసిందే శాసనం అన్నట్లుగా ఉండేది.
రకరకాల కారణాలతో క్రమంగా జగన్‌తో గ్యాప్ పెరిగి 2024 ఎన్నికల తర్వాత జనసేన వైపు నడిచారు బాలినేని. నాటి నుంచి 2019 ఎన్నికల వరకూ బాలినేని శ్రీనివాసులు రెడ్డి చెప్పిన వారికే టిక్కెట్లు దక్కేవి. అందుకే బాలినేని జిల్లా నేతలతో టచ్ లో ఉంటారు. వారు కూడా బాలినేని ప్రాపకం కోసం పాకులాడేవారు. అలాంటిది 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత బాలినేని వైసీపీకి రాజీనామా చేయడం, ఆ తర్వాత జనసేనలో చేరిపోవడం ఆశ్చర్యానికి గురి చేశాయి.
జనసేనలో చేరిన బాలినేని పని అయిపోయింది. ఆ నేత రాజకీయ చతురతకు ఎండ్ కార్డ్ పడింది… వైసీపీ వీడటమే ఆయన జీవితంలో చేసిన పెద్ద తప్పు జనసేనలో ఆయనను పట్టించుకునే నాధుడే లేడట….పవన్ కూడా ఆయనను పక్కన పెట్టేశారట ఇవన్నీ గత కొంతకాలంగా బాలినేనిపై వినపడుతున్న డైలాగులు. అయితే వీటన్నింటికి జనసేన అధినేత పవన్ ఫుల్‌స్టాప్ పెట్టారు. బాలినేనిపై ఇంతకాలంగా లేస్తున్న గొంతులు మూగబోయేటట్టు దెబ్బ కొట్టారు.
బాలినేనికి జనసేనలో ఎంత గౌరవం ఉందో ఒక్క డైలాగుతో క్లారిటీ ఇచ్చేశారు. పవన్ బాలినేనికి ఈ స్ధాయిలో ఇంపార్టెన్స్ ఇస్తున్నారని ఇప్పటి వరకు ఎవరు ఊహించలేదు. అయితే ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో పర్యటించిన జనసేన చీఫ్ పవన్, బాలినేనిపై ప్రత్యేక గౌరవం చూపించారు. ఈ ఒక్క సీన్‌తో పవన్ అందరికి అర్ధం అయ్యేలా చేశారు. జిల్లా అధ్యక్షుడుకు షేక్ హ్యాండ్‌తో సరిపెట్టిన పవన్, బాలినేనిని మాత్రం గుండెలకు హత్తుకున్నాడు. దీనిని బట్టే అర్ధం చేసుకోవచ్చు, పవన్ మనసులో బాలినేని ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది.
ఈ నెల 4న మార్కాపురంలో పర్యటించారు పవన్ కళ్యాణ్. జల్ జీవన్‌లో భాగంగా తాగునీటి పథకానికి శంకుస్ధాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో మంత్రులతో పాటు ఎంపీ మాగుంట, జిల్లాలోని పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, జనసేనకు చెందిన జిల్లా అధ్యక్షుడు రియాజ్‌తో పాటు బాలినేని పాల్గొన్నారు. సభలో ప్రభుత్వ కార్యక్రమాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన పవన్, అనంతరం వైసీపీ పై తీవ్రస్ధాయిలో ఫైర్ అయ్యారు. చివర్లో కూటమి పార్టీల మధ్య వైసీపీ చిచ్చు రాజాసే ప్రయత్నాలు చేస్తుందని పవన్ ఆరోపించారు.
ఆ విషయాన్నీ కూటమి నేతలు అర్ధం చేసుకోవాలని కోరారు. మరోవైపు బాలినేని, దామచర్ల మధ్య జరుగుతున్న వార్‌ను కూడా ఇన్ డైరెక్టుగా ఆయన ప్రస్తావించారు. కూటమన్న తర్వాత చిన్న చిన్న కలహాలు ఉంటాయని, అందరు వాటిని సర్ధుకుని పోవాలని సూచించారు. ప్రజలు అధికారం ఇచ్చింది మంచి చేయడానికే తప్ప, కొట్టుకోవడానికి, కేసులు పెట్టుకోవడానికి కాదని పవన్ చేసిన వ్యాఖ్యలు, దామచర్లను ఉద్దేశించి చేసినివిగానే కనబడుతున్నాయ్.
ఫైనల్‌గా సభ వేదిక దిగే ముందు కూడా పవన్ కళ్యాణ్ బాలినేనిపై ప్రశంసలు వర్షం కురిపించారు. రాజకీయాలు ఎలా చేయాలో తెలిసిన నేతగా బాలినేనిని అభివర్ణించారు పవన్, కక్ష సాధింపులు లాంటివి బాలినేని చేయడని కితాబు ఇచ్చాడు. బాలినేని అంత మంచి వ్యక్తి కాబట్టే జనసేనలోకి తీసుకున్నామని తెగ పొగిడాడు. అయితే ఇదంతా చూస్తున్న దామచర్లకు, జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్‌కు పవన్ వ్యాఖ్యలు మింగుడు పడినట్టు కనబడట్లేదు.
ఇప్పటికే బాలినేని అంటే ఆ ఇద్దరు నాయకులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్న పరిస్ధితులున్నాయ్. ఈ క్రమంలో బాలినేని పట్ల పవన్ చేసిన పాజిటివ్ కామెంట్స్, వారికి బాలినేనిపై మరింత అగ్గి రాజాసే అవకాశం తెచ్చి పెడుతున్నాయ్. మరోవైపు అధినేత కామెంట్స్ తో జనసేనలోని బాలినేని వర్గం సంబరాలలో మునిగితేలుతోంది. పార్టీలో బాలినేనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో అందరికీ తెలిసేలా పవన్ చేశారని బాలినేని వర్గం ఆనందం వ్యక్తం చేస్తోంది.
అయితే అదే సభపై ఉన్న జిల్లా అధ్యక్షుడు రియాజ్‌ను జస్ట్ పలకిరించిన పవన్, బాలినేనిపై మాత్రం అంత ప్రేమ ఎందుకు కురిపించాలని రియాజ్ వర్గం నుండి వినిపిస్తున్న వాదన. బాలినేనికి పవన్ అంత ఇంపార్టెన్స్ ఇవ్వడాన్నీ రియాజ్ వర్గం జీర్ణించుకోలేక పోతుందనే టాక్ కూడా వినిపిస్తుంది. మరోవైపు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల కూడా ఇన్ డైరక్టుగా పవన్ చేసిన కామెంట్స్ పట్ల ఎలా రియాక్ట్ కావాలో అర్ధం కాక సైలంట్ అయ్యారట.
పవన్ పై డైరెక్ట్ విమర్శలు చేస్తే పార్టీ అధిష్టానం నుండి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో నని సంకోచిస్తున్నారనే టాక్ వినపడుతుంది. ఇప్పటికైన బాలినేనిని దూరం పెడుతున్న జిల్లాలోని జనసేన నేతలు, పవన్ పాజిటివ్ కామెంట్స్ తర్వాతైనా బాలినేని అక్కున చేర్చుకుంటారో లేదో చూడాలి. ఇక చీటికి మాటికి సమయం దొరికనప్పుడల్లా బాలినేని పై విరుచుకుపడే దామచర్ల, ఇక నుండైనా సైలంట్ అవుతారా లేక తన పంథాను అలాగే కంటిన్యూ చేస్తూ బాలినేనిపై విమర్శల వర్షం కురిపిస్తారా అనేది చూడాలి.
పవన్ వ్యాఖ్యల తర్వాత బాలినేనికి పార్టీలో కాస్త పట్టు పెరిగిందనే చెప్పాలి. ఈ పరిణామాలన్నీ బాలినేనికి శుభకాలం మొదలైనట్టుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పవన్ వ్యక్తిగతంగా మాట్లాడటంతో పాటు, ఆయన్ను నమ్మకమైన నాయకుడిగా గుర్తించడం వల్ల, బాలినేనికి త్వరలోనే కీలక పదవి వస్తుందన్న చర్చ మొదలైంది. అధికారిక ప్రకటన ఎప్పటికైనా వచ్చే అవకాశం ఉండగా, బాలినేని ఇప్పుడు మరింత యాక్టివ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల పవన్ కల్యాణ్ పర్యటన బాలినేనికి మానసికంగా బలాన్నిచ్చింది. ఇప్పటి వరకు పార్టీ మారినప్పటికీ పెద్దగా చురుకుగా లేని ఆయన, ఇప్పుడు తిరిగి ఆక్టివ్ మోడ్ లోకి వచ్చే అవకాశం ఉందని అందరు భావిస్తున్నారు