Batthula Laxma Reddy: కుమారుడి రిసెప్షన్ రద్దు చేసి .. సీఎంకు రూ.2 కోట్ల విరాళం ఇచ్చిన ఎమ్మెల్యే

Batthula Laxma Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, కుటుంబసభ్యులు 2 కోట్ల రూపాయల చెక్ అందజేశారు. తాను అందజేసిన విరాళాన్ని తన నియోజకవర్గం లోని రైతుల కోసం ఖర్చు చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. యూరియా కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా అందజేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌ను ఎమ్మెల్యే బత్తుల రిక్వెస్ట్ చేశారు.
ఇటీవల ఎంఎల్ ఏ కుమారుడు సాయి ప్రసన్న వివాహం జరిగింది. మిర్యాలగూడలో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయాలని భావించిన ఎంఎల్ ఏ లక్ష్మారెడ్డి ఆ తర్వాత విరమించుకున్నారు. యూరియా కోసం అవస్థలు పడుతున్న రైతులకు ఆ ఖర్చు వినియోగించాలని నిర్ణయించుకుని సీఎంను కలిసి చెక్ అందజేశారు. రైతుల కోసం రెండు కోట్ల రూపాయల చెక్ ఇచ్చిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.



