పార్కింగ్ పరేషాన్.. భాగ్య నగరంలో ఏటా పెరుగుతున్న వాహనాల రద్దీ

Hyderabad: శరవేగంగా విస్తరిస్తున్న భాగ్య నగరానికి పార్కింగ్ అతి పెద్ద సమస్యగా మారుతున్నది. నిత్యం వేలాది కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ఏటా 20 శాతానికిపైగా కొత్త వాహనాలు నగరంలో రోడ్డెక్కుతున్నట్లు అంచనాలు ఉండగా, ఈ లెక్కన వచ్చే ఐదేండ్లలో మరో 25 లక్షల నూతన వాహనాలు సిటీలో సంచరించనున్నాయి. గ్రేటర్‌లో నిత్యం లక్షలాది వాహనాలు తిరుగుతుంటాయి.
ఇందులో సగానికి పైగా వాహనాలకు సరిపోయే పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో రోడ్లపైనే వాహనాలను నిలిపి ఉంచాల్సి వస్తున్నది. దీంతో అనివార్యంగా నగరంలో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం అవుతుండగా రానురాను ఇది మరింత జఠిలమైతున్నది. నగరంలో పార్కింగ్ సమస్యలపై జీహెచ్‌హెచ్ఎంసీ దృష్టి పెట్టింది.
నగరంలో పార్కింగ్ సమస్యను పరిష్కరించే దిశగా జీహెచ్‌ఎంసీ మరో అడుగు ముందుకేసింది. నగరంలో ఏటా పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా పార్కింగ్ యార్డులను నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇందుకోసం హెచ్‌ఎండీఏ, మెట్రో, ఇతర శాఖలతో కలిసి నగరంలో 75కు పైగా అధునాతన పార్కింగ్ యార్డులను నిర్మించాలని ప్రతిపాదించారు. తొలి దశలో 25 ప్రాంతాల్లో మల్టీ లెవల్ పార్కింగ్ యార్డులను నిర్మించడానికి ఆమోదం తెలిపారు.
ఇప్పటికే కేబీఆర్ పార్కు వద్ద బల్దియా ఆధ్వర్యంలో పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం మొదలైంది. అదే మాదిరి చార్మినార్ బస్టాండులో నిర్మాణం చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో కాంప్లెక్సు నిర్మాణానికి ప్రైవేటు సంస్థలను ఆహ్వానిస్తూ త్వరలో ప్రకటన విడుదల చేస్తామని బల్దియా స్పష్టం చేసింది. కాంప్లెక్సుల నిర్మాణానికి నగరంలోని పలు ఇతర ప్రాంతాలనూ అధికారులు పరిశీలిస్తున్నారు.
నగరంలో రద్దీగా ఉండే చార్మినార్‌తోపాటు జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయం, కేబీఆర్ పార్కు, మాదాపూర్ శిల్పారామం, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో బహుళ అంతస్తు పార్కింగ్ కాంప్లెక్సులను నిర్మించాలని జీహెచ్‌ఎంసీ గతంలో ప్రతిపాదన చేసింది. క్షేత్రస్థాయి పరిశీలన, స్థలాల ఎంపిక దాదాపు పూర్తయింది.
కొంత కాలానికి ప్రాజెక్టు అటకెక్కింది. కొత్త సర్కారు రాకతో ఏడాది కిందట ప్రాజెక్ట్‌లో కదలిక వచ్చింది. పీపీపీ పద్ధతిలో నిర్మాణాలు చేపట్టాలన్నది ప్రణాళిక. ఈ విధానం విజయవంతం అవుతుందని, మొత్తం 10చోట్ల నిర్మాణాలు చేపట్టేందుకు దశలవారీగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని జీహెచ్‌ఎంసీ చెబుతోంది.
చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, మక్కామసీదు, ఇతరత్రా వారసత్వ కట్టడాలను సందర్శించే పర్యాటకులు, స్థానికులకు పార్కింగ్ వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వాహనాలను రోడ్లపైనే నిలుపుతుంటారు. సమస్యకు పరిష్కారంగా చార్మినార్ బస్టాండులోని 4వేల చదరపు గజాలలో కాంప్లెక్సు నిర్మాణం చేపడుతున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. అలాగే నగరంలోని పలు ప్రధాన, అంతర్గత రోడ్లపై పార్కింగ్ వసతికి మార్కింగ్ పనులు చేపట్టానున్నారు.
నగరంలోని కొన్ని హోటళ్లు, పెద్ద పెద్ద కార్యాలయాల వద్ద పార్కింగ్ స్థలం లేకపోవడంతో వాహనాలను రోడ్లపైనే నిలుపుతున్నారు. మరోవైపు ప్రస్తుతం వ్యాలెట్ పార్కింగ్ పేరిట అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. ఇక మెట్రో స్టేషన్లకు వచ్చే వాహనాలను రోడ్లపైనే పార్కింగ్ చేయడంతో రక్షణ లేకుండా పోయిందని వాహనదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు పార్కింగ్ సమస్యను వేగంగా చెక్ పెట్టాలని నగరవాసులు కోరుతున్నారు.



